కొండెక్కిన కోడి…

హైదరాబాద్ ముచ్చట్లు:
 
కొందరికి ప్రతిరోజు ముక్క ఉంటే గానీ ముద్ద దిగదు. అందులోనూ చికెన్ తప్పనిసరి. ఇప్పుడు అదే కోడి కొండెక్కి కూర్చుంది. ఉన్నపళంగా ధర పెరిగి మాంసాహార ప్రియుల్ని బెంబేలెత్తిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు వంట నూనెల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ఇతర నిత్యావసరాలు ఎప్పటి నుంచో ఆకాశంలో విహరిస్తున్నాయి. ఇప్పుడు మాంసం ధరలు సైతం మండిపోతున్నాయి. చికెన్‌ ముక్క ముడితే ధరల వేడి సెగ తగులుతోంది. మటన్‌ ధరలు ఆల్రెడీ హైలో ఉండగా, ఇప్పుడు కోడి కూర కూడా ప్రియమైపోయింది. మూడు వారాల వ్యవధిలోనే చికెన్ ధర ఏకంగా రూ.100పెరిగిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు చోట్లా పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి మాంసాహారానికి డిమాండ్ బాగా పెరిగింది. అప్పట్నుంచి మాంసం ధరలు కొండెక్కుతూనే ఉన్నాయి. నిత్యాసవరాల ధరలతో పాటు కోడి కూర ధర పెరగడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు.కోడి మాంసం ధర బాగా పెరుగుతోంది. 20 రోజుల క్రితం కిలో 175 ఉండగా.. తాజాగా 280కి విక్రయిస్తున్నారు. ఇంకా పెరిగే అవకాశముందని కోళ్ల పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున 10 లక్షల కిలోల కోడి మాంసం విక్రయిస్తారని అంచనా. సండే రోజు 15 లక్షల కిలోలకు పైగా ఉంటోంది. కరోనా భయం తగ్గడంతో పది రోజుల్లో రోజుకు అదనంగా లక్ష నుంచి 2 లక్షల కిలోల కోడి మాంసం అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం చలికాలం ముగిసి వేసవి ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 37 39 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఈ వాతావరణ మార్పుల్ని తట్టుకోలేక కోడిపిల్లలు మృత్యువాత పడుతున్నాయి.
 
 
దీనికి తోడు సోయాచెక్క, మొక్కజొన్న దాణా ధరలూ పెరిగాయి. క్వింటాలు సోయాచెక్క దాణా ధర ఏడాది క్రితం 4 వేల నుంచి 5 వేలు ఉండగా.. ప్రస్తుతం 7,200 రూపాయలు ఉంది. ఈ కారణాలతో మాంసం ధర పెరిగింది.నాటుకోడి మాంసం ధర కిలో 400 నుంచి 500కి చేరింది. నాటుకోళ్ల లభ్యత లేకపోవడంతో ధర అమాంతం పెరుగుతోంది. మధ్యప్రదేశ్‌ అడవుల్లో పెరిగే కడక్‌నాథ్‌ కోళ్లను కొందరు వ్యాపారులు తెచ్చి.. ఇక్కడి ఫారాల్లో పెంచి కిలో మాంసం 500కి అమ్ముతున్నారు. ఈ మాంసంలో పోషకాలుంటాయనే ప్రచారంతో వినియోగదారులు ఆసక్తి కనబరుస్తుండటంతో దీని ధర కూడా పెరుగుతోంది.ప్రతి వేసవిలో చికెన్‌ ధరలు పెరుగుతాయి. ఎండల వేడిమి తాళలేక కోళ్లు చనిపోవడం, అనారోగ్యానికి గురికావడం సర్వసాధారణం. దీంతో రైతులు తక్కువగా పిల్లల్ని వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుత ధరలు వేసవిలో ఉండాల్సినదానికన్నా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వేసవి మొత్తం చికెన్‌ ధరలు భారీగా పెరుగుతాయని వ్యాపారులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో.. ఎండలు పెరిగేకొద్దీ రాబోయే రోజుల్లో చికెన్ కిలో రూ.350 నుంచి రూ.400 వరకు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదని పౌల్ట్రీ వర్గాలు అంటున్నాయి. అదీగాక ఇటీవల మక్కజొన్న, సోయాబీన్‌ ధరలు భారీగా పెరగడంతో దాణా ఖర్చు రెట్టింపు అయ్యిందని, దాన్ని భరించలేక రైతులు కోళ్ల పెంపకాన్ని మానేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఉత్పత్తి తగ్గుతున్నదని, ఈ ప్రభావం ధరలపై ఉన్నదని పేర్కొంటున్నారు.
 
Tags: Climbed hen