-ధాన్యం సేకరణ విధానంలో సమూల మార్పులు తేవాలని చంద్రబాబు ఆదేశం
-పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయం ద్వారా అందుబాటులో నిత్యావసర వస్తువులు
-రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
అమరావతి ముచ్చట్లు:
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఫౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమీక్ష జరిపారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని పేర్కొన్న సీఎం చంద్రబాబు .. రానున్న రోజుల్లో ఆ తరహా ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.వైసీపీ హయాంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తం.రైతులకు ధాన్యం సేకరణ సొమ్ము చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేశారని.. దీని వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని సీఎం పేర్కొన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తీవ్ర ఇక్కట్ల పాలు చేశారని చెప్పారు. 2019కి ముందు వరకు సివిల్ సప్లై శాఖ అప్పులు రూ.21,622 కోట్లు కాగా.. అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆ అప్పులను రూ.41,550 కోట్లకు తీసుకువెళ్లి సివిల్ సప్లై శాఖను నాశనం చేసిందని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైశాఖ, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యం అవుతుందని చెప్పారు.రేషన్ షాపుల్లో తక్కువ ధరకే మరిన్ని సరుకులు.ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ ద్వారా 2,372 కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం అమ్మకాలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మార్కెట్ లో కందిపప్పు ధర రూ.180 రూపాయలు ఉండగా, ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ.150కు, బియ్యం కూడా కేజీ రూ.48లకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. రేషన్ షాపుల్లో మరిన్ని సరుకులు తక్కువ ధరకు అమ్మాలని అధికారులకు సిఎం సూచించారు. తెలుగుదేశం హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవాళ్లమని, గత ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని, వాటిని మళ్లీ పునరుద్ధరించాలని అన్నారు.
బియ్యం డోర్ డెలివరీ వాహనాలను ఏం చేద్దాం?
బియ్యం డోర్ డెలివరీ విధానం
కూడా లోపభూయిష్టంగా సాగిందని అధికారులు అంగీకరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరగలేదని, వీధి చివర వాహనం పెట్టి మాత్రమే పంపిణీ చేశారని అధికారులు సీఎంకు వివరించారు. రేషన్ డోర్ డెలివరీ పేరుతో రూ.1,844 కోట్లతో 9260 వాహనాలు (ఎండీయూ) కొనుగోలు చేశారని, అయితే ఆ లక్ష్యం నెరవేరలేదని అధికారులు చెప్పారు. ఈ వాహనాలను కూడా బియ్యం స్మగ్లింగ్ కు వాడుకున్న అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. వీటి విషయంలో ఎలా వ్యవహరించాలి, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై పలు ప్రతిపాదనలతో రావాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
Tags: CM Chandrababu’s review of civil supplies department.. Key instructions to officials