ముసాయిదాపై సీఎం చంద్రబాబు సమీక్ష

పెట్టుబడులే లక్ష్యం.. నూతన పారిశ్రామిక విధానం.. సెప్టెంబరు 20న!

పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో కొత్తగా 4పీ విధానం

ఇతర రాష్ట్రాల్లోని ఐదు అత్యుత్తమ పాలసీల పరిశీలన

 

అమరావతి ముచ్చట్లు:

 

రాష్ట్రానికి పారిశ్రామిక సౌరభాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా సెప్టెంబరు 20న కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. వైకాపా హయాంలో ప్రవేశపెట్టిన 2023-27 పారిశ్రామిక విధానం వల్ల ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం సాధ్యం కాదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. పారిశ్రామికవేత్తలకు అనువైన పారిశ్రామిక విధానం ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని.. దీనికోసం నిబంధనలను సరళీకరించాలని యోచిస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధుల సేకరణకు కొత్తగా 4పీ విధానం తీసుకురావాలని ఆలోచిస్తోంది. కోర్ పారిశ్రామిక విధానంతో పాటు.. కీలక రంగాలకు సంబంధించి అనుబంధ పాలసీని ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు 2024-29 ముసాయిదా పారిశ్రామిక విధానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సోమవారం సమీక్షించారు. కొత్త పారిశ్రామిక విధానం ఎలా ఉండాలనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 16న పారిశ్రామికవేత్తలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ముసాయిదా పారిశ్రామిక విధానంపై భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలు స్వీకరించి.. అవసరమైన మార్పులతో రావాలని అధికారులకు సూచించారు. ఈ నెల 23న తుది సమీక్ష జరిపి, కొత్త పాలసీ విధివిధానాలను సీఎం ఖరారు చేసే అవకాశం ఉంది.

వివిధ రాష్ట్రాల అత్యుత్తమ పాలసీలపై అధ్యయనం

సమీక్షలో సీఎం మాట్లాడుతూ దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఐదు ఉత్తమ పారిశ్రామిక విధానాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ‘ఆ రాష్ట్రాలు గత కొన్నేళ్లుగా స్థిరంగా పెట్టుబడులను సాధించడానికి అనుసరిస్తున్న అత్యుత్తమ నిబంధనలు ఏంటి? ఆయా రాష్ట్రాల వైపు పారిశ్రామికవేత్తలు ఆకర్షితులు కావడానికి దోహదం చేసిన అంశాలేంటి? వాటిని రాష్ట్రానికి ఆపాదించడానికి ఉన్న అవకాశాలేంటి? అంతకంటే మెరుగైన పరిస్థితులు రాష్ట్రంలో ఏమైనా ఉన్నాయా అనే వాటి ఆధారంగా కొత్త పారిశ్రామిక విధానం ఉండాలి. దీనికోసం గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పారిశ్రామిక విధానాలను పరిశీలించాలి’ అని అధికారులకు సూచించారు. 2014-19 మధ్య రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన రాయితీలు, పెట్టుబడులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యంలో దేశంలో మొదటి స్థానాన్ని సాధించిన అప్పటి పరిస్థితులు మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏటా సగటున 15 శాతానికి పైగా వృద్ధి రేటు లక్ష్యంగా ఉండాలని నిర్దేశించారు.

పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధి

రాష్ట్రంలో 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా, లాజిస్టిక్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహారశుద్ధి రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉంది’ అని చంద్రబాబు సూచించారు.

‘పరిశ్రమలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి పీపీపీ విధానంలో ప్రస్తుతం ప్రాజెక్టులు చేపడుతున్నాం. పారిశ్రామిక పార్కులను 4పి విధానంలో ఏర్పాటు చేయడానికి కొత్త పాలసీలో ప్రాధాన్యమివ్వాలి. అంటే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే.. ప్రజలనూ భాగస్వాములను చేయాలి’ అని సూచించారు.

విలువ జోడింపు ఎలా?

రాష్ట్రం నుంచి ప్రస్తుతం 53 శాతం ముడిసరకులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. వాటిని ఉపయోగించి ఇక్కడే ఉత్పత్తులకు విలువ జోడించేలా చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి. దేశానికి వచ్చే ప్రతి పరిశ్రమ రాష్ట్రానికి వచ్చి తీరాలనే లక్ష్యంతో పనిచేయాలి. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వేగవంతంగా ఇస్తే పెట్టుబడులు తరలిరావడానికి ఆస్కారం ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

Tags: CM Chandrababu’s review of the draft

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *