Natyam ad

విశాఖ పై సీఎం జగన్ కీలక నిర్ణయం – రూట్ మ్యాప్ ఫిక్స్..!?

విశాఖ ముచ్చట్లు:


విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మూడు రాజధానుల నిర్ణయం అమల్లో భాగంగా.. ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విశాఖలో రెండు అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు జరగనున్నాయి. అంతర్జాతీయ ఇన్వెస్టర్స్ మీట్.. జీ 20 సన్నాహక సదస్సు జరగనున్నాయి. ఆ వెంటనే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా రూట్ మ్యాప్ ఫిక్స్ చేస్తున్నారు.

ఉగాది నాడు విశాఖ కేంద్రంగా ప్రారంభం..
ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఈ నెలాఖరున తీర్పు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మూడు రాజధానులకు అనుకూలంగా నిర్ణయం వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తీర్పు ఎలా ఉన్నా.. ముఖ్యమంత్రిగా విశాఖ నుంచి పాలన చేయటానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. దీంతో.. ముందుగా విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభించి.. ఉగాది నాడు అక్కడ నుంచి పరిపాలన ప్రారంభించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుల గురించి రివ్యూ నిర్వహించారు. అధికారులకు సూచనలు చేసారు. అదే సమయంలో విశాఖ కేంద్రంగా పాలన పైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు విశాఖ నుంచి పాలన పైన చెబుతూ వస్తున్నారు.

బడ్జెట్ సమావేశాలు తరువాత..
ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు అమరావతిలో జరగనున్నాయి. అప్పటి లోగా సుప్రీంకోర్టులో తీర్పు పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. విశాఖలో మార్చి నెలాఖరు నుంచి పాలన ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభం తరువాత సీఎం అక్కడ నుంచే సమీక్షలు.. మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. మంత్రులు కూడా విశాఖలోనే క్యాంపు కార్యాలయాలు సిద్దం చేసుకోనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి సచివాలయం కూడా విశాఖ నుంచి కొనసాగే అవకాశం ఉంది. సచివాలయం తరలింపు అంశం సుప్రీం తీర్పుకు అనుగుణంగా నిర్ణయించనున్నారు. అయితే, మంత్రులు మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖలో పాలన ప్రారంభం అవుతుందని మంత్రులు పదే పదే చెబుతున్నారు.

రాజకీయంగా పై చేయి సాధించేలా
విశాఖలో పాలన ప్రారంభించటం ద్వారా చెప్పిన విధంగా ఉత్తరాంధ్రలో పాలనా రాజధాని ప్రారంభించినట్లవుతుందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. వైసీపీ మూడు రాజధానులకు అనుకూలంగా ఉంటే.. ప్రతిపక్షాలు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మూడు రాజధానులకు న్యాయ పరంగా అనుమతి సాధ్యం కాదనేది ప్రతిపక్షాల ధీమా. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పాలించే అవకాశాన్ని ఈ విషయంలో సద్వినియోగం చేసుకొని ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ విశాఖ నుంచి పాలనపైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

 

Tags: CM Jagan’s key decision on Visakha – route map fix..!?