కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుమల ముచ్చట్లు:
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.మొదటిరోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 11నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.

సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు శ్రీసీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమివ్వనున్నారు. సాయంత్రం 6.30 నుండి 9 గంటల వరకు పవిత్ర ప్రతిష్ఠ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాన్ని ఆర్జిత సేవగా ప్రవేశపెట్టారు. రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు ఉత్తరీయం, రవికె, చివరి రోజు ఒక పవిత్రమాలను బహుమానంగా అందజేస్తారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో దుర్గరాజు, ఆలయ ప్రధాన అర్చకులు ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags: Commencement of sacred ceremonies at Kodandaramalayam
