కొత్త  భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం 

-నంద్యాలలో ఆందోళన
Date:15/03/2018
కర్నూలు ముచ్చట్లు:
నంద్యాల మున్సిపాల్టీలో  దుకాణాలు కేటాయించాలన్న హామీలు నెరవేర్చాలంటూ ఆందోళన బాట పట్టారు.పురపాలిక బృహత్‌ ప్రణాళిక ప్రకారం గాంధీచౌక్‌ నుంచి పద్మావతి నగర్‌ ఆర్చి వరకు 60 అడుగులు, పద్మావతి నగర్‌ నుంచి సాయిబాబా నగర్‌ తోరణం వరకు 80 అడుగుల రహదారి ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. 60 అడుగుల రహదారి విస్తరణలో బాధితులకు అప్పటి మార్కెట్‌ విలువ ప్రకారం చదరపు గజం రూ.18 వేలు ఉండటంతో కొత్త భూసేకరణ చట్టప్రకారం రూ.45 వేలుగా నిర్ధరించారు. అదే 80 అడుగుల రహదారి విస్తరణలో బాధితులకు మార్కెట్‌ విలువ రూ.6,500 ఉండటంతో చదరపు గజం రూ.16,250 ప్రకటించారు. ఓ ప్రజాప్రతినిధి, ఆయన బంధుగణం ఉండటం వల్లే ఎక్కువ పరిహారం ప్రకటించారని అప్పట్లో విమర్శలు తలెత్తాయి. ఒకే ప్రాంతంలో మార్కెట్‌ విలువ అంత వ్యత్యాసం ఎందుకు ఉంటుందని అధికారులను నిలదీశారు. ఎట్టకేలకు బాధితుల గోడుతో ప్రజాప్రతినిధులు స్పందించి బాధితులందరికీ ఒకే నష్ట పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు విస్తరణలో పూర్తిగా స్థలం, నిర్మాణాలు కోల్పోయిన 69 కుటుంబాలకు పురపాలక సంఘానికి చెందిన వ్యాపార సముదాయంలో దుకాణాలను కేటాయిస్తామని తెలిపారు.రహదారి విస్తరణలో మొత్తం 405 మంది(239+166) బాధితులున్నారు. రహదారుల విస్తరణ పనులు గతేడాది జులైలో ప్రారంభించారు. 60 అడుగుల రోడ్డులో 236 నిర్మాణాలకు, ఏడువేల చదరపు అడుగులకు కలిపి రూ.35.35 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉండగా… ఇప్పటివరకు 184 మందికి రూ.25.10 కోట్లు చెల్లించారు. మిగిలిన 55 మందికి సంబంధించి 35 మంది బాధితులకు రూ.3.49 కోట్లు చెల్లించడానికి ప్రస్తుతం ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా, 80 అడుగుల రహదారి బాధితులు 166 మందికి ఒక్కపైసా పరిహారం అందకపోవడంతో కొన్ని రోజులుగా ఆందోళనకు దిగారు. రహదారుల విస్తరణ పోరాట కమిటీ సాయంతో పలుసార్లు ప్రజాప్రతినిధులను కలిసి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు యత్నాలు సాగుతున్నాయి.బాధితులు ఆందోళన ప్రదర్శనతోపాటు, అర్జీల పరంపర కొనసాగడంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం 166 మంది బాధితులకు చదరపు అడుగు రూ.16,250 చొప్పున రూ.16.52 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందరికీ సమాన నష్ట పరిహారం ఇస్తామన్న హామీ నెరవేర్చాలని బాధితులు పట్టుబడుతున్నారు. జిల్లా యంత్రాంగం చ.అ.కి రూ.30 వేలు, రూ.35 వేలు, రూ.40 వేలు, రూ.45 వేలు చొప్పున ఇస్తే ఎంత అదనంగా ఇవ్వాల్సి వస్తుందో ప్రతిపాదనల్లో పొందుపరిచారు. సమాన నష్టపరిహారం ప్రతిపాదన మేరకు పరిశీలిస్తే రూ.24.84 కోట్లు అదనంగా 80 అడుగుల రోడ్డులోని బాధితులకు చెల్లించాల్సి వస్తోంది. వెంటనే పరిహారం అందజేయాలని బాధితులు కోరుతున్నారు.
Tags: Compensation as per new land acquisition law

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *