తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

Complete arrangements for rafting ceremonies in Tirumala

Complete arrangements for rafting ceremonies in Tirumala

   Date:15/03/2019
 తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.మార్చి 16వ తేదీ శనివారం రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం తెప్పను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిణిని అందంగా అలంకరించారు. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో ఆనందవిహారం చేస్తారు. ప్రతి ఏటా పాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు ఘనంగా జరుగుతాయి.
తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై తిరునాళ్’, తెలుగులో ‘తెప్ప తిరునాళ్లు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో ”నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి.
తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 16న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 17న రుక్మిణీ సమేతంగా శ్రీక ష్ణస్వామి అవతారంలో మూడుమార్లు విహరిస్తారు.
ఇక మూడవరోజు మార్చి 18న  శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుమార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 19న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 20వ తేదీ ఏడుమార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు :
తెప్పోత్సవాల కారణంగా మార్చి 16, 17వ తేదీల్లో వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవ, మార్చి 18, 19, 20వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
Tags:Complete arrangements for rafting ceremonies in Tirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *