కరీంనగర్ జిల్లాలో కామ్రేడ్ల కొట్లాట రచ్చరచ్చ

Date:13/07/2019

కరీంనగర్ ముచ్చట్లు:

కమ్యూనిస్టు పార్టీ. కాషాయ పార్టీ. రెండూ రాజకీయ పార్టీలే. కానీ సైద్దాంతిక పరంగా రెండింటికీ, ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా. పొరపాటున కూడా ఇవి కలిసే అవకాశం లేదు. ఇందులోని నాయకులు కూడా పార్టీ మారే ఆలోచనలు చేయడం చాలాచాలా తక్కువ. కానీ తెలంగాణ సీపీఐలోని కొందరు నాయకులు, ఆధిపత్యపోరుతో చివరికి కండువా కూడా మార్చేయాలన్న ఆలోచన చేస్తున్నారట. పార్టీలో ఉండలేక, పోలేక సతమతమవుతున్నారట. అందుకే బద్ద విరోధి అయిన, బీజేపీలోకి సైతం వెళ్లడానికి ఒక సీపీఐ నాయకుడు ప్రయత్నిస్తున్నాడన్న ఊహాగానాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో కామ్రేడ్ల కొట్లాట రచ్చరచ్చవుతోంది.

 

 

అన్ని రాజకీయ పార్టీల్లాగే, వామపక్ష పార్టీల్లోనూ ఆధిపత్యపోరుతో నాయకుల వ్యక్తిగత గొడవలు బజారుకెక్కుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ కరీంనగర్‌ జిల్లా సీపీఐలో ముసలం. మొదటి నుంచి కరీంనగర్‌ జిల్లాలో కొన్ని ప్రాంతాలు సీపీఐకి కంచుకోట. అయితే ఆయా ప్రాంతాల్లోని సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కావాలనే రాజకీయాలు చేస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి రామ్ గోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను వెనువెంటనే ఆమోదించకుండా జిల్లా కమిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ఈ వ్యవహారంతో కమ్యూనిస్టు పార్టీలో కలకలం మొదలైంది.

 

 

రాజీనామా చేసిన కరీంనగర్ జిల్లా కార్యదర్శి రామ్ గోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతున్నట్టు ఊహాగానాలు కూడా ప్రారంభమయ్యాయి.  అయితే ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలు పార్టీలో చిచ్చు రేపినట్టుగా తెలుస్తోంది. పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సొంత గ్రామం రేకొండలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఉండగా, కేవలం ఒక ఎంపీటీసీ స్థానం మాత్రమే గెలిచారు. దీంతో పాటు మొదటి నుంచి ఒక జడ్పీటీసీ స్థానాన్నయినా, కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో సిపిఐ పార్టీ ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఆ అవకాశాలు, ఆ వ్యూహాలు తారుమారయ్యాయి. దీనికి కారణం సిపిఐ పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు కావాలనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డారని ఆరోపించారు జిల్లా కార్యదర్శి రాంగోపాల్ రెడ్డి.

 

 

ఈ వ్యవహారంపై జిల్లా కార్యదర్శి రామ్ గోపాల్ రెడ్డి, రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఎలాంటి స్పందనా లేకపోవడంతో జిల్లా కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ పంపించారు. రాజీనామా లేఖపై రాష్ట్ర నాయకత్వం చర్చలు జరుపుతుందని కార్యకర్తలనుకున్నారు. అయితే రాజీనామా పక్కనపెట్టి జిల్లా కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు చాడ వెంకటరెడ్డి మీడియా ముఖంగా ప్రకటించారు.

 

 

 

ఈ వ్యవహారంతో సిపిఐ పార్టీ కరీంనగర్ జిల్లాలో రెండుగా చీలిపోయింది. నిన్నటి వరకు జిల్లా కార్యదర్శిగా ఉన్న రామ్ గోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంతో, ఇప్పుడు మరో చర్చ కమ్యూనిస్టు పార్టీతో పాటు రాజకీయాల్లోనూ మార్మోగిపోతోంది. సిపిఐ పార్టీకి జిల్లా స్థాయిలో పని చేసిన రామ్ గోపాల్ రెడ్డి, బిజెపిలో చేరుతారంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే దీనికి రామ్ గోపాల్ రెడ్డి ఇంకా గట్టిగా ఖండించడంతో వాటికి మరింత బలమిస్తోంది.

 

 

 

అయితే సిపిఐ రాష్ట్ర కార్యవర్గంతో ఇంకా చర్చలు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన సీపీఐ నేతలు, మనస్పర్ధలు తొలగించుకుంటారో, లేదంటే విరుద్ద భావజాలమైన కమలంలో చేరిపోతారోనని, కామ్రెడ్లు చర్చించుకుంటున్నారు.

రోజా సౌండ్… తగ్గింది

Tags: Comrades melee rachcharchu in Karimnagar district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *