Natyam ad

ఇక  అధికార పార్టీలతో కామ్రేడ్లు

హైదరాబాద్ ముచ్చట్లు:


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం వరకు కమ్యూనిస్టులకంటూ ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ముందుండి నడిపిన ఘన చరిత్ర కల్గిన కామ్రేడ్ లు ప్రస్తుతం అలసిపోయారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి తెలంగాణకు ముందు, తరువాత అన్నట్టు తయారైంది. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అనంతర పరిణామాల్లో ఉప ఎన్నికలకు తెరలేపింది. దీన్ని ఆసరాగా చేసుకున్న భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దీంతో అధికార పార్టీకి అనివార్యంగా కమ్యూనిస్టు పార్టీల అవసరమొచ్చి పడింది. దీంతో అడిగిందే తడవుగా కమ్యూనిస్టులు సైతం అధికార పార్టీకి మద్ధతు తెలుపుతున్నారు తప్ప.. సొంతపార్టీని అభివృద్ధి పరుచుకునే ఆలోచనలు చేయడం లేదు. ఇందుకు మొన్నటి సీఎం మునుగోడు సభే సాక్ష్యం.మునుగోడు నియోజకవర్గంలో ఐదు సార్లు గెలిచిన సీపీఐకి అక్కడ అభ్యర్ధి లేకపోవడం, పోటీ చేసేందుకు రెడీగా లేమంటూ ఆ పార్టీ నేత పల్లా వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీని నిర్వేదంలోకి నెట్టివేశాయి. కేవలం బీజేపీని సాకుగా చూపించి మాత్రమే లెఫ్ట్ పార్టీలు తెరాసకు దగ్గరవుతున్నాయి.

 

 

తప్పితే ఎన్నికల్లో పోటీచేసేంత బలాన్ని పెంచుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ఇప్పటికే కమ్యూనిస్టులకు కంచుకోటలుగా చెప్పుకున్న ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో చాలా వరకు బీటలు వారాయి. కొన్ని జిల్లాల్లో అసలు ఉనికే ప్రశ్నార్థకంగా మారిందంటే.. కమ్యూనిస్టు పార్టీలు ఏ పరిస్తితుల్లో ఉన్నాయో స్పష్టమవుతోందిఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ కాంగ్రెస్, తేదేపాలకు మద్ధతిస్తూ కాలం గడిపిన ఎర్రన్నలు.. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ తో దోస్తానా చేస్తున్నారు. ప్రస్తుతం పొత్తులకు సిద్ధమవుతున్న లెఫ్ట్ పార్టీలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ బహిరంగంగానే ‘అవొక తోకపార్టీలు” అని ఎద్దేవా చేసినా.. ఏ మాత్రం పట్టించుకోకపోగా, పిలిచిందే తడవుగా పొత్తులకు సిద్ధమవడం పట్ల రాజకీయంగా విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న లెఫ్ట్ పార్టీలకు రోజురోజుకు ప్రజాదరణ కరువవుతోంది. దీంతో సొంత ప్రాబల్యాన్ని కాపాడుకోలేక జీవన్మరణ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇందుకు గతకాలపు తప్పిదాలేనన్న క్లారిటీ ఉన్నా..

 

 

Post Midle

వాటిని పూడ్చేందుకు ఎలాంటి కార్యాచరణ లేకపోవడం కూడా కుంగిపోయేందుకు మరింత దోహదం చేస్తోంది. ఇవన్నీ ఒక వైపైతే మరోవైపు కామ్రేడ్స్ పార్టీ అభివృద్ధిని మరిచి సొంతలాభం కోసం పాటుపడుతున్నారని, ఆ కారణంతోనే చాలా మంది పార్టీని వీడుతున్నారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలను సైతం ఖండించకపోవడం గమనార్హం.పుచ్చలపల్లి సుందరయ్య నుంచి నేటి సీతారాం ఏచూరి వరకు బీజేపీ, కాంగ్రెస్ లను బూచిగా చూపిస్తూ వాటిని ఓడించడమే లక్ష్యం, ధ్యేయంగా కమ్యూనిస్టులు పనిచేస్తున్నారని, రాష్ట్రాల్లో అధికార పార్టీలు వ్యవహరిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపైనా ఉద్యమాలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ ఛాయలు కనిపించడం లేదు. పైగా అప్పటి నుంచి ఇప్పటి వరకు పొత్తులతోనే కాలం వెళ్లదీస్తున్నారు తప్పితే.. కమ్యూనిస్టు పార్టీలు బలపడేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఇందుకు ప్రస్తుత పార్టీ పరిస్థితులే నిదర్శనం. అయితే సొంతంగా పోటీ చేయలేకపోవడం వలన కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు కొంత ఇబ్బందికర పరిస్థితులేర్పడగా, కేడర్ తగ్గిపోయింది.రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మరింత వేడిని రాజేస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే కామ్రేడ్లు కూడా ఇతర పార్టీలతో పొత్తుల కోసం ఆత్రుత పడుతున్నారు.

 

 

అయితే ఇతర పార్టీలతో పొత్తుకు ఆత్రుత పడుతున్న ఎర్రన్నలు ఉభయ కమ్యూనిస్టు పార్టీల పొత్తుపై మాత్రం పెదవి విప్పడం లేదు. ఎన్నో సందర్భాల్లో సౌహార్ద్ర సందేశమిచ్చుకున్న ఉభయ కమ్యూనిస్టులు..ఏకమయ్యేందుకు ఏ కారణం అడ్డొస్తుందనేది సమాధానం లేని ప్రశ్న. ఉభయ కమ్యూనిస్టులు ఏకమయితే ఎంతోకొంత మార్పు వచ్చే అవకాశం ఉన్నా..ఆ అంశాన్ని వదిలి ఇతర పార్టీలతో పొత్తుకు మాత్రం సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో తమ పార్టీలు కొంత క్షీణించాయన్న సందేశాలను కూడా ఆ నేతలే సభావేదికల సాక్షిగా ఇస్తుండడంతో క్షేత్రస్థాయి కార్యకర్తల్లో మనోధైర్యం సన్నగిల్లుతోంది.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కమ్యూనిస్టులను అధికార పార్టీ పొత్తుల కోసం ఆహ్వనించడంతో కమ్యూనిస్టులు సైతం ఓకే చెప్పారు. కానీ భవిష్యత్ ప్రయాణంలోనూ ఇదే పరిస్థితి నెలకొంటుందా? లేక వచ్చే ఎన్నికల్లో తమ వ్యూహాం మారుతుందా? అన్నదానిపై లెఫ్ట్ పార్టీల్లో క్లారిటీ లేదు. ఒకవేళ భవిష్యత్ లోనూ పొత్తుల ప్రయాణం చేస్తే కచ్చితంగా కమ్యూనిస్టులు చారిత్రక తప్పిదం చేసినట్టే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.పోటీలోకి దిగకుండా పొత్తులతో సొంతపార్టీలను క్షీణింపజేసి..పొత్తుల ప్రయాణం చేస్తే లెఫ్ట్ పార్టీలు క్రమంగా క్షీణించే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా కమ్యూనిస్టులు మేల్కొని ఇతర పార్టీలతో పొత్తు ప్రయాణాలపై సుదీర్ఘంగా చర్చించి, సొంత పార్టీలను అభివృద్ధి పరుచుకునే దిశగా కార్యాచరణ రూపొందించకపోతే నష్టాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఈ అంశంపై కామ్రేడ్లు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాయో.

 

Tags: Comrades with the ruling parties

Post Midle

Leave A Reply

Your email address will not be published.