బియ్యపు మధు అవినీతి,అక్రమాలు పై న్యాయ విచారణ జరపండి

శ్రీ కాళహస్తి ముచ్చట్లు:

గత వైసీపీ ప్రభుత్వ పాలనలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడబెట్టిన అక్రమాస్తులు, సాగించిన అవినీతి, అక్రమాలపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ డిమాండ్ చేశారు. తాను అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపడతానని ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పోలీస్, రెవెన్యూ, ఆలయం, ఇంకా పలు ప్రభుత్వ శాఖల అధికారులను దళారులుగా మలుచుకుని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సాగించిన అవినీతి దందాకు హద్దే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి, బడి, ఇసుక, మైనింగ్, భూ దందాలు చేయడానికే ఆయన ఎమ్మెల్యే అయినట్లు వ్యవహరించారని విమర్శించారు. అవినీతి ఎమ్మెల్యేలకు బిరుదులు కేటాయిస్తే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి నెంబర్ వన్ అవినీతి చక్రవర్తి’ అనే గొప్ప బిరుదివ్వచ్చని ఎద్దేవా చేశారు. జగన్న కాలనీల పేరిట వందల కోట్ల అవినీతి చోటు చేసుకుందనీ, మాజీ ఎమ్మెల్యే, ఆయన బంధువులు, అనుచరులు కలిసి రైతుల పొట్టగొట్టారని ఆరోపించారు.

 

 

ఆయన పీఏగా వ్యవహరించిన గుణశేఖర్ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడ గట్టారనీ, ఆయనపైన కూడా విచారణ జరిపి ఉపాధ్యాయ విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గత ఐదేళ్లలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందనీ, ముఖ్యంగా వెండి నిల్వలు, కొనుగోళ్లు, నాగపడగల విషయంలో మాజీ ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వెండి నిల్వలు, కొనుగోళ్లపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని ప్రయివేట్ పరిశ్రమలతో కుమ్మకై రూ.కోట్లు ఆర్జించారన్నారు. ఫలితంగా అటు ప్రజలు, ఇటు కార్మికులు తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాంకో పరిశ్రమ చేసిన చిందేపల్లి రోడ్డు అక్రమణను ఈ సందర్భంగా ఉదహరించారు. ఎమ్మెల్యేగా దిగిపోతూ కూడా రాజీవ్ నగర్ లో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారనీ, ఆ భూమిని స్వాధీనం చేసుకోకుంటే తామే పేదల సమక్షంలో జెండాలు పాతి గుడిసెలు వేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆయన పీఏ గుణశేఖర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతిపై సమగ్ర న్యాయ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామిశెట్టి వెంకయ్య, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకటరత్నం కూడా మాజీ ఎమ్మెల్యే, ఆయన పీఏ అవినీతిపై విచారణ జరపాలని కోరారు. రైతు సంఘం జిల్లా నాయకుడు మోహన్ నాయుడు పాల్గొన్నారు.

 

Tags;Conduct a judicial inquiry into the corruption and irregularities of Biyyapu Madhu

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *