తల్లి తర్వాత మనం పూజించేది భూమిని
రైతు కంట్లో నీరు తుడిచేందుకే రెవెన్యూ సదస్సుల ఏర్పాటు
రెవెన్యూ సదస్సులలో అందరూ భాగస్వాములు కావాలి
పకడ్బందీగా రెవెన్యూ సదస్సులను నిర్వహించాలి
రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మరియు జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
జిల్లాలో సెప్టెంబర్ ఒకటి నుంచి 45 రోజులపాటు రెవెన్యూ సదస్సులు
రెవెన్యూ సదస్సుల పర్యవేక్షణకు నోడల్ అధికారులు, ప్రత్యేక అధికారుల నియామకం
పారదర్శకంగా రెవిన్యూ సదస్సులను నిర్వహిస్తాం
రాయచోటి ముచ్చట్లు:
రాష్ట్రంలో నెలకొన్న భూమి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుందని రాష్ట్ర రవాణా క్రీడల శాఖామాత్యులు, జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.మంగళవారం రాయచోటి కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా మంత్రివర్యుల అధ్యక్షతన రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా మంత్రివర్యులు మాట్లాడుతూ… మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలలో చేయవలసిన పని ఏదైనా ఉందంటే అది రైతు కంట్లో నీరు తుడిచే బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఇంత త్వరగా రెవిన్యూ సదస్సుల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం పై ముఖ్యమంత్రి కి రెవిన్యూ మంత్రికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారతదేశ వ్యవస్థలో తల్లి తర్వాత మనందరం పూజించేది భూమిని అనే విషయం అందరికీ తెలుసు. అలాంటి భూములు మనకు వంశపారపర్యంగా ముత్తాతలు తాతలు, తండ్రుల ద్వారా సంక్రమిస్తాయి. వాటికి వారసులు అజమాయిషిగా ఉంటున్నారు. భూములను మనకు చేరువచేసే వ్యవస్థ రెవిన్యూ మాత్రమే. రెవిన్యూ వ్యవస్థలో జరిగిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలామంది రైతులు ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. భారతదేశ వ్యవస్థలో అన్ని వర్గాలలో ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం ద్వారా తాత తండ్రుల నుంచి పైనుంచి కింది వరకు భూ వ్యవస్థ చిన్న భిన్నమైంది. ముఖ్యంగా ఏ ప్రాంతానికి, ఏ గ్రామానికి వెళ్లినా మాకు ఆన్లైన్ కాలేదని, మా భూములకు సరైన పాస్ పుస్తకాలు లేవు అని, వన్ బి అడంగల్ ట్యాంపరింగ్ జరిగిందని ఇలా అనేక సమస్యలు దృష్టికి తీసుకొస్తున్నారు. కొందరు అధికారుల చేతివాటం కావచ్చు.. ఇలాంటివి జరగడం వల్ల గత ఐదు సంవత్సరాలలో చాలామంది ఇబ్బందులకు గురి అవుతున్నారు. పిల్లల పెళ్లిళ్లు చేయాలన్న భూ రికార్డులు సరిగా లేక సమస్యలు, కోర్టులలో ఉన్న భూములు అమ్ముకోలేక కొందరు, భూమిపై రుణాలు పొందలేక పోతున్నామని ఇలా అనేకమంది బాధపడుతున్నారు. ఈ సమస్యలను అతి తొందరగా గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం… గ్రామాలకు అధికారులను పంపుతూ, మండల స్థాయిలో నోడల్ అధికారులను నియమించి, స్పెషల్ ఆఫీసర్లుగా ఐఏఎస్ లను పెట్టి రెవెన్యూ సదస్సులను పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా వంశపారపర్యంగా సంక్రమించే భూమి మన పేరున లేకపోతే ఎంత నరకయాతన అనుభవిస్తామో మనకందరికీ తెలుసు. కాబట్టి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మన రాజకీయ పార్టీలు వైరుధ్యాలు వైసమ్యాలు పక్కనపెట్టి రెవిన్యూ సదస్సులో పాల్గొని సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావడంతో పాటు రైతులకు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నాను. గ్రామాలలో ఎప్పుడెప్పుడు ఏ తేదీలలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారన్న సమాచారాన్ని ముందుగానే ఆ గ్రామాలలో ప్రదర్శించాలి అలాగే టామ్ టామ్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్కు అధికారులకు మంత్రి సూచించారు. జిల్లాలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని మంత్రి పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవిన్యూ పరంగా ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా ప్రతి గ్రామంలో రెవిన్యూ సదస్సులను ఏర్పాటు చేయబోతున్నాం. వీటిని ఆగస్టు 15న జిల్లా మంత్రిగారు లాంచనంగా ప్రారంభించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అయితే సాధారణ బదిలీలు ఉన్న దృష్ట్యా సెప్టెంబర్ ఒకటి నుంచి 45 రోజులపాటు ఈ సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయా మండలాల్లోని తాసిల్దారు, డిటి, ఆర్ఐ, వీఆర్వో మండల్ సర్వేయర్ గ్రామ సర్వేయర్ ఫారెస్ట్ దేవాదాయ వక్ఫ్త్ అధికారులు ప్రజాప్రతినిధులు అందరు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. జిల్లాలో 472 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 45 రోజులపాటు ఈ సదస్సులు నిర్వహిస్తాం. ఒక్కొక్క మండలంలో 15 నుంచి 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. పెద్ద గ్రామం అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు, చిన్న గ్రామం అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకసారి ఒక గ్రామంలో సదస్సు నిర్వహించిన పెద్దప రెండు మూడు రోజుల తర్వాత మరో గ్రామానికి వెళ్లడం జరుగుతుంది. సదస్సు నిర్వహణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక వ్యవస్థ ద్వారా రెవిన్యూ సమస్యలకు ఒక ప్రత్యేక ట్యాగ్ ద్వారా భూ సమస్యలు ఆక్రమణలు 22 అతిక్రమణాలు, అలాగే దారి సమస్య స్మశాన సమస్యలు తదితరాలపై స్వీకరించిన అర్జీలకు ఒక రసీదు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆ అర్జీని ఆన్లైన్ చేస్తాం. నిర్దేశించిన కాలపరిమితిలోగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆయా గ్రామాల్లో రీ సర్వే జరిగిన ప్రాంతాల్లో వ్యక్తుల పేర్లు అలాగే లోగోలను రాళ్లపై వేయడం సరికాదని ప్రభుత్వం భావించింది. భూమి ఒక శాశ్వత హక్కు. ఆ భూమికి హక్కును కల్పించడమే తప్ప అందులో ఎవరి పేర్లు ఉండరాదని… గతంలో రీ సర్వే చేసి జారీ చేసిన పట్టాలను కలెక్ట్ చేసుకుని ఎటువంటి పేరు లేకుండా న్యూట్రల్ గా ప్రభుత్వ లోగో తో ఒక పట్టాదారు పాస్ పుస్తకం అందించడం జరుగుతుంది. ఏవైతే వ్యక్తుల నుంచి పట్టాలు తీసుకుంటామో డూప్లికేషన్ లేకుండా ఉండేందుకు వాటిని దగ్ధం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లా మంత్రివర్యులు ఆధ్వర్యంలో మీ అందరికీ ఈ విషయాలను తెలియజేయాలని నేడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ సదస్సులను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించామని, అలాగే జిల్లాలో జేసీతో పాటు ముగ్గురు సబ్ కలెక్టర్లను స్పెషల్ అధికారులుగా నియమించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ ముందుగానే ప్రకటిస్తామని అలాగే టామ్ టామ్ ద్వారా గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పారు. ప్రతి మండలం ప్రతి గ్రామంలో జరిగే రెవిన్యూ సదస్సుల్లో ప్రతి అర్జీదారుడికి న్యాయం జరిగే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో ముందుకు వెళతామని, అలాగే సమావేశంలో అందిన సూచనలు సలహాలను కూడా పరిగణలోకి తీసుకొని రెవెన్యూ సదస్సులను పటిష్టంగా నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా భూమి సమస్యల పరిష్కారానికి వివిధ అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభ్యులు, వివిధ పార్టీ ప్రతినిధులు తగు సూచనలు సలహాలు అందించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్ఓ సత్యనారాయణరావు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, వివిధ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Tags:Conduct of revenue conferences for permanent solution of land issues-District Collector Sridhar Chamakuri