రెండో విడత పోలింగ్‌ సందర్భంగా పశ్చిమ బెంగాల్ లో ఘర్షణ

Date:18/04/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఉద్రిక్తంగా మారింది. రాయ్‌గంజ్ నియోజకవర్గ పరిధిలోని దినాజ్‌పూర్‌ జిల్లా ఇస్లాంపూర్‌లో పరిస్థితి ఉద్రక్తంగా మారడంతో.. భద్రతా దళాలు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.ఇస్లాంపూర్‌లోని మరో పోలింగ్‌ కేంద్రం సమీపంలో ఓ సీపీఎం అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కారు పాక్షికంగా ధ్వంసమైంది. దాడి నుంచి సీపీఎం అభ్యర్థి సురక్షితంగా బయటపడ్డారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్‌గంజ్‌ నియోజకవర్గ పరిధిలోని దినాజ్‌పూర్‌ జిల్లాలో కొంతమంది జాతీయ రహదారి ఎన్‌హెచ్-34పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చోప్రాలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన తమను ఓటు వేయకుండా అడ్డుకున్నారని.. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు పోలింగ్‌ బూత్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా.. వారిపైకి రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భాష్పవాయువు ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.ఇస్లాంపూర్‌లో సీపీఎం అభ్యర్థి మహ్మద్‌ సలీంపై కారుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తులే తనపై దాడి చేసి ఉంటారని ఆయన తెలిపారు. ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద రిగ్గింగ్‌ జరుగుతోందనే సమాచారంతో తాను అక్కడకు వెళ్లానని.. అదే సమయంలో కొందరు వ్యక్తులు తనపై రాళ్లతో దాడి చేశారని చెప్పారు. అయితే.. అదృష్టవశాత్తు తనకు ఎలాంటి హానీ జరగలేదని మహ్మద్‌ సలీం తెలిపారు. అటు కర్ణాటకలోని మైసూరులో ఓ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.. పశ్చిమ బెంగాల్‌లో 3 లోక్‌సభ నియోజకవర్గాలకు గురువారం  పోలింగ్‌ ముగిసింది. రాయ్‌గంజ్‌‌తో పాటు డార్జిలింగ్‌, జల్‌పాయ్‌గురి నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి.
Tags:Confrontation in West Bengal during the second phase of polling

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *