కాంగ్రెస్‌కు 10 మంది ఎంఎల్‌ఎలు మాత్రమే

Date:22/03/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కేవలం 10 మంది ఎంఎల్‌ఎలు మాత్రమే మిగిలారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 19 మంది శాసనసభ్యులు గెలువగా, వారిలో తొమ్మిది మంది ఇప్పటికే కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌కు జైకొట్టారు. పార్లమెంట్ ఎన్నికల లోపు మరో ఐదారు మంది ఎంఎల్‌ఎలు అధికార పార్టీలో చేరనునున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్కులు వారిని ఆపేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం కనిపించడంం లేదు. చివరకు ఏఐసిసి పెద్దలు రంగంలోకి దిగి సర్దిచెబుతున్నా వలసలు మాత్రం ఆగడం లేదు.ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న వారిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్‌నగర్), భట్టి విక్రమార్క (మధిర), శ్రీధర్‌బాబు (మంథని), జగ్గారెడ్డి (సంగారెడ్డి), సీతక్క (ములుగు), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), పొదెం వీరయ్య (భద్రాచలం), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), జాజాల సురేందర్‌రెడ్డి (ఎల్లారెడ్డి), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు)లు ఉన్నారు. కాగా పార్టీని వీడిన శాసనసభ్యులంతా త్వరలోనే అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి తమదే అసలైన కాంగ్రెస్ పక్షంగా గుర్తించాలని కోరే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.నిబంధనల ప్రకారం అయితే ప్రతిపక్ష హోదాను దక్కించుకోవాలంటే కాంగ్రెస్ గెలిచిన 19 స్థానాలలో 2/3 వ వంతు ఎంఎల్‌ఎల మద్దుతు అవసరం ఉంటుంది. అంటే సుమారు 13 మంది ఎంఎల్‌ఎలు కలిసి స్పీకర్‌కు వినతి పత్రాన్ని ఇస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో మరో నలుగురు ఎంఎల్‌ఎలను కూడా తమ వైపుకు తిప్పుకుని తమదే అసలు, సిసలైన కాంగ్రెస్ పక్షంగా గుర్తించాలని కోరే అవకాశముందని కూడా తెలుస్తోంది. అయితే టిఆర్‌ఎస్‌లో చేరేందుకు దాదాపుగా ఐదుమంది శాసనసభ్యులు సముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది జరిగితే శాసనసభలో ప్రస్తుతమున్న కాంగ్రెస్ పక్షం అంటూ కనిపించదు. పార్టీని వీడిన ఎంఎల్‌ఎలంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి కొత్త శాసనసభా పక్షాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు.
Tags:Congress has only 10 MLAs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *