Date:05/12/2020
హైదరాబాద్ ముచ్చట్లు:
అనుకున్నట్లే.. కాంగ్రెస్ తెలంగాణలో క్రమంగా కనుమరుగువుతోంది. జాతీయ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ఏ ఎన్నికల్లోనూ తన పెరఫార్మెన్స్ ను చూపలేకపోతుంది. వరస ఓటములను చవిచూస్తున్నా పనితీరును మెరుగుపర్చుకోలేక చతికలపడుతూనే వస్తుంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితమే దీనికి ఉదాహరణ. అక్కడ కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది.ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను చూసుకుంటే వరస ఓటములు చవిచూస్తున్నా నేతల్లో మార్పు రాలేదు. టిక్కెట్ల కేటాయింపునకు ముందే అలక పాన్పు ఎక్కారు. ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పార్టీని వీడి వెళ్లారు. అంజనీకుమార్ యాదవ్ వంటి వారు పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు. ఇక టిక్కెట్ల కోసం కూడా అభ్యర్థులు పెద్దగా పోటీ పడలేదంటే ఆ పార్టీ పరిస్థితిని చెప్పకనే చెప్పవచ్చు. చివరి నిమిషం వరకూ బీఫాం ఇవ్వలేదు.ఇప్పుడు గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే కాంగ్రెస్ అసలు ఉందా? అన్న సందేహం తలెత్తుంది. గెలిచిన రెండు, మూడు చోట్ల అక్కడి అభ్యర్థుల ఇమేజ్ తోనే గెలిచారు తప్పించి, కాంగ్రెస్ పార్టీని చూసి కాదన్నది అందరికీ తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తొలి నుంచి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు గానే పోరు సాగింది. ప్రచారంలోనూ కాంగ్రెస్ ఎక్కడా కనపడకపోవడం విశేషం.నాడు గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత నామరూపాల్లేకుండా పోయిందనే చెప్పాలి. నాయకత్వ లోపం, పార్టీపై నమ్మకం లేకపోవడం వంటి కారణాలతో గ్రేటర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సోదిలో లేకుండా పోయింది. దీంతో ఇక నగరంలో నిన్న మొన్నటి వరకూ బలంగా ఉన్న ఆ పార్టీ ఓటు బ్యాంకును బీజేపీ ఎగరేసుకుపోయినట్లే చెప్పుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి నగరంలో కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి.
పుంగనూరు ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు
Tags: Congress lost in Sodhi