టీడీపీ అవిశ్వాసానికి కాంగ్రెస్ మద్దతు

Date:16/03/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కేంద్రంపై అవిశ్వానం తీర్మానం పెడుతూ టీడీపీ నోటీసు ఇచ్చింది. దీనిపై టీడీపీ ఎంపీలు మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఈ తీర్మానం ద్వారా కేంద్రానికి సరైన బుద్ధి చెబుతామని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఈ నోటీస్‌‌పై సోమవారం 54 మంది ఎంపీలతో సంతకాలు చేయించనున్నట్లు తెలిపారు. టీడీపీని దెబ్బకొట్టేందుకు కుట్ర జరుగుతోందని, ఏపీ ప్రజలను అవమానించేలా కేంద్రం వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలతోనే ఎన్డీఏ నుంచి తాము వైదొలగాలని నిర్ణయించుకున్నామని, ఏపీ హక్కుల కోసం తమ పోరాటం సాగుతుందని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు.అవిశ్వాస తీర్మానానికి వైసీపీ కూడా నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానానికి ఇతర పార్టీల మద్దతును కూడగట్టేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఇచ్చిన తీర్మానానికి కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్ కు 48, అన్నాడీఎంకేకు 37 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు శివసేన, తృణ‌మూల్‌ కాంగ్రెస్ కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టు భోగట్టా.టీడీపీ అవిశ్వాసానికి కాంగ్రెస్ మద్దతు వార్తలకు ఆ పార్టీ పార్లమెంటరీ నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో వైసీపీ సీరియస్‌గా ఉన్నట్టు ఎంతమాత్రమూ కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అవిశ్వాసం విషయంలో ఆ పార్టీ శైలి మొక్కుబడిగా కనిపిస్తోందని మీడియాతో మాట్లాడిన ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాకు తొలి నుంచి కట్టుబడి ఉన్నది తమేనని, తాము అధికారంలోకి వస్తే, తొలి సంతకం హోదాపైనే ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు.
Tags: Congress supported the TDP’s unbelief

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *