తిరుపతి ముచ్చట్లు:
ఎన్నికల ప్రవర్తన నియమావళి (MCC) ని ఉల్లంఘించిన కానిస్టేబుల్ చక్రి రాజశేఖర్ సస్పెండ్. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చక్రి రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన జిల్లా ఎస్పీ .. కృష్ణ కాంత్ పటేల్ ఐపిఎస్. సార్వత్రిక ఎన్నికలు-2024 షెడ్యూలు ను భారత ఎన్నికల సంఘం వారు విడుదల చేసినప్పటి నుండి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది.ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఎట్టి పరిస్థితులలో కూడా నియమాలని ఉల్లంఘించవద్దని జిల్లా ఎస్పీ .. కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్., ఇదివరకే పలుమార్లు ఉద్యోగులకు దిశా నిర్దేశం చేస్తూ హెచ్చరించారు.
ఈరోజు అనగా 20-03-2024 తేదీన తిరుపతి దిశా పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తించుచున్న చక్రి రాజశేఖర్ PC-2514 అను కానిస్టేబుల్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి భాకరాపేట లో ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నారు.విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సమగ్రంగా విచారణ చేపట్టారు. సదరు కానిస్టేబుల్ ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారని నిరూపణ అవడంతో వెంటనే సదరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిర్గతంగా తెలియపరచడం ఏదైనా రాజకీయ పార్టీల కార్యక్రమంలో పాల్గొనడం వంటి చర్యల ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ . కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్ హెచ్చరించారు.
Tags: Constable Chakri Rajasekhar was suspended for violating the election code of conduct