Natyam ad

ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు వెనుకబడిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణం

– సీతంపేట శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం ప్రారంభం
– శుభకార్యాల కోసం గిరిజనులకు ఉచితంగా కల్యాణ మండపం
– కురుపాంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి చర్యలు
– టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి
– సీతంపేటలో ఆగమోక్తంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

సీతంపేట ముచ్చట్లు:

Post Midle

రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మత్స్యకార, దళితవాడలు ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో టిటిడి నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ గురువారం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో  వైవి.సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకోలేని భక్తుల కోసం గడిచిన నాలుగేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో సుమారు 2 వేల ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టామని తెలిపారు. సీతంపేటలో ఒకటిన్నర సంవత్సరాల అతి తక్కువ వ్యవధిలో దాదాపు రూ.10 కోట్లతో ఆలయ నిర్మాణం చేపట్టామని చెప్పారు. ఆలయం వద్ద నిర్మించిన కల్యాణ మండపాన్ని మరింతగా విస్తరించి, చుట్టుపక్కల గిరిజన భక్తులు ఉచితంగా శుభకార్యాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. మరో గిరిజన ప్రాంతమైన రంపచోడవరంలో ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు నూతన ఆలయం మహా సంప్రోక్షణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతమైన కురుపాంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

గిరిజనులకు రవాణా, వసతి, ఆహారం ఉచితంగా కల్పించి తిరుమల బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనం ఉచితంగా చేయిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతాల నుంచి స్వామివారి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలతో వేలాది మంది శ్రీవారి సేవకులు తిరుమలకు విచ్చేసి తోటి భక్తులకు సేవ చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. వీరందరికీ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నానని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల నుండి మరింతమంది శ్రీవారి సేవకులుగా భక్తులకు సేవలు అందించాలని కోరారు.

ఆగమోక్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆ తరువాత కుంభ ప్రదక్షిణ చేశారు. ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య వృషభ లగ్నంలో మహాసంప్రోక్షణ, కళావాహన చేపట్టారు. ఈ క్రతువుల ద్వారా యాగశాలలోని కలశాలలో ఇమిడి ఉన్న దేవతాశక్తిని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాల్లోకి ఆవాహన చేశారు. అనంతరం అక్షతారోపణ, బ్రహ్మఘోష, ఆచార్య బహుమానం అందించారు.

భక్తులకు దర్శనం ప్రారంభం

మహాసంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఉదయం 10 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. సీతంపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.

శ్రీవారి సేవకుల విశేష సేవలు

సీతంపేట ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా ఆరు రోజులపాటు నిర్వహించిన కార్యక్రమాల్లో శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, ఆలయానికి అవసరమైన పూలు కట్టడం తదితర సేవలు అందించారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల నుంచి దాదాపు 600 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించారు.

ఈ కార్యక్రమంలో ఎంపి  చంద్రశేఖర్, జెఈవో  వీరబ్రహ్మం, ఎమ్మెల్సీ  పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు వి.కళావతి, పుష్పశ్రీవాణి, రెడ్డిశాంతి,  కంబాల జోగులు,  చిన్న అప్పలనాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు  మల్లాది కృష్ణారావు, ఐటీడీఏ పీవో కల్పనా కుమారి, సబ్ కలెక్టర్  నూరుల్ కోమర్, జిసిసి ఎండి  సురేష్ కుమార్, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు  వేణుగోపాలదీక్షితులు, టిటిడి వైఖానస ఆగమసలహాదారు  మోహనరంగాచార్యులు, కంకణభట్టార్  శేషాచార్యులు, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, ఎస్ఇలు  టివి.సత్యనారాయణ,  వెంకటేశ్వర్లు, విజివో  మనోహర్, డెప్యూటీ ఈవోలు  గుణభూషణ్ రెడ్డి,  వెంకటయ్య,  శివప్రసాద్, ఇఇ  సుధాకర్, ఏఈఓ  రమేష్, డెప్యూటీ ఇఇలు  ఆనందరావు,  నాగరాజు, జెఈ  రవికుమార్,  సూపరింటెండెంట్  వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న భజన, కోలాట కార్యక్రమాలు

సీతంపేటలోని ఆలయం వద్ద గల వేదికపై టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. గిరిజన ప్రాంతాల నుంచి భజన బృందాలు కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. వైజాగ్ కు చెందిన కిరణ్మయి బృందం చక్కగా భరతనాట్య ప్రదర్శన చేశారు. అదేవిధంగా బొబ్బిలికి చెందిన శ్రీ వేంకటేశ్వర కోలాట నృత్య భజన బృందం, కొత్తూరుకు చెందిన శ్రీహరే శ్రీనివాసా కోలాట నృత్య బృందం, నరసన్నపేటకు చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ కోలాట నృత్య భజన బృందం,  పార్వతీపురానికి చెందిన శ్రీ పాద కోలాట నృత్య భజన బృందం కోలాట ప్రదర్శన చేశారు. సూపరింటెండెంట్  చంద్రమౌళీశ్వర శర్మ, ప్రోగ్రాం అసిస్టెంట్  లలితామణి ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Tags: Construction of large scale temples in backward areas as per Chief Minister’s orders

Post Midle