స్లాబ్ లెవల్‌కు చేరిన ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మాణం
Date:10/02/2019
కరీంనగర్ ముచ్చట్లు:
కరీంనగర్ నగరంలో అర్బన్ మిషన్ భగీరథ ద్వారా నిర్మాణం చేపట్టిన మూడు ఓవర్‌హెడ్ ట్యాంకులు స్లాబ్ లెవల్‌కు చేరుకున్నాయి. 2033 సంవత్సరం కల్లా 4.03 లక్షల జనాభాకు సరిపడేలా 68.65 ఎంఎల్డీల సామర్థ్యంతో ఫిల్టర్‌బెడ్, 3000 కేఎల్ సామర్థ్యంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. దీని పనులు 30 శాతం మేర పూర్తయ్యాయి. 800 కిలో లీటర్ల సామర్థ్యం గల సంపు, పంపుహౌస్‌ను ఫిల్టర్‌బెడ్ దగ్గర నిర్మిస్తున్నారు. 90 శాతం పనులు పూర్తిచేశారు. రాంనగర్లో 1300 కిలో లీటర్ల ట్యాంకు పనులు 50 శాతం మేర, హౌసింగ్‌బోర్డు కాలనీలో 2200 కిలో లీటర్ల సామర్థ్యంతో నిర్మా ణం చేస్తున్న ట్యాంకు పనులు 60 శాతం పూర్తయ్యాయి. ఈ పనులన్నీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. హౌసింగ్‌బోర్డు, రాంనగర్ రిజర్వాయర్ల పనులు జరుగుతుండగా, ఫిల్టర్‌బెడ్ దగ్గర ఉన్న రిజర్వాయర్ పూర్తయింది. సంపుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.భగీరథ పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టాక మిషన్ భగీరథ పనులను మార్చిలోగా పూర్తిచేసి ప్రజలకిచ్చిన వాగ్ధానం ప్రకారం ఏప్రిల్ నుంచి ఇంటింటికి తాగునీరు అందించాలని గడువు విధించింది. రిజర్వాయర్లు, సంపుల నిర్మాణం, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై దృష్టి కేంద్రీకరించింది.
పైపులైన్ల అనుసంధానం పనులు సైతం ఆశించిన స్థాయిలో జరగకపోవడం వల్ల ఈ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. అయితే పైపులైన్లతో పాటు ట్యాంకుల నిర్మాణం అడ్డగోలుగా ఆలస్యమవుతుండడంతో గడువులోగా పనులు పూర్తవుతాయా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద ప్రభుత్వం రూ.109.26 కోట్ల నిదులు మంజూరు చేసింది. అర్బన్ మిషన్ భగీరథతో పాటు స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు ఇక్కడ అమలులో ఉండడంతో 24 గంటల నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 16 ఓవర్‌హెడ్ ట్యాంకులకు తోడు మరో 3 ట్యాంకులు మిషన్ భగీరథ పథకంలో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం నగరంలో ఉన్న 43 వేల నల్లా కనెక్షన్లకు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుండగా, మిషన్ భగీరథ పనులు పూర్తయితే నిరంతర నీటి సరఫరా జరగనుంది. అన్ని డివిజన్లలో పనులు ప్రారంభించడంతో పైపులైన్ల నిర్మాణం కొనసాగుతోంది. పనులు ప్రారంభించినప్పుడు 18 నెలల కాల వ్యవధిని ఇచ్చారు.
అంటే గతేడాది నవంబర్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక మార్చి చివరి వరకైనా పనులు పూర్తిచేసి ఏప్రిల్ నుంచైనా ఇంటింటికి నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతున్నా పనులు ఊపందుంకుంది. అర్బన్ మిషన్ భగీరథ పైపులైన్ పనులు అన్ని డివిజన్లలో కొనసాగుతున్నాయి. 110 ఎంఎం డయా పైపులైన్ 147.43 కిలోమీటర్లు వేయాల్సి ఉండగా 85.21 కిలోమీటర్లు పూర్తయింది. 100 ఎంఎం డయా పైపులైన్ 40 కిలోమీటర్లుకు గాను 35 కిలోమీటర్లు, 150 ఎంఎం డయా పైపులైన్ 29.79 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా, 36.25 కిలోమీటర్లు చేపట్టారు. అలాగే 200 ఎంఎం, 250 ఎంఎం డయా పైపులైన్ 73.64 కిలోమీటర్లు వేయాల్సి ఉండగా 40.04 కిలోమీటర్ల మేర నిర్మించారు. మిగతా పైపులైన్ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి.
Tags:Construction of overhead tanks that reach the slab level