Contribute to online services

ఆన్‌లైన్ సేవ‌ల‌కు ప్ర‌సాదాలు అందించండి

-డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో భ‌క్తుల విజ్ఞ‌ప్తి

Date:09/08/2020

తిరుమల ముచ్చట్లు:

ఆన్‌లైన్ విధా‌నంలో నిర్వ‌హిస్తున్న సేవ‌ల్లో పాల్గొంటున్న గృహ‌స్తుల‌కు స్వామివారి క‌ల‌కండ ప్ర‌సాదమైనా అందించాల‌ని భ‌క్తులు టిటిడి ఈవో   అనిల్‌కుమార్ సింఘాల్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఆన్‌లైన్ సేవ‌ల్లో పాల్గొంటున్న భ‌క్తుల‌కు క‌ల‌కండ ప్ర‌సాదం పంప‌డానికి చ‌ర్యలు తీసుకుంటామ‌ని ఈవో తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో ఆదివారం డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో   అనిల్‌కుమార్ సింఘాల్ సమాధానాలు ఇచ్చారు.

1. ప్రసాద్ – అన‌కాప‌ల్లి

ప్రశ్న: శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నాం. మా ప్రాంతం రెడ్‌జోన్ కావ‌డం వ‌ల్ల ద‌ర్శ‌నానికి రాలేక‌పోయాం. రీఫండ్ ఇప్పించాలి.

ఈవో : భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాలు నిలిపివేసిన స‌మ‌యంలో మాత్ర‌మే ఆన్‌లైన్ బుకింగ్ టికెట్ల‌ను ర‌ద్దు చేసుకున్న‌వారికి రీఫండ్ చేశాం. ద‌ర్శ‌నాలు ప్రారంభించిన త‌రువాత బుక్ చేసుకున్న‌వారికి రీఫండ్ చేసే అవ‌కాశం లేదు.

2. బద్రినారాయ‌ణ – సేలం

ప్రశ్న: అక్టోబ‌రు 23 తేదీకి తిరుప్పావ‌డ సేవ బుక్ చేసుకున్నాం. మేము సేవ‌కు ఎలా రావాలి.

ఈవో : కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిబంధ‌న‌ల మేర‌కు శ్రీ‌వారి ఆల‌యంలో సేవ‌లకు భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డం లేదు. ఈ నెలాఖ‌రు త‌రువాత కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏ మార్గ‌ద‌ర్శ‌కాలు ఇస్తాయో తెలియ‌దు. సేవ‌ల‌కు అనుమ‌తి ల‌భిస్తే మీరు 22వ తేదీ ఆర్జితం ఆఫీసుకు వ‌చ్చి టికెట్ పొందొచ్చు. సేవ‌లు ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకుంటే మీడియా ద్వారా ముందుగానే తెలియ‌జేస్తాం.

3. పార్థ‌సార‌ధి – విజ‌య‌వాడ

ప్రశ్న: తిరుమ‌ల వైష్ణ‌వ సంప్ర‌దాయంలో న‌డుస్తున్న క్షేత్రం. వేద‌పారాయ‌ణం సంద‌ర్భంగా శైవ సంప్ర‌దాయం ఎందుకు పాటిస్తున్నారు.

ఈవో : ఈ విష‌యం సంబంధిత అధికారుల‌కు తెలియ‌జేసి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం.

4. సునీల్‌కుమార్ – నెల్లూరు

ప్రశ్న:టిటిడిలోని అన్య‌మ‌త ఉద్యోగుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఈవో : టిటిడిలో ప‌నిచేస్తున్న ఉద్యోగులు ఎవ‌రి మీద ఇలాంటి ఫిర్యాదులు వ‌చ్చినా విజిలెన్స్ విభాగం ద్వారా విచార‌ణ జ‌రిపించి చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. 1989కి ముందు టిటిడిలో అన్ని మ‌తాల వారు ఉద్యోగంలో చేరే అవ‌కాశం ఉండేది. 1989లో అన్య‌మ‌త‌స్తుల‌ను దేవాల‌యాలు, ఇత‌ర ముఖ్య ప్ర‌దేశాల్లో విధుల‌కు నియ‌మించ‌కూడ‌ద‌ని నిబంధ‌న విధించారు. 2007లో టిటిడిలో అన్ని విభాగాల్లో హిందువుల‌ను మాత్ర‌మే నియ‌మించాల‌ని జివో వ‌చ్చింది. 1989కి ముందు 45 మంది అన్య‌మ‌త‌స్తులు ఉద్యోగాల్లో చేరారు. వీరికి నోటీసులు ఇచ్చి చ‌ర్య‌లు తీసుకునే ప్ర‌య‌త్నం చేశాం. వారు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చి ఉద్యోగంలో కొన‌సాగుతున్నారు.

5. విజ‌య‌సార‌థి – హైద‌రాబాద్‌

ప్రశ్న: 6 నెల‌ల క్రితం తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి బంగారు లాకెట్‌, చైన్ చేయించి తీసుకొచ్చాను. ఆల‌య అధికారులు నేరుగా స్వీక‌రించ‌లేమ‌ని చెప్పారు. ఈ ఆభ‌ర‌ణాల‌ను అమ్మ‌వారికి చేర్చేదెలా?

ఈవో : స‌ంబంధిత అధికారులు మీకు వివ‌రాలు తెలియ‌జేస్తారు.

6. శ్రీ‌నివాస‌రావు – తెనాలి

ప్రశ్న: ఎస్వీబీసీలో అన్న‌మ‌య్య పాట ప్ర‌తివారి నోట పేరుతో ప్ర‌తిరోజూ అర‌గంట పాటు భ‌క్తులు ఫోన్ ద్వారా పాడే విధంగా కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సారం చేస్తే బాగుంటుంది. అలాగే అన్న‌మ‌య్య పాటల గురించి శ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావుతో ప్ర‌వ‌చ‌నాలు చెప్పించండి.

ఈవో : ఎస్వీబీసీలో ప్ర‌స్తుతం నిర్వ‌హిస్తున్న సుంద‌ర‌కాండ‌, విరాట‌ప‌ర్వం పారాయ‌ణాల‌కు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. త్వ‌ర‌లో గ‌రుడ పురాణం, భ‌గ‌వ‌ద్గీత పారాయ‌ణం ప్రారంభించ‌బోతున్నాం. మీ స‌ల‌హాను ఎస్వీబీసీ బోర్డులో చ‌ర్చించి త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాం.

7. వేణుగోపాల‌చారి – హైద‌రాబాద్‌

ప్రశ్న: సుంద‌ర‌కాండ పారాయ‌ణం బాగుంది. వ్యాఖ్యాత‌ను మార్చాలి.

ఈవో : భ‌క్తుల నుంచి వందల సంఖ్య‌లో సూచ‌న‌లు, స‌ల‌హాలు వ‌స్తున్నాయి. అన్నింటినీ స‌మీక్షించి స‌రైన నిర్ణ‌యం తీసుకుంటాం.

8. యోగానంద‌శ‌ర్మ – హైద‌రాబాద్‌

ప్రశ్న: 65 ఏళ్లు దాటిన వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుని నెగెటివ్ వ‌స్తే ద‌ర్శ‌నానికి అనుమ‌తించేలా చ‌ర్య‌లు తీసుకోవాలి.

ఈవో : ఈ నెలాఖ‌రులో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం.

9. కృష్ణ‌కుమార్ – విజ‌య‌వాడ‌, ఉషారాణి – హైద‌రాబాద్‌

ప్రశ్న: తిరుచానూరు ఆల‌యంలో నిర్వ‌హించిన ఆన్‌లైన్ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం సేవలో పాల్గొన్నాం. ఆదివారం(ఈ రోజు) తిరుమ‌ల శ్రీ‌వారి ఆన్‌లైన్ క‌ల్యాణోత్స‌వంలో పాల్గొంటున్నాం. ఆన్‌లైన్ సేవ‌ల్లో పాల్గొంటున్న భ‌క్తుల‌కు ప్ర‌సాదంగా క‌ల‌కండ లేదా ల‌డ్డూ పంపించాలి.

ఈవో : ఆన్‌లైన్ సేవ‌ల్లో పాల్గొంటున్న భ‌క్తుల‌కు క‌ల‌కండ ప్ర‌సాదం పంపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం.

10. విజ‌య‌కుమార్ – హుబ్లీ

ప్రశ్న: ఎస్వీబీసీలో సంస్కృతం నేర్చుకుందాం అనే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిరోజూ ప్ర‌సారం చేయాలి. అలాగే సంధ్యావంద‌నం, ప్రాణాయామం లాంటి కార్య‌క్ర‌మాలు కూడా ప్ర‌సారం చేయాలి.

ఈవో : అధికారుల‌తో చ‌ర్చించి త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాం.

11. చంద్ర‌శేఖ‌ర్ – గుడివాడ‌

ప్రశ్న: కోవిడ్ – 19 సంద‌ర్భంగా టిటిడి 13 జిల్లాల‌కు 13 కోట్లు ఫండ్ ఇచ్చారు. శ్రీ‌వారిసేవ‌కుల ద్వారా ధార్మిక కార్య‌క్ర‌మాలు చేయండి.

ఈవో : కోవిడ్ కార‌ణంగా తిరుప‌తి, ప‌రిస‌ర ప్రాంతాల‌లోని వ‌ల‌స‌కూలీలు, రోజువారీ కూలీలకు అన్న‌ప్ర‌సాదం, ప‌శువుల‌కు దాణా అందించాం. శ్రీ ప‌ద్మావ‌తి కోవిడ్ ఆసుప‌త్రికి అవ‌స‌ర‌మైన యంత్ర ప‌రిక‌రాలు కొనుగోలుకు రూ.19 కోట్లు అందించాం. దేశ వ్యాప్తంగా ఆన్‌లాక్ మొద‌లైన త‌రువాత జిల్లాల‌కు ఇవ్వాల‌నుకున్న స‌హాయాన్ని నిలిపివేశాం.

12. ల‌త – హైద‌రాబాద్‌

ప్రశ్న: ఎస్వీబీసీ వీక్షించడం ద్వారా క‌రోనా స‌మ‌యంలో ఉప‌శ‌మ‌నం క‌లుగుతోంది. వాట్సా‌ప్‌లో శ్రీ‌వారి గర్భా‌ల‌యంలో హార‌తి ఇస్తున్న‌ట్టు వ‌చ్చిన వీడియోలు నిజ‌మైనవేనా.

ఈవో : శ్రీ‌వారి సేవ‌ల‌పై న‌మూనా ఆల‌యంలో కార్య‌క్ర‌మాలు రూపొందించి ప్ర‌సారం చేస్తున్నాము. మూల‌మూర్తికి హార‌తి ఇచ్చిన‌ట్టు వ‌‌చ్చిన వీడియో వాస్త‌వం కాదు. స్వామివారి సేవ‌లు ఎలా జ‌రుగుతాయో భ‌క్తులకు అవ‌గాహ‌న‌ క‌ల్పించేందుకు న‌మూనా ఆల‌యంలో ఈ వీడియో చిత్రీక‌రించారు. కొంత‌మంది సోష‌ల్ మీడియాలో అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నారు.

13. గంగాధ‌ర్ – ప్రొద్ధుటూరు.

ప్రశ్న: ప్ర‌తి జిల్లా కేంద్రంలోని కౌంట‌ర్ల ద్వారా శ్రీ‌వారి ద‌ర్శనానికి ఉచిత టోకెన్లు మంజూరు చేయండి.

ఈవో : శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 17 సంవ‌త్స‌రాల క్రితం ఏర్పాటు చేసిన సుద‌ర్శ‌న టోకెన్ల విధానం స‌త్ప‌లితాల‌ను ఇవ్వ‌లేదు. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని తిరుప‌తిలో మాత్ర‌మే ఆఫ్‌లైన్‌లో ఉచితంగా ద‌ర్శ‌న టోకెన్లు మంజూరు చేస్తున్నాం.

14. శ్రీ‌ను – అన‌కాప‌ల్లి

ప్రశ్న: అన‌కాప‌‌ల్లిలో టిటిడి కల్యాణ మండ‌పం నిర్మించండి.

ఈవో : టిటిడి ఆధ్వ‌ర్యంలో దాదాపు 300కు పైగా క‌ల్యాణ మండ‌పాలు ఉన్నాయి. దాదాపు 200కు పైగా క‌ల్యాణ మండ‌పాల్లో వివాహాలు త‌గిన‌న్ని జ‌ర‌గ‌డం లేదు. నిర్వ‌హ‌ణ స‌రిగ్గా లేదు. డిమాండ్ ఉన్న కల్యాణ మండ‌పాల‌ను ఆధునీక‌రిస్తున్నాం. బోర్డు నిర్ణ‌యం మేర‌కు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం.

15. స‌చిన్ కుమార్ – మ‌హారాష్ట్ర

ప్రశ్న: కోవిడ్ – 19 సంద‌ర్భంగా టిటిడి తీసుకున్న చ‌ర్యలు బాగున్నాయి. మీకు అభినంధ‌న‌లు. అన్‌లాక్ మొద‌లైంది. శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌కు సంబంధించి ఎల‌క్ట్రానిక్‌ డిప్ విధానం మొద‌లుపెట్టండి.

ఈవో : ఆల‌యాల్లో సేవ‌ల‌న్నీ ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నాం. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల మేర‌కు భ‌క్తులకు ద‌ర్శ‌నం మాత్ర‌మే క‌ల్పిస్తున్నాము.

16. ఇంద్ర‌కంటి శ‌ర్మ‌ – హైద‌రాబాద్‌

ప్రశ్న: టిటిడిలో మంచి సంస్క‌ర‌ణ‌లు చేశారు, మీకు ధన్య‌వాదాలు. టిటిడి నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌లో పాల్గొనే అధికారులు సంప్ర‌దాయ వ‌స్త్రాధార‌ణ‌, తిల‌కధార‌ణ పాటిస్తే బాగుంటుంది.

ఈవో : టిటిడి ఆల‌యాల్లో జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో అధికారులు, సిబ్బంది ఈ సంప్ర‌దాయాన్ని పాటిస్తున్నారు. ఈ విష‌‌య‌మై అధికారుల‌కు త‌గిన సూచ‌న‌లిస్తాం.

17. మూర్తి – వైజాగ్‌, ప్ర‌సూన – హైద‌రాబాద్‌

ప్రశ్న: సుంద‌ర‌కాండ‌, విరాట‌ప‌ర్వం పారాయ‌ణం బాగుంది. సంస్కృత శ్లోకాల‌కు తెలుగులో వ్యాఖ్యానం బాగా చెబుతున్నారు. ధ‌న్య‌వాదాలు.

ఈవో : కోట్లాది మంది భ‌క్తులు పాల్గొంటున్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను మ‌రిన్ని నిర్వ‌హి‌స్తాం.

18. అరుణ -హైద‌రాబాద్‌

ప్రశ్న: శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే మ‌హిళలు సంప్ర‌దాయ వ‌స్త్రాధార‌ణతో పాటు, వారి వెంట్రుక‌ల‌ను జ‌డ కానీ, ముడి కానీ వేసుకోమ‌ని చెప్పండి.

ఈవో : దీనిపై మ‌హిళా భ‌క్తుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తాం.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి జెఈవో  పి.బ‌సంత్‌కుమార్‌, జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం)   ఎస్‌.భార్గ‌వి, సివిఎస్వో   గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్   ర‌మేష్‌రెడ్డి, ఎస్ఇలు   నాగేశ్వ‌ర‌రావు,   జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి,   వేంక‌టేశ్వ‌ర్లు, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, ఆరోగ్య‌శాఖాధికారి డా. ఆర్‌ఆర్‌.రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

వాలంటీర్స్ గా బాధ్యతలు స్వీకరించి 1 సంవత్సర కాలం విజయవంతం

Tags: Contribute to online services

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *