రోజుకో మలుపు తిరుగుతోన్న తాడిపత్రి భక్తుల వివాదం

Date:17/09/2018
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడలో శనివారం గణేశ్‌ నిమజ్జనం సమయంలో గ్రామస్థులకు, ప్రబోధానంద భక్తులకు చెలరేగిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆశ్రమం నుంచి భక్తులను వారి స్వస్థలాలకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శనివారం నాటి వివాదం ఆదివారం మధ్యాహ్నం పెద్దది కావడం, ఆశ్రమ భక్తులు బయటకు వచ్చి కొందరిపై దాడి చేయడం, ఆ తర్వాత అందులో ఒకరు చనిపోవడంతో పోలీసులు దీనిని తీవ్రంగా పరిగణించారు.
అదనపు ఎస్పీ మల్యాద్రి, కొందరు డీఎస్పీల ఆధ్వర్యంలో పోలీసులు లోపలికి వెళ్లేందుకు ప్రయతించగా భక్తులు గేట్లు తెరవకుండా అడ్డుకున్నారు. ఎస్పీ అశోక్‌కుమార్‌ ఆదివారం సాయంత్రం ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన్ని కూడా అడ్డుకున్నారు. లోపలకు రానివ్వమని అడ్డుతగిలారు. ఎస్పీ అయితే మాకేంటని వాదించారు.
అందరితో మాట్లాడతామని చెబితే కేవలం ఎస్పీ, ఒక్క గన్‌మెన్‌ను మాత్రమే లోపలికి అనుమతించి, వారు లోపలికి వెళ్లగానే బయట ప్రధాన గేటుకు తాళాలు వేసేశారు. అక్కడున్న వారంతా సొంత ఊళ్లకు వెళ్లిపోవాలని ఎస్పీ నచ్చజెప్పినా వారెవరూ వినలేదు. తాము ఇక్కడే ఉంటామనీ, తమ జీవితం స్వామికి అంకితమంటూ ఖరాకండిగా చెప్పారు.
మరోవైపు వీరికి ఎవరు మద్దతుగా ఉన్నారు? ఈ ఆశ్రమానికి పెద్దఎత్తున నిధులు ఎలా అందుతున్నాయి? వీరు ఇతరులకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు, ప్రాణాలు అయినా అర్పించుకుంటామని పేర్కొంటున్న వైనం.. తదితరాలన్నీ పోలీసులు, అధికారులకు అంతు చిక్కనివిగా మారాయి.
తొలుత శనివారం నిమజ్జనం సమయంలో వివాదం చెలరేగడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అదే రోజు రాత్రి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పుడు పెద్దసంఖ్యలో భక్తులు రహదారిపై బైఠాయించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారందరినీ సొంత ఊళ్లకు వెళ్లిపోవాలంటూ పోలీసులు ఎలాగోలా సర్దిచెప్పారు. అలాగే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి దాదాపు 20 బస్సులను రాత్రి ఒంటి గంట సమయంలో రప్పించారు. అందులో చాలా వరకు భక్తులను పంపించారు.
అలాగే ఇతర ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వచ్చిన భక్తులను కూడా పంపించారు. గణేశ్‌ నిమజ్జన ఊరేగింపులో ఉన్న ఆయా గ్రామాలకు చెందిన వారిపై దాడిచేసిన ఆశ్రమ భక్తుల్లో 10 మంది కీలకమైన ఆశ్రమ కమిటీ సభ్యులను అరెస్ట్‌ చేశారు. దీంతో ఇక పెద్దగా వివాదం ఉండదని పోలీసులు భావించారు.
Tags:Controversy for devotees who are turning to the day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *