మొక్కజొన్న రైతు..దిగాలు

నిజామాబాద్ ముచ్చట్లు:
 
రాష్ట్రంలో మక్క రైతు పరిస్థితి మల్ల ఆగమయ్యేటట్టుంది. రెండేండ్ల నుంచి ప్రభుత్వం మక్కలు కొంటలేదు. పంట పండించిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు అడ్డికి పావుశేరు లెక్కన అమ్ముకొని నష్టపోతున్నరు. ఈ యాసంగిలో సర్కారు వరి వేయొద్దంటే రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల2 వేల 405 ఎకరాల్లో మక్క వేశారు. ఇప్పుడు పంట కోతకొచ్చింది. కానీ కొనుగోళ్లపై ప్రభుత్వం ఇంకా సప్పుడు చేస్తలేదు. మార్క్‌‌ఫెడ్‌‌ దగ్గర ఒక్క మక్క గింజ కూడా లేకున్నా.. నిల్వలు ఉన్నాయని, కొనుగోళ్లతో లాస్వస్తుందనే సాకులు చూపుతూ రెండేండ్ల నుంచి సర్కారు కొనడం లేదు. ఈసారి కూడా కొనకుంటే 4 లక్షల ఎకరాల్లో పండే12.58 లక్షల టన్నుల మక్కలు రైతులు ప్రైవేటు వ్యాపారులకు అగ్గువ సగ్గువకు అమ్ముకోవాల్సిందే. అలా చేస్తే దాదాపు రూ.629 కోట్ల వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. యాసంగిలో వరి వేయొద్దంటే మక్క వేశామని.. ఇప్పుడు చేతికొచ్చిన పంటను ఎలా అమ్ముకోవాలని రైతులు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాసంగిలో నిరుటితో పోలిస్తే రైతులు పెద్ద ఎత్తున మక్క వేశారు. నీళ్లు కూడా సరిపోను ఉండటంతో ఎకరాకు 31.28 క్వింటాళ్ల చొప్పున యావరేజీగా పంట దిగుబడి వచ్చేఅవకాశం ఉంది. ఈ యాసంగిలో ఇప్పటి వరకు ఉన్న సాగు లెక్కల ప్రకారం–12.58 లక్షల టన్నుల మక్క దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం క్వింటాలుకు రూ.1,870 చొప్పున ధర రావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి మార్క్‌‌ఫెడ్‌‌ ద్వారా కొంటేనే మక్కలకు మద్దతు ధర దక్కుతుంది. లేదంటే ప్రైవేటు వ్యాపారులకు అమ్మితే క్వింటాలుకు రూ.500 నుంచి రూ.800 వరకు రైతులు నష్టపోవాల్సి వస్తుంది. యావరేజిగా రూ.500 నష్టం వేసుకున్నా యాసంగిలో రూ.629 కోట్లు నష్టపోయే ప్రమాదం ఉంది.రాష్ట్ర సర్కారు 2019–20 ఏడాది నుంచి మక్కల కొనుగోళ్లు నిలిపివేసింది. రెండేండ్ల క్రితం యాసంగిలో 7 లక్షల ఎకరాలకు పైగా మక్క సాగైంది. మక్కలు కొనబోమని మొదట్లో ప్రభుత్వం చెప్పినా భారీగా దిగుబడి రావడం, రైతులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం స్పందించి మక్కలు కొనుగోలు చేసింది. ఈయేడు కూడా దిగుబడి మెరుగ్గానే ఉన్నట్లు  వ్యవసాయశాఖ అంచనాలు వేస్తోంది. వరి వద్దన్నందుకైనా మక్కలు కొంటుందని రైతులు ఆశతో ఉన్నారు.
 
Tags: Corn farmer

Leave A Reply

Your email address will not be published.