కరోనా బెడ్లు.. ఖాళీగా దర్శనం

Date:17/09/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ప్రభుత్వాస్పత్రుల పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. రోజు రోజుకు కరోనా రోగులు పెరుగుతున్నా వారికి కేటా యించిన బెడ్లు ఖాళీగా దర్శనిమిస్తున్నాయి. చికిత్స కోసం మాత్రం సర్కారు దవాఖానాకు రావడం లేదు. అన్ని రకాల సౌకర్యాలు కల్పించామనీ, ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు దుబారా చేసుకోవద్దని పదే పదే రాష్ట్ర ప్రభుత్వం అంటున్నా ఆస్పత్రుల సౌకర్యాల్లో మార్పు తేలేకపోతున్నది. దీంతో కోవిడ్‌-19 రోగుల చికిత్స కోసం ఏర్పాటు చేసిన బెడ్లు మూడు జిల్లాల్లో, ఒక ఏరియా ఆస్పత్రిలో పూర్తిగా వెల వెలబోతుండగా, మరికొన్ని ఆస్పత్రుల్లో ఒకరిద్దరు రోగులకు చికిత్స అందిస్తూ మమ అనిపిస్తున్నారు. సెలవు దినాలు తప్ప ప్రతి రోజూ రాష్ట్రంలో సగటున 3000మంది వరకు కరోనా బారిన పడుతున్నారు. పాజిటివ్‌లసంఖ్య పెరుగుతున్నా, ఆస్థాయిలోనే ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల సంఖ్య కనిపించకపోవడం గమనార్హం. వీరిలో ఎక్కువ మంది ఇంటి వద్ద ఉండటానికే ఇష్టపడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరేందుకే ఆసక్తి చూపించడం మారని సర్కారు దవాఖానాల తీరుకు అద్దం పడుతున్నది.

 

 

రాష్ట్రంలో 42 ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఇందులో తాండూరు ఆస్పత్రిలో 300, ఉట్నూరులో ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో 80 బెడ్లు, దోమకొండ ఏరియా ఆస్పత్రిలో 25, జనగామ జిల్లా ఆస్పత్రిలో 13 రోగులు లేకుండా ఖాళీగా పడి ఉన్నాయి. ఈ నాలుగు ఆస్పత్రులున్న జిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువేమి లేదు. గత వారం రోజుల్లో కామారెడ్డిలో అత్యధికంగా 516 కేసులు రాగా, జనగామలో 241, ఆదిలాబాద్‌ లో 177, వికారాబాద్‌ లో 123 వచ్చాయి. మరో ఏడు ఆస్పత్రుల్లో కేవలం 10 లోపు మాత్రమే ఉన్నారు. మెదక్‌ జిల్లా ఆస్పత్రిలో 46 పడకలకు గాను ఒక్కరు మాత్రమే ఉండగా, నారాయణపేటలో 160కి ఐదుగురు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఫీవర్‌ ఆస్పత్రిలో వందకు ఏడుగురు, మంచిర్యాల జిల్లా ఆస్పత్రిలో 240కి ఏడుగురు, గోధావరిఖని ఏరియా ఆస్పత్రిలో 60కి ఎనిమిది, పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో 84కు కేవలం తొమ్మిది మంది మాత్రమే రోగులుండడం గమనార్హం. మొత్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో కేవలం 2725 మందికి మాత్రమే చికిత్స అందిస్తున్నారు. రోగులను చూసేందుకు తగినంత మంది సిబ్బంది లేకపోవడం, సిబ్బంది ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సౌకర్యాల సమస్య ఇప్పటికీ కొనసాగుతుండడమే రోగులు ప్రభుత్వాస్పత్రుల పట్ల విముఖత చూపించడానికి కారణాలుగా ఉంటున్నాయి.

 

 

అదే సమయంలో పలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయకరోనా చికిత్స విషయంలో ప్రభుత్వాస్పత్రులకే పరిమితం చేసి ఉంటే ఈపాటికి సిబ్బంది భర్తీ, సదుపాయల కల్పన అనివార్యమై ఉండేది. అలా కాకుండా ప్రయివేటు ఆస్పత్రులకు జీహెచ్‌ఎంసీతో సహా 16 జిల్లాల్లో 199 ఆస్పత్రుల్లో 10,443 పడకలకు అనుమతించగా 4208 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీటిని రోజు రోజూకు పెంచుకుంటూపోతున్నారు. ఒకవైపు ప్రభుత్వాస్పత్రుల్లో రోగులను ఆకర్షించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన సర్కారు అందుకు విరుద్ధంగా ప్రయివేటుకు అనుమతులిచ్చేందుకే పరిమితమవుతున్నది. ఈ తరహా విధానాల కారణంగానే పేద ప్రజలు ఇంటిపట్టున, స్థోమత కలిగిన వారు ప్రయివేటుకు వెళ్లేలా చేసిందని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నారు. ప్రయివేటు అనుమతలపై ఉన్న శ్రద్ధ తగ్గించి ప్రజారోగ్యవ్యవస్థను బలపరడంపై పెట్టాలని సూచిస్తున్నారు.

 18న శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Tags: Corona beds .. empty view

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *