అవినీతి హారం 

Date:15/02/2018
మెదక్‌ ముచ్చట్లు:
రాష్ట్రంలో హరితహారం పథకం పక్కదారి పడుతోంది. పచ్చదనం పేరిట అక్రమార్కులు కోట్లాది రూపాయలు స్వాహా చేస్తున్నారు. మెదక్ జిల్లా, నత్నాయిపల్లిలోని మోడల్‌ నర్సరీ 2015-16 సంవత్సరంలో 5 లక్షలు; 2016-17లో 14.79 లక్షల మామిడి మొక్కలను హరితహారానికి అందజేసినట్లు పేర్కొన్నారు. ఒక్కో మొక్కను రూ.30 చొప్పున విక్రయించారు. ఇక్కడ అసలు నీళ్లు లేకుండా.. మొక్క పెంచకుండా అన్ని లక్షల మొక్కలను సరఫరా చేయడం ఎలా సాధ్యం!? ఇందుకు జవాబు.. ఆ లెక్క సర్కారుదే కానీ మొక్క మాత్రం ప్రైవేటుది!హరితహారంలో భాగంగా ప్రభుత్వం తమకిచ్చిన లక్ష్యాలను అందుకునేందుకు ప్రైవేటు నర్సరీల నుంచి కొని తెచ్చి, వాటిని ప్రభుత్వ నర్సరీలో పెంచినట్లు చూపించి ప్రభుత్వానికే అమ్మారు. సర్కారు ఖజానాకే గండి పెట్టారు. ఒక్క నత్నాయిపల్లిలోనే కాదు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, నల్లగొండ సహా మరికొన్ని జిల్లాల్లోని ప్రభుత్వ నర్సరీల్లో ఇదే పరిస్థితి అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొక్కల లావాదేవీల్లో ఏకంగా ఐదారు కోట్ల అక్రమాలు జరిగాయని అంచనా.పచ్చదనాన్ని పెంచేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ దళారులు, ప్రైవేటు నర్సరీల యజమానులకు వరంగా మారింది. ఉద్యానవన శాఖలో వివిధ స్థాయిల్లోని అధికారులకూ కల్పవృక్షమైంది. హరితహారంలో భాగంగా 2017-18లో 40 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. వీటిని ప్రభుత్వ నర్సరీలే సరఫరా చేయాలి. అటవీ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలోని నర్సరీలు, సామాజిక వనాలు, జిల్లాల్లోని నర్సరీల నుంచి వీటిని సరఫరా చేసినట్లు ఆయా శాఖలు చెబుతున్నాయి. నిజానికి, 2017-18లో పెట్టుకున్న 40 కోట్ల మొక్కల లక్ష్యానికి డిసెంబరునాటికి 30 కోట్ల మొక్కలను నాటినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 27 లక్షల పండ్ల మొక్కలను ఉద్యానవన శాఖ సరఫరా చేసింది. మామిడి మొక్కకు రూ.30 చొప్పున, జామకు రూ.20, కొబ్బరి మొక్కకు రూ.35 చొప్పున ప్రభుత్వానికి విక్రయించింది. మిగిలిన మొక్కల్లో అధిక భాగం అటవీ శాఖ నుంచే సరఫరా అయ్యాయి.హరితహారంలో కోట్లాది మొక్కలను నాటేందుకు అటవీ, ఉద్యానవన శాఖ అధికారులకు టార్గెట్లు ఇచ్చారు. నిజానికి, అన్ని సౌకర్యాలూ, సిబ్బంది ఉన్నాయని భావించిన ప్రైవేటు నర్సరీల్లోనే ఏడాదికి 2.5-3 లక్షలకు మించి మొక్కలను ఉత్పత్తి చేయలేరు. అన్ని కోట్ల మొక్కలను సరఫరా చేయలేక అధికారులు అడ్డదారులు వెతికారని తెలుస్తోంది. ప్రధానంగా హోం స్టేట్‌ ప్లాంటేషన్‌లో భాగమైన పండ్ల మొక్కల పంపిణీలోనే అక్రమాలు జరిగాయని సమాచారం. ప్రైవేటు నర్సరీల్లో తక్కువ ధరకు పనికిరాని మొక్కలు కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ఉద్యాన వన శాఖ.. వాటిని ఎక్కువ ధరకు ప్రభుత్వానికే అంటగడుతోంది. తద్వారా కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండి పెడుతోంది. గతంలో ఓపెన్‌ టెండర్‌ వేసి అర్హులను ఎంపిక చేసి మొక్కల సరఫరా టెండర్‌ ఇచ్చేవారు. ప్రైవేటు నర్సరీలతో ధరపై సంప్రదింపులు జరిపేవారు. కానీ, ఇప్పుడు ఉద్యానవన శాఖ రూటు మార్చింది.మొక్కలకు తామే అంటుకట్టామని చెప్పుకొంటూ ప్రైవేటు నర్సరీలు, బ్రోకర్ల నుంచి కొన్న మొక్కలను సరఫరా చేస్తోంది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో ట్రైజెం పథకం అమలవుతోంది. దీనికింద నిరుద్యోగ యువతకు నర్సరీలపై శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తర్వాత వారు నర్సరీలు పెట్టుకుని ఉపాధి పొందుతున్నారు. వారికి లైసెన్స్‌లు కూడా జారీ చేశారు. వీరి నుంచి పాడైన, పనికిరాని మొక్కలను ఒక్కో మొక్కకు 8-10 రూపాయల చొప్పున బ్రోకర్లు కొనుగోలు చేస్తున్నారు. అవే మొక్కలను 12-14 రూపాయలకు ఉద్యానవన శాఖకు కట్టబెడుతున్నారు. రవాణా, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కలిపి ఒక్కో మొక్కకు సర్కారు నుంచి రూ.30 వసూలు చేస్తోంది. తద్వారా, ఒక్కో మొక్క ద్వారా 10-15 రూపాయల అవినీతి జరుగుతోందని అంచనా. ఈ ఏడాది హరితహారంలో హోం స్టేట్‌ ప్లాంటేషన్‌ కింద 40-50 లక్షల మొక్కలు సరఫరా చేశారు. తద్వారా ఐదారు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.ఉద్యానవన శాఖ కమిషనర్‌ నుంచి కింది స్థాయి వరకూ వివిధ స్థాయిల్లో అధికారులు ఈ అవినీతి దందాలో భాగస్వాములని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేనా, జామ, అల్లనేరేడు, దానిమ్మ, ఉసిరి, సీతాఫలం వంటి పండ్ల మొక్కలను అంటుకట్టిన వాటిని మాత్రమే హరితహారంలో సరఫరా చేయాలి. కానీ, సీడ్లింగ్‌ (గింజలు వేసి పెంచిన మొక్కలు) మొక్కలను ఉద్యానవన శాఖ సరఫరా చేసేస్తోంది. చిన్న చిన్న నర్సరీల నుంచి కూడా లక్షల మొక్కలు కొనుగోలు చేసినట్లు చూపించారు. నత్నాయపల్లి నర్సరీ నుంచే ఈ ఏడాది 15 లక్షల మొక్కలు కొనుగోలు చేసినట్లు చూపించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కో మొక్కను పెంచేందుకు రూ.22 ఖర్చు చేశామని, సర్కారుకు రూ.30 చొప్పున విక్రయించామని, నర్సరీకి కోటి రూపాయల లాభం వచ్చిందని కూడా సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే, మొక్కల సరఫరాకు పెద్దాపూర్‌, నర్సాపూర్‌ తదితర ప్రాంతాల్లో మధ్యవర్తులు ఉన్నారు.
Tags: Corruption denomination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *