రహదారులకు అవినీతి చీడ

Date:16/02/2018
కరీంనగర్ ముచ్చట్లు:
ప్రభుత్వ పనుల్లో అవకతవకలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు కాసులకు కక్కుర్తిపడి నాసిరకం పనులు జరిపిస్తుండడం వల్లే ఈ సమస్య. ఇక పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా ఉదాసీనంగా ఉండడం సమస్య తీవ్రతను రెట్టింపు చేస్తోంది. మొత్తంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అవినీతి, అలసత్వం చీడ పట్టిపీడిస్తోంది. కరీంనగర్ ప్రాంతంలో నిర్మించిన రహదారులకు సైతం ఇదే జబ్బు పట్టుకుందని స్థానికులు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా రోడ్లు నిర్మించేయడంతో నెలల వ్యవధిలోనే అవి అధ్వాన్నంగా మారాయని అంటున్నారు. జీవో 36 ప్రకారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మొదటి విడతగా 616.25 కిలోమీటర్ల పొడవైన 225 రహదారుల నిర్మాణానికి గ్రామీణ రహదారుల నిర్మాణం(సీఆర్‌ఆర్‌) కింద రూ.361.47 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. ఇందులో సుమారు 200 రహదారులు ప్రస్తుత కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్నాయి. మిగిలినవి జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ అర్బన్‌, సిద్దిపేట పరిధిలోకి వెళ్లాయి. ఈ రహదారుల నిర్మాణం 2015, 2016ల్లో ప్రారంభించి 2017 ఆఖరు నాటికి పూర్తి చేశారు.
నిబంధనల ప్రకారం రహదారులు నిర్మించిన కాంట్రాక్టర్లు అయిదేళ్ల పాటు వీటి నిర్వహణను నిర్వహించాలి. పనులు సక్రమంగా పూర్తి చేసేలా.. మరమ్మతులు చేపట్టేలా పంచాయతీరాజ్‌ ఇంజినీర్ల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండాలి. కానీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అది ఎక్కడా కానరావడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కిలోమీటర్‌ రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.58 లక్షలు ఖర్చు చేశారు. ఇంత మొత్తం వెచ్చించి ఒకే వరుసలో నిర్మించిన ఈ రహదారులు వాస్తవానికి పటిష్టంగా ఉండాలి. కానీ అలాంటిది ఎక్కడా కనిపించడంలేదు. రోడ్లు నిర్మించి మూడేళ్లు కాకముందే చాలా వరకు దెబ్బతిన్నాయి. తారు లేచిపోయి మోకాలు లోతు గుంతలు ఏర్పడ్డాయి. పలు మార్గాల్లో కల్వర్టులకు సైడ్‌ వాల్స్‌,  సైడ్‌బర్మ్స్‌ నిర్మించలేదు. పలు పనులు అసంపూర్తిగా వదిలేశారు. ఈ రహదారుల నిర్మాణం ఏకకాలంలో సాగడంతో నాణ్యత పాటించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రహదారులు మూడు, రెండేళ్లలోపే దెబ్బతినడం ఆ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. ఈ రోడ్లు దెబ్బతింటే అయిదేళ్లపాటు గుత్తేదారులు మరమ్మతులు చేయాలి. కానీ గుత్తేదారులు ఆ పనులను పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా ఇంజినీర్ల క్షేత్ర స్థాయి పర్యవేక్షణతో మరమ్మతులు చేపట్టేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Tags: Corruption pest to roads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *