Natyam ad

పత్తిని ముంచుతున్న నకిలీలలు

కర్నూలు ముచ్చట్లు:


నకిలీ విత్తనాలు పత్తి రైతులను ఈ ఏడాదీ ముంచాయి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం యాటకల్లుకు చెందిన రంగన్న ఎనిమిది ఎకరాల్లో, సుదర్శన్‌ ఏడు ఎకరాల్లో, వడ్డే రాజు, నాగార్జున మూడు ఎకరాల్లో చొప్పున, నగరూరు గ్రామానికి చెందిన నరసింహారెడ్డి ఐదు ఎకరాల్లో, రాముడు మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఆదోని పట్టణంలో వివిధ రకాల పత్తి విత్తనాలు కొనుగోలు చేశారు. సాగు చేసిన తర్వాత ఆశించిన స్థాయిలో ఎదుగుదల ఉండడంతో దిగుబడులు బాగా వస్తాయని ఆనంద పడ్డారు. పైరు ఎదిగినప్పటికీ కాయలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దిగుబడులు పూర్తిగా తగ్గాయి. మొదటి కోతలు సాధారణంగా పక్కన ఉన్న పత్తి పొలాల్లో ఎకరాకు ఐదు క్వింటాళ్లువచ్చాయి. వీరి పొలాల్లో ఎకరాకు క్వింటాలులోపే దిగుబడి వచ్చింది.
రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో పత్తిని అధికంగా సాగు చేస్తున్నారు. సాధారణ సాగు విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలు. ఈ ఏడాది 2.66 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. గతేడాది అత్యధికంగా క్వింటాలు పత్తి రూ.12,500 వరకూ పలికింది. దీంతో, ఈ ఏడాది పత్తి సాగు వైపు రైతులు మొగ్గు చూపారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొన్ని పత్తి విత్తనాల కంపెనీలు కల్తీ విత్తనాలను యథేచ్ఛగా అమ్మి సొమ్ము చేసుకున్నాయి. దిగుబడులు లేకపోవడంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఎమ్మిగనూరు మండలంలో 30,191 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. రాధిక కెడిసిఎస్‌హెచ్‌ రకం వేసిన రైతుల పొలాల్లో కాయలు రాలేదు. దీంతో, 40 మంది రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. నకిలీ విత్తనాల వల్ల మోసపోయామని ఆస్పరి మండలం యాటకల్లుకు చెందిన 30 మంది, నగరూరుకు చెందిన ఎనిమిది మంది రైతులు అధికారులకు ఫిర్యాదు చేసి తమకు తమకు న్యాయం చేయాలని కోరారు.

 

 

కల్లూరు మండలం గోకులపాడు, పర్ల, కోడుమూరు మండలం కల్లపరి గ్రామాల్లోనూ రైతులు నకిలీ విత్తనాల బారిన పడ్డారు. ఇలా కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 ఎకరాల్లో పత్తి పంట దిగుబడి రాక రైతులు నష్టపోయారు. బాధితుల్లో తులసి అకిరా, నూజివీడు ఆశ, కేసరి రకాల విత్తనాలు వేసిన వారు ఉన్నారు.గతేడాది ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని 1,889 మంది రైతులు 7,258 ఎకరాల్లో జాదూ విత్తనాలను సాగు చేసి నష్టపోయారు. బాధిత రైతులకు సంబంధిత కంపెనీ నుంచి పరిహారం ఇప్పిస్తామని వ్యవసాయ శాఖాధికారులు ప్రకటించారు. అయితే, పరిహారం ఇవ్వకుండా కోర్టును జాదూ కంపెనీ ఆశ్రయించింది. ప్రస్తుత ఏడాదీ అదే స్థాయిలో రైతులు నష్టపోయి ఉండే అవకాశం ఉంది.గతంలో నకిలీల అనుభవం ఉన్నా నకిలీ, కల్తీ విత్తనాలను అడ్డుకోవడంపై దృష్టి సారించాల్సిన వ్యవసాయ శాఖ, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఎటువంటి తనిఖీలూ చేపట్టలేదు. జిల్లా పునర్విభజన నేపథ్యంలో తనిఖీలు చేసేందుకు సిబ్బంది కొరత ఉందని సాకుగా చెబుతున్నారు. ఏప్రిల్‌ నుంచే వ్యవసాయాధికారులు బృందాలుగా ఏర్పడి విత్తన శుద్ధి కేంద్రాల్లో తనిఖీలు చేయాల్సి ఉండగా, ఆ ఊసే లేకుండాపోయింది. మరోవైపు పత్తి రైతులను అధిక వర్షాలు, ఎర్రపురుగు నష్టాలను మిగిల్చాయి. ఈ నెలలో కురిసిన అధిక వర్షాల వల్ల కర్నూలు జిల్లాలో 2,737 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. ఎర్రపురుగు పత్తి పంటను ఆశించడంతో కోడుమూరు మండలం కలపర్రిలో 250 ఎకరాల్లో, గూడూరు మండల వ్యాప్తంగా దాదాపు 400 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది.
దిగుబడి పూర్తిగా లేదని చెబుతున్నారు.

 

Post Midle

Tags: Cotton-dipping fakes

Post Midle