ఆకట్టుకొనే కధాంశంతో దొరసాని

Date:12/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

పరిశ్రమకు చెందిన ప్రముఖుల వారసులు వెండితెరకు పరిచయమవుతున్నారంటే సాధారణంగానే హడావుడి ఉంటుంది. ముఖ్యంగా హీరోహీరోయిన్ల సంతానం, తోబుట్టువులు పరిచయమవుతున్నారంటే అందరి దృష్టి ఆ సినిమాపైనే ఉంటుంది. విమర్శకులు కూడా వీరిపైనే ఓ కన్నేసి ఉంచుతారు. ఈ అంచనాలన్నింటినీ అధిగమించి టాలీవుడ్‌లో మంచి నటుడిగా లేదంటే నటిగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ ఇలాంటి పరీక్షనే ఎదుర్కొన్నారు. మరి ఈ పరీక్షలో వాళ్లు పాసయ్యారా? ‘దొరసాని’ ప్రేక్షకులను మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం.

 

 

 

స్టోరీ లైన్ కొత్తదేమీ కాదు. గొప్పింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమకథ చివరికి ఏమైందనే కాన్సెప్ట్‌తో ఇప్పటికే టాలీవుడ్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే, ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది పూర్తిగా తెలంగాణ ప్రాంత నేపథ్యంలో సాగిన ప్రేమకథ. అందులోనూ ఒకప్పటి దొరల కాలంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జరిగిన కథ. అప్పటి దొరల కుటుంబాలు పరువు కోసం ఎంతకైనా తెగిస్తాయని చెప్పే కథ. రాజు (ఆనంద్) ఇళ్లకు సున్నాలేసే ఒక పేదోడి కొడుకు. దేవకి (శివాత్మిక) ఆ ఊరి దొర (వినయ్ వర్మ) కూతురు, చిన్న దొరసాని. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అది కాస్త దొరకు తెలుస్తుంది. ఆ తరవాత ఏం జరిగింది? పేదోడు తమ పక్కన నిలబడటాన్ని కూడా సహించని దొర.. తన కూతురు చేయిపట్టుకున్న రాజును ఏం చేశాడు? అనేదే సినిమా.

 

 

తెలిసిన కథే కదా ఇక సినిమాలో ఏముంటుంది అనుకుంటే తప్పులో కాలేసినట్టే. తెలిసిన కథనే మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు దర్శకుడు కేవీఆర్ మహేంద్ర. 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. సినిమా చూస్తున్నంత సేపు మనం అప్పటి దొరల కాలానికి వెళ్లిపోతాం. అంతబాగా సినిమాలో ప్రేక్షకుడిని లీనం చేయగలిగారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత నేపథ్యం, మాట్లాడే యాస సినిమాకు ప్లస్ అయ్యాయి. డైలాగులు కూడా చాలా సింపుల్‌గా ఉన్నాయి.

 

 

 

అప్పటి దొరలు ఏ విధంగా ఉండేవారు, వారి ప్రవర్తన ఎంత కఠినంగా ఉండేది, వారికి ప్రజలు ఎలా భయపడేవారు వంటి విషయాలను దర్శకుడు చాలా సహజసిద్ధంగా చూపించారు. దొర గడిలోకి అడుగుపెట్టడానికి కూడా బయటపడే కుటుంబానికి చెందిన కుర్రాడు.. ఆ గడిలోని దొరసానినే ప్రేమించడం, ఆమె ప్రేమను పొందే విధానం ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. సినిమాలో ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు కనిపించవు. సినిమాకు మైనస్ అంటూ ఏమైనా ఉందంటే స్లో నెరేషన్ ఒక్కటే. కథనం కాస్త నెమ్మదిగా నడుస్తుంది.

 

 

 

అంతకు మించి ఈ సినిమాలో వంక పెట్టడానికి ఏమీలేదు. సినిమా ఫస్టాఫ్‌లో దొరసాని, రాజు మధ్య ప్రేమకథను చూపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో వాళ్లకు ఎదురైన ఒడిదొడుకులను చూపించారు. కథలో నక్సలైట్ల ఉద్యమాన్ని కూడా భాగం చేశారు. నక్సలైట్ల నేపథ్యం ఎందుకనేది సినిమాలోనే చూడాలి.
సినిమాలో ఏ సన్నివేశం అతిగా అనిపించదు. ప్రతి సన్నివేశం చాలా సహసిద్ధంగా బయట జరుగుతున్నట్టే ఉంటుంది. నటీనటులు సైతం చాలా నేచురల్‌గా చేశారు. హీరోహీరోయిన్లతో పాటు మరో ఇద్దరు ముగ్గురు తప్ప తెరపై కనిపించే మిగిలిన ముఖాలన్నీ కొత్తవే.

 

 

 

ఆనంద్‌కు విజయ్ దేవరకొండ తమ్ముడు అనే ట్యాగ్ ఒకటి తగిలించారు. కాబట్టి, అతని నుంచి కాస్త ఎక్కువగా ఆశిస్తారు. ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా చేశాడాయన. తొలి సినిమాతో ఆకట్టుకున్నాడు. డీగ్లామరస్‌గా, చదువుకున్న పేదోడి కొడుకుగా చాలా సహజసిద్ధంగా కనిపించాడు. పోలీస్ స్టేషన్‌లో రాజును పోలీసులు బట్టలు మొత్తం విప్పి కొడతారు. ఈ సన్నివేశంలో ఆనంద్‌ను వెనకనుంచి నగ్నంగా చూపించారు. నగ్నంగా నటించడానికి కూడా వెనకాడలేదంటే నటనపై ఆనంద్‌కు ఉన్న కమిట్‌మెంట్ ఏంటో అర్థమవుతోంది. ఇక దొరసానిగా నటించిన శివాత్మిక తానేం తక్కువ కాదంటూ అద్భుతంగా నటించింది.

 

 

 

 

పెద్దగా మేకప్ లేకుండా సహజసిద్ధంగా కనిపించింది. దొరసానిగా ఎంత హుందాతనం చూపించిందో ప్రియుడి కోసం పరితపించే ప్రేయసిగానూ అంతే బాగా నటించింది. తొలి సినిమాతో ఆకట్టుకుంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చి రాజు కోసం ఆరా తీసే సన్నివేశంలో శివాత్మిక నటన కంటతడి పెట్టిస్తుంది. మొత్తానికి హీరోహీరోయిన్లు ఇద్దరూ తొలి పరిచయంతోనే ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో ఇతర పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర నటించారు.

 

 

సినిమాకు కథనం, నటీనటులతో పాటు సంగీతం, ఆర్ట్, నిర్మాణ విలువలు ప్రధాన బలాలు. 1980ల్లో తెలంగాణలో దొరల గడీలు, గ్రామాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టు చూపించారు. రియల్ లొకేషన్లలో చిత్రీకరించడమే దీనికి కారణం. ఇక ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం చాలా బాగుంది. వినసొంపైన పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ఎసెట్. ఎడిటర్ నవీన్ నూలి సినిమాను బాగా ఎడిట్ చేశారు. సినిమా నిడివి తక్కువగా ఉండటం కూడా సినిమాకు ప్లస్సే.

అమ్మ ఒడికి పెద్ద ఎత్తున నిధులు

Tags: Countess with impressive storyline

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *