పాతభవనాల కూల్చివేతకు కోర్టు అడ్డంకులు

హైద్రాబాద్  ముచ్చట్లు:


శిథిలావస్థకు చేరిన భవనాల కూల్చివేతలో జీహెచ్ఎంసీ విభాగాల మధ్య సమన్వయ లోపం భవన యజమానుల పాలిట శాపంగా మారాయి. శిథిలావస్థకు చేరి కూల్చాల్సిన భవనాలను సకాలంలో కూల్చకపోవడంతో అవి ఎప్పుడు కూలి మీద పడతాయోనని యజమానులతో పాటు సమీప ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. సరైన సమయంలో నిర్ణయం తీసుకుని అటువంటి భవనాలను కూల్చి వేయవలసి ఉండగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేక జేఎన్టీయూకు భవనం పటిష్టతను తెలపాలని రాస్తున్నారు. అయితే పలు కారణాల వల్ల జేఎన్టీయూ నుండి నివేదికలు రావడంలో ఆలస్యమవుతున్నాయి. దీంతో శిథిలావస్థకు చేరిన భవనాల కూల్చివేతలో ఇబ్బందులు ఏర్పడుతుండగా వాటికి సమీపంలో ఉన్న వారు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెల్లదీస్తున్నారు.జీహెచ్ఎంసీ పరిధిలో శిథిలావస్థకు చేరిన భవనాలకు టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.

 

 

భవనం శిథిలావస్థకు చేరిందని, వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారు. తీరా కూల్చివేత విషయానికి వచ్చే సరికి జేఎన్టీయూకు లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నారు. భవన పటిష్టత విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులకు సందేహాలు ఉంటే శిథిలావస్థకు చేరిందని నిర్ధారిస్తూ.. నోటీసులు ఎలా జారీ చేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఒకవేళ శిథిలావస్థకు చేరలేదంటే నోటీసులు ఎందుకు ఇచ్చారు..? ఇలాంటి ప్రశ్నలు భవన యజమానులను తికమకకు గురి చేస్తుండగా అధికారులు మాత్రం వారి సందేహాలతో మాకు సంబంధం లేదన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీనికితోడు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం నుండి వచ్చిన లేఖలకు జేఎన్టీయూ అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో వారి నివేదిక రావడానికి కొన్ని సందర్భాలలో నెలల సమయం పడుతోంది. ఫలితంగా భవన యజమానులు జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ.. ప్రదక్షిణలు చేస్తుండగా ఇంకా జేఎన్టీయూ నివేదిక రాలేదని చెప్పి కూల్చివేత పనులను దాట వేస్తున్నారు. దీంతో అలాంటి భవనాలను కూల్చాలా..? వద్దా..?

 

 

 

అనేది తెలియకుండా యజమానులు ఆందోళన చెందుతున్నారు.గ్రేటర్ పరిధిలో కొంత మంది భవన యజమానులు జీహెచ్ఎంసీ నుండి భవనం శిథిలావస్థకు చేరిందని నోటీసులు అందుకోగానే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో న్యాయస్థానం కూల్చివేతలపై స్టే విధిస్తోంది. అధికారులు కూల్చాలనుకున్న భవనాల విషయంలో కోర్టులో కేసులు నడుస్తుండగా ఎలాంటి కేసులు లేని వాటిని కూల్చివేసేందుకు జేఎన్టీయూ రిపోర్టు పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇలా శిథిల భవనాల కూల్చివేత విషయంలో బల్దియా అధికారులు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.జీహెచ్ఎంసీ సర్కిల్ 14 పరిధిలోని ఓ ప్రార్ధనా మందిరం శిథిలావస్థకు చేరింది. తరచుగా పెచ్చులూడి పడుతుండడంతో దాని నిర్వాహకులు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు శిథిలావస్థకు చేరిన భవనంగా గుర్తించి మొదటి హెచ్చరిక నోటీసునే ఏడాది క్రితం జారీ చేశారు. అప్పట్లో ఇంజనీరింగ్ అధికారులు ప్రార్థనా మందిరాన్ని తనిఖీ చేసి జేఎన్టీయూ నిర్ణయం తీసుకోవాలంటూ తప్పుకున్నారు. ఇప్పుడు తిరిగి వర్షాకాలం కూడా మొదలు కావడంతో భవనం పటిష్టత ఎలా ఉందో తెలియక నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నగరంలో కురుస్తున్న వర్షాలకు ప్రార్థనా మందిరం పై భాగంలో పెచ్చులూడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన ప్రార్థనా మందిరాన్ని కూల్చి వేయాలని నిర్వాహకులే స్వయంగా కోరుతుండగా జేఎన్టీయూ రిపోర్టు పేరుతో అధికారులు మీనమేషాలు లెక్క పెడుతున్నారు. వర్షాల కారణంగా ఎలాంటి నష్టం జరగకముందే కూల్చివేత చర్యలు చేపట్టాలని వారు అధికారులను కోరుతున్నారు.

 

Tags: Court blocks demolition of old buildings

Leave A Reply

Your email address will not be published.