కడప జిల్లాల్లో 33 వేల హెక్టర్లలో పంట నష్టం

Crop loss in 33 thousand hctors in Kadapa districts

Crop loss in 33 thousand hctors in Kadapa districts

Date:15/09/2018
కడప ముచ్చట్లు :
కడప జిల్లాలో వరసగా అయిదో ఏడాదీ పంట నష్టం అంచనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపారు. రైతువారీ సర్వే నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు అందగానే సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపేందుకు వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకూ లక్షా అయిదు వేల హెక్టార్లలో పంటలు సాగవగా, జులై, ఆగస్టు నెలల్లో సాగైన విస్తీర్ణంలో సుమారు 60వేల హెక్టార్లలో పంటలు కోల్పోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
వర్షాభావ పరిస్థితుల్లో జిల్లాలో 30 శాతం విస్తీర్ణం మాత్రమే సాగులోకి వచ్చింది. మిగిలిన విస్తీర్ణంలో సాగు చేయడానికి అదను దాటిపోయింది.వ్యవసాయశాఖ పంపిన ప్రాథమిక నివేదిక ప్రకారం ఇన్‌పుట్‌ రాయితీ కింద రూ. 60 కోట్లు జిల్లాకు కేటాయించాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల నిబంధనల ప్రకారం పపు ధాన్య పంటలకు హెక్టారుకు రూ. పది వేలు, మొక్క జొన్నకు రూ. 12 వేలు, పత్తి, వరి, వేరుసెనగ, పొద్దుతిరుగుడు పంటలకు రూ. 15వేలు చెల్లిస్తారు.
ఆ విధంగా పంట నష్టం అంచనా వేసి నివేదిక పంపారు. జిల్లాలో పంటలు కోల్పోయిన రైతులు సుమారు 65 వేల మంది ఉంటారని అంచనా. 15 రోజులుగా గ్రామాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత 40 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించగా… ఆయా మండలాల్లోనే అంచనాలు ప్రారంభించారు. ఇటీవల మిగిలిన 16 మండలాలనూ కరవు జాబితాలో చేర్చారు.
దాంతో అక్కడా పంట నష్టం అంచనా చేపట్టారు. అన్ని మండలాల నుంచి ప్రాథమిక నివేదికలు అందాయి. ఆ ప్రకారం మొత్తం 60 వేలకుపైగా హెక్టార్ల పంటల్లో 33 శాతానికిపైగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రభుత్వం తొలుత ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం జులై 31 నాటికి సాగైన పంటలనే పరిగణనలోకి తీసుకున్నారు. అప్పటికి జిల్లాలో 38 వేల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. తర్వాత కూడా వర్షాలు లేక ఆగస్టులో వేసిన పంటలూ ఎండిపోయాయి. దాంతో రైతులు ఖరీఫ్‌లో సాగైన పంటలన్నిటినీ లెక్కలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
దాంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకూ సాగు చేసిన పంటలనూ పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. జిల్లాలో ఆలస్యంగా ఖరీఫ్‌ సాగవుతుందని, ఆగస్టు ఆఖరి వరకూ లెక్కించాలని కోరారు. దాంతో అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. జులై ఆఖరు వరకూ సాగైన పంటలను ఒక జాబితాగా, ఆగస్టులో సాగైన విస్తీర్ణాన్ని మరో జాబితాగా తయారు చేస్తున్నారు.
ప్రత్యామ్నాయంగా స్వల్పకాలిక పంటలు సాగు చేయడానికి రైతులకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాకు కంది, అలసంద విత్తనాలు మొత్తం ఏడు వేల క్వింటాళ్లు కేటాయించారు. కంభం, మార్కాపురం మండలాల్లో రైతులకు పంపిణీ ప్రారంభించారు. వర్షం పడక పోవడంతో జిల్లా అంతటా పంపిణీ చేసినా ప్రయోజనం ఉండదని, విత్తనం దుర్వినియోగం అవుతుందని భావించి సరఫరా నిలిపివేశారు. వర్షాలు ప్రారంభమయ్యాక పంపిణీ చేపట్టాలని యోచిస్తున్నారు.
Tags:Crop loss in 33 thousand hctors in Kadapa districts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *