Natyam ad

అడ్డగోలుగా… కిడ్నీల అమ్మకం

విశాఖపట్టణం ముచ్చట్లు:


విశాఖ తీరంలో కిడ్నీ రాకెట్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్లను టార్గెట్ చేసిన గ్యాంగ్.. డబ్బు ఆశచూపి అమాయకుల కిడ్నీ తీసుకుని మోసం చేస్తోంది. బాధితుడి ఫిర్యాదుతో ఈ గ్యాంగ్ అరాచకాలు బయటపడ్డాయి. పెందుర్తిలోని ఓ ప్రైవేటు ఆసుత్రి ఈ దారుణమైన కిడ్నీరాకెట్‌ దందాకి తెరతీసింది. పేదజనం అవయవాలను కాజేస్తోన్న ఓ ముఠా చేతిలో వినయ్‌కుమార్ అనే యువకుడు బలయ్యాడు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో మంచానికి పరిమితమయ్యాడు. అయితే ఒక్కరో ఇద్దరో కాదు ఏకంగా ఏడుగురు బాధితుల నుంచి కేటుగాళ్లు కిడ్నీలు తీసేసుకున్నట్లు తెలిసింది. మధురవాడ వాంబే కాలనీకి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ వినయ్‌కుమార్‌‌తో స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఉద్యోగి కామరాజుతో కొంత కాలంగా పరిచయం ఉంది. వినయ్ తన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవని తన బాధను చెప్పుకున్నాడు. ఇదే అదునుగా భావించిన కామరాజు.. కిడ్నీ అమ్మితే రూ.ఎనిమిదిన్నర లక్షలు వస్తాయని వినయ్‌కు చెప్పి నమ్మేలా చేశాడు.ఈ విషయం వినయ్ తల్లిదండ్రులకు తెలియడంతో అతడిన మందలించి.. ఇక్కడ ఉండొద్దని హైదరాబాద్ పంపించారు.

 

 

 

తర్వాత కూడా కామరాజు తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు బాధితుడు వినయ్ తెలిపారు. కిడ్నీ ఇస్తానని మోసం చేశావని.. తల్లిదండ్రులను రోడ్డుకు ఈడుస్తానని బెదిరించాడని.. కామరాజు ఒత్తిడితో హైదరాబాద్‌ నుంచి వచ్చినట్లు వినయ్ చెప్పాడు. ఆ వెంటనే తనను రైల్వే న్యూ కాలనీ దగ్గర నుంచి పెందుర్తికి తీసుకువెళ్లాడని వినయ్ వివరించాడు. పెందుర్తి దగ్గర ఉన్న తిరుమల ఆస్పత్రిలో మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. కిడ్నీ తీసేసినట్లు చెప్పాడు. తాను ఇంటికి వచ్చాక రూ.ఐదు లక్షలు ఇచ్చారని వీడియో తీయించి.. తన తండ్రికి మాత్రం రూ.2లక్షల 50 వేలు మాత్రమే ఇచ్చారన్నారు. కామరాజు మిగిలిన డబ్బులు తీసుకెళ్లాడని.. రూ.8 లక్షలు ఇస్తామని.. రూ.2 లక్షల 50 వేలు మాత్రమే ఇచ్చినట్లు వినయ్ తెలిపాడు. తాను ఇప్పుడు నడవలేకపోతున్నట్లు బాధితుడు వినయ్ చెప్పాడు. కిడ్నీ ఇస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని భావించానని.. కానీ నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధితుడు వినయ్‌కుమార్‌ పీఎంపాలెం స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పీఎం పాలెం పోలీసులు..

 

 

 

Post Midle

ఈ కేసును పెందుర్తి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.బాధితుడి ఫిర్యాదుతో ఈ పెందుర్తి కిడ్నీ రాకెట్‌ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ కోసం పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. డీసీపీ విద్యాసాగర్‌ నాయుడు పెందుర్తిలోని తిరుమల ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకున్నారు. తిరుమల ఆస్పత్రి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆశాస్త్రీయంగా కిడ్నీ తొలగించడంతో బాధితుడు వినయ్ కుమార్ మంచం పట్టినట్లు విచారణలో వెల్లడైంది. 8.5 లక్షలకు బ్రోకర్లు కామరాజు, శ్రీను డీల్ కుదుర్చుకున్నారు. పెందుర్తి తిరుమల ఆసుపత్రిలో అపరేషన్ చేయించారు. కిడ్నీ మార్పిడి యూనిట్ లేకుండా సర్జరీ చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అర్ధోపెడిక్ సర్జన్ పరమేశ్వరరావు కు కిడ్నీ ఆపరేషన్ చేసే అర్హత కోణంలో విచారణ చేపట్టారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పేదరికం అడ్డు పెట్టుకుని కేటుగాళ్లు అవయవ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పెందుర్తి తిరుమల ఆసుపత్రి కేంద్రంగా దందా జరుగుతోందని.. ఆసుపత్రి మూసివేసి తిరుమల ఆసుపత్రి యాజమాన్యం పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మధ్యవర్తులు శ్రీను, కామరాజు, ఎలినా,కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

Tags: Crosswise… selling kidneys

Post Midle