క్రషర్లు, క్వారీల సంగతి తేల్చాలి

Crushers, quarries
-జాతీయ హరిత ట్రైబ్యునల్‌
Date:25/12/2018
అనంతపురం ముచ్చట్లు:
జిల్లా సరిహద్దులో ఏళ్ల తరబడి ఇష్టానుసారంగా సాగిన రహదారి కంకర తవ్వకాలు, క్రషర్ల భవితవ్యం తేలే సమయం వచ్చింది. ఇక్కడి క్రషర్ల తీరుపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక… క్రషర్లు, క్వారీల సంగతి తేల్చాలంటూ ఆదేశించిన నేపథ్యంలో.. ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. కంకర తవ్వకాలు, క్రషర్ల నిర్వహణతో ఎంత నష్టం కలుగుతోందనేది సమగ్రంగా పరిశీలించడం మొదలుపెట్టారు. వెరసి లెక్క తేలుస్తారా లేదంటే తేల్చేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
జిల్లా కేంద్రానికి సుదూరంగా కర్ణాటక సరిహద్దులోని బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లు గ్రామ పరిధిలోని ఒకే సర్వే నంబరులో దాదాపు 200 ఎకరాల్లో 24 రహదారి కంకర లీజులు ఉన్నాయి. వీటిలో 5 లీజులు రద్దుకాగా, ఇంకా 19 లీజులు కొనసాగుతున్నాయి. మరోవైపు వీటికి సంబంధించి దాదాపు 18 వరకు క్వారీలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి.
చాలా కాలంగా కొనసాగుతున్న ఈ క్రషర్లు, క్వారీలతో సమీపంలోని మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటి నుంచి వెలువడుతున్న దుమ్ము కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నామనీ.. పొలాలు సైతం పాడవుతున్నాయనీ.. క్వారీల్లో పేలుళ్లతో ఇళ్లు సైతం దెబ్బతింటున్నాయని గగ్గోలు పెడుతూ వచ్చారు. దీనిపై జిల్లాలో ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇదే తరుణంలో కొందరు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించి క్వారీలు, క్రషర్లు పరిశీలించారు. క్వారీలకు పర్మిట్లు నిలిపేయగా, క్రషర్లకు విద్యుత్తు సరఫరా సైతం ఆపేశారు. అయితే కొత్తగా వేరొక లీజుల పేరిట దరఖాస్తులు చేసుకొని, వాటికి తాత్కాలిక పర్మిట్లు తీసుకున్నారు. గనుల శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా పర్మిట్లు ఇచ్చేశారు.
వీటిని చూసి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా మళ్లీ క్రషర్లు తెరుచుకోవడానికి పచ్చజెండా ఊపారు. మరోవైపు తాత్కాలిక పర్మిట్లను తీసుకున్న లీజుదారులు.. నేమకల్లులో నిలిచిపోయిన కంకర క్వారీల యజమానులకు వాటిని విక్రయించుకున్నారు. ఈ దందా పెద్దదై మళ్లీ క్రమంగా క్వారీలు, క్రషర్లు తెరుచుకున్నాయి. దీనిపై కొందరు ఫొటోలతో సహా మళ్లీ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన న్యాయమూర్తి కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, నేమకల్లులో క్వారీలు, క్రషర్లపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
అసలు నేమకల్లులో క్వారీలు నిర్వహించవచ్చా? వీటితో ఎంత నష్టం కలుగుతోంది? అలాగే క్వారీల నుంచి ఎంత దుమ్ము వస్తోంది.. తదితర సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశించడంతో.. తాజాగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. మూడు రోజులపాటు నేమకల్లులోని క్వారీలు, క్రషర్లలో తనిఖీలు ఆరంభించారు. అన్ని క్రషర్ల పరిధిలోని దుమ్ము ఎంత ఉంది? క్రషర్లు ఆడించిన తర్వాత దుమ్ము ఎంత పెరుగుతోందనేది పరీక్షిస్తారు? క్రషర్ల వద్ద వచ్చే దుమ్ము గాలిలో ఎంత శాతం కలుస్తోంది. ఎంత దూరం ప్రభావం చూపిస్తుందనేది క్రషర్ల వారీగా నివేదిక తయారు చేయనున్నారు.
ఇక క్వారీలన్నీ నిబంధనలు పాటిస్తున్నాయా? లేదా? అనేది కూడా తనిఖీ చేస్తారు. దాదాపు మూడు రోజులపాటు ఈ తనిఖీలు సాగనున్నాయి. అలాగే ఈ ప్రాంతంలో క్వారీలు నిర్వహించవచ్చా? లేదా? అనేది కూడా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ ధన్‌బాద్‌లో ఉండే ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌ను ఎన్జీటీ ఆదేశించింది. దీంతో త్వరలో ఈ బృందం అధ్యయనం చేయనుంది. వీటన్నింటితో నేమకల్లులో కంకర క్వారీలు, క్రషర్ల భవితవ్యం తేలిపోనుంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ల అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా తొలుత క్రషర్ల సంగతి తేలిపోనుంది.
Tags:Crushers, quarries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *