అకేషియా చెట్ల స్థానంలో సంప్ర‌దాయ మొక్క‌ల పెంప‌కాన్ని వేగ‌వంతం చేయాలి-టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల ముచ్చట్లు:

               
తిరుమల శేషాచల అడవుల్లో వృక్షసంపదను, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు అకేషియా(తుమ్మ) చెట్ల‌ను తొలగించి భూసారాన్ని పెంచాల‌ని, ఈ చెట్ల స్థానంలో సంప్రదాయ మొక్కల పెంప‌కం పనుల‌ను వేగ‌వంతం చేయాల‌ని టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో బుధ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ఇప్ప‌టివ‌ర‌కు మోడ‌ల్ ప్రాజెక్టుగా ఒక హెక్టార్‌లో అకేషియా చెట్ల‌ను తొల‌గించి సంప్ర‌దాయ మొక్క‌ల పెంప‌కం చేప‌ట్టార‌ని, క్ర‌మంగా విస్త‌రించాల‌ని సూచించారు. ఈ ప‌నుల‌పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని కోరారు. భ‌క్తుల‌కు ఆహ్లాద‌క‌రంగా ఉండేలా తిరుమ‌ల‌లో రోడ్ల సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌న్నారు. తిరుమ‌ల‌లో నిర్మాణంలో ఉన్న త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నం ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. టిటిడిలోని ప‌లు విభాగాల్లో ఉన్న పాత రికార్డుల‌ను ప‌రిశీలించి ముఖ్య‌మైన వాటిని డిజిటైజ్ చేయాల‌ని, మిగిలిన వాటిని తొల‌గించాల‌ని సూచించారు. తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ స్వామివారి ఆల‌య గోపురం బంగారు తాప‌డం ప‌నుల‌ను అక్టోబ‌రులోపు పూర్తి చేయాల‌న్నారు. తిరుప‌తిలోని గోశాలను ఆద‌ర్శ‌వంతంగా తీర్చిదిద్దేందుకు నిపుణుల సూచ‌న‌ల మేర‌కు స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూపొందించాల‌ని కోరారు. అనంత‌రం స్థానికాల‌యాల్లో జ‌రుగుతున్న గోపూజ‌పై ఈవో స‌మీక్షించారు.

 

Tags: Cultivation of traditional plants should be accelerated in place of acacia trees – TTD EO AV Dharmareddy

Leave A Reply

Your email address will not be published.