హనుమంత వాహనసేవలో సాంస్కృతిక వైభవం
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం హనుమంత వాహనసేవలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుతంగా ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 12 కళాబృందాల్లో 305 మంది కళాకారులు పాల్గొని సంగీత, నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు.మహారాష్ట్ర థానే ప్రాంతానికి చెందిన సెల్వరాజ్ బృందం ప్రదర్శించిన గోందల్ అనే నాట్య విన్యాసం భక్తులను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. 20 సంవత్సరాల లోపు యువతీ యువకులు మెరుపు వేగంతో అనేక గతులలో నృత్యాన్ని ప్రదర్శించి ఔరా అనిపించారు. శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన శ్రీరామ పట్టాభిషేకం కనువిందు చేసింది. తణుకుకు చెందిన ఎన్.రాధిక ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన, తూర్పుగోదావరి జిల్లా నీడుదవోలుకు చెందిన ఎన్ .సరస్వతి బృందం డ్రమ్ముల నృత్యం, కర్ణాటకకు చెందిన జ్యోతి ఎన్ .హెగ్డే దాస సంకీర్తన నృత్యం అలరించాయి.అదేవిధంగా, విశాఖపట్నంకు చెందిన డి.వి.ఎల్. శిరీష బృందం కోలాటం, రాజమండ్రికి చెందిన డి.గాయత్రి బృందం ప్రదర్శించిన గోపికా కృష్ణుల నృత్య ప్రదర్శన, విశాఖపట్నంకు చెందిన
బి సాయి రోజా కుమారి ప్రదర్శించిన కోలాటం, పాండిచ్చేరికి చెందిన ఎస్.మాలతి సెల్వం ఆధ్వర్యంలో ప్రదర్శించిన పొయికల్ కుదిరై, హర్యానా ప్రాంతానికి చెందిన పి.రాజి బృందం పన్హారీ నృత్యం, విజయవాడకు చెందిన వై.వనజ బృందం కోలాటం, తిరుమల బాలాజీ నగరుకు చెందిన కె.శ్రీనివాసులు బృందం కోలాటం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Tags; Cultural glory in Hanumantha Vahanaseva
