కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం 

Date:14/04/2018
రాజాం ముచ్చట్లు:
రాజాం పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలు అంతా ఇంతా కాదు! ఏకంగా కాంట్రాక్టర్లే బరితెగింపునకు దిగిపోయారు. నాయకులే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తడంతో వీరి అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. నిబంధనల ప్రకారం నాణ్యత పాటించడం లేదని స్థానికులు నిలదీసినా వీరు కనీసం ఖాతరు చేయలేదు. అధికారులు పూర్తిగా కొమ్ముకాయడంతో అంతా సక్రమంగానే పనులు చేసేశామన్నట్లు సినిమా చూపించారు. మూణ్నాళ్లకే చేసిన పనుల్లో నాణ్యత ఎంతో తేటతెల్లమైంది. అయ్యో..దశాబ్దాలు మన్నాల్సిన రహదారులు ఇలా అయి పోయాయేంటంటూ స్థానికులు నెత్తూనోరు కొట్టుకున్నా పట్టించుకోలేదు. ఎక్కడెక్కడ ఎలా తప్పులు జరుగుతున్నాయి..నిబంధనలకు ఎలా నీళ్లు వదిలేస్తున్నారో ఎత్తి చూపింది. సిమెంట్‌ రహదారులు వేసిన నెలల వ్యవధిలోనే ఏకంగా గోతులు ఏర్పడ్డాయంటే నాణ్యతను ఎంతగా గాలికొదిలేశారో అర్థమవుతోంది. కాంట్రాక్టర్లకు అధికారులు ఎంతగా కొమ్ముగాస్తూ వచ్చారో పనులు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి.మున్సిపాల్టీల్లో చేపట్టే పనుల్లో భారీఎత్తున నాణ్యత లోపించినా నాణ్యత విభాగం కళ్లు మూసుకుంటోంది. ఒక ప్రైవేటు ఏజెన్సీకి తనిఖీ బాధ్యతలు అప్పగించారు. పనులు చూడకుండానే క్లియరెన్స్ ఇస్తున్నట్లు గతం నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని ఇప్పుడు రాజాం పట్టణంలో చేపట్టిన పలు పనులు వీటికి తార్కాణంగా నిలిచినట్లయింది. ఇప్పుడు ఈ సంస్థపైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలి. ప్రజాధనం లూటీ చేయడంలో భాగస్వామ్యమైనట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో సదరు సంస్థపైనా చర్యలు ఉండాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. నాణ్యత లోపించినా నాణ్యతగా ఉన్నట్లు ఎలా ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారని వీరంతా నిలదీస్తున్నారు.రాజాం పట్టణంలో భారీ ఎత్తున రహదారులు, కాలువల నిర్మాణం జరిగింది. దాదాపుగా రహదారులన్నింటిలో నాణ్యతను గాలికొదిలేశారన్న ఆరోపణలు వచ్చాయి. కొన్ని రహదారుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. పోలీస్‌స్టేషన్‌ రహదారి మొత్తం గోతులు ఏర్పడ్డాయి. వర్షం పడితే చెరువులను తలపిస్తోంది. భారీగా నీళ్లు చేరుతున్నాయి. నెలల వ్యవధిలోనే ఇలా జరగడంతో అంతా నిర్ఘాంత పోతున్నారు. ఇప్పుడు ఈ రహదారిని మళ్లీ నవీకరించాలని నిర్ణయించారు.  మీడియా కథనాల వెలువడిన తరువాత కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు నిలిపేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు అదే కాంట్రాక్టర్ రోడ్డును అభివృద్ధి చేస్తే.. బకాయి బిల్లులు చెల్లిస్తామని అధికారులు తేల్చాశారు. లేదంటే బ్లాక్‌లిస్ట్‌లోనూ పెడతామని హెచ్చరించారు. దీంతో కాంట్రాక్టర్ దిగిరాక తప్పలేదు. రహదారి పనులు చేసేందుకు ముందుకొచ్చారు. డోలపేటలోని ప్రధాన రహదారి, సారథి రహదారులూ ఇందుకు భిన్నంగా ఏమీలేదు. సారథి గ్రామంలో చేపట్టిన రహదారి అప్పుడే దమ్ము రేగుతోంది. ఒక నాయకుడే పనులు చేపట్టడంతో స్థానికులు మింగలేక కక్కలేక నలిగిపోతున్నారు. కళ్లెదుటే రహదారికి తూట్లు పడ్డాయని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. డోలపేట రహదారిలో నాణ్యత లోపించిందని ముందే చెప్పినా అధికారులు స్పందించలేదు. అదే కాంట్రాక్టర్ కు ఈ రోడ్డుకు అనుబంధంగా చేపట్టే పనులనూ కట్టబెట్టడంతో స్థానికులు రంగంలోకి దిగి దగ్గరుండి పనులు చేయించుకోవాల్సి వచ్చింది.
రాజాం నగరపంచాయతీకి మున్ముందు ఎన్నికలున్నాయి. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తోంది. ఈ నిధులతో పనులు పక్కాగా నిర్వహించి నాణ్యతగా చేపడితే దశాబ్దాల సమస్యలు పరిష్కారమయ్యాయని జనమూ హర్షిస్తారు. ఆ హర్షాన్ని ఓట్ల రూపంలో కురిపిస్తారని ఆశించారు. అయితే అవే పనులు చూసి జనం ఛీత్కరించుకుంటున్న నేపథ్యంలో జనంలో చులకన అవుతున్నామన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి తోడు నాయకులే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి ఇలాంటి పనులకు పాల్పడుతుండడంతో మింగిలేక దగ్గలేక పరిస్థితి తెదేపాలో నెలకొంది. ఈ పనులనే ఇప్పుడు ప్రతిపక్షం ఆయుధంగా మలుచుకుంటోంది. వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఇప్పటికే పనుల్లో అవినీతిపై ఎండగట్టారు. మున్ముందు వీటిపై నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు తెదేపా టీడీ నాయకులు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడతారో చూడాలి.
Tags: Customers’ Customization

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *