Natyam ad

ఆందోళనలో పాడి రైతులు

రాజమండ్రి  ముచ్చట్లు:


పశు వైద్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పశువైద్యశాలలను రేషనలైజేషన్‌ చేయడానికి పశుసంవర్థక శాఖ అడుగులు వేస్తోంది. ఈ మేరకు మూడు రకాల ప్రతిపాదనలతో నివేదిక రూపొందించారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పాడి రైతులతో పాటు గ్రామీణ పశువైద్య కేంద్రాల్లో పని చేస్తోన్న సిబ్బందిని ఆందోళనకు గురి చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 58 గ్రామీణ పశువైద్యశాలలు, 31 ఏరియా పశు ఆస్పత్రులు, 157 వెటర్నరీ డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటితో పాటు 210 మంది గోపాలమిత్రల ద్వారా పశుసంవర్థక శాఖ గ్రామాల్లో పశువైద్య సేవలను అందిస్తోంది. రేషనలైజేషన్‌ పేరుతో గ్రామీణ సిబ్బందిని మండలాలు, తాలుకా ఆస్పత్రులకు సర్దుబాటు చేసి, లైవ్‌ స్టాక్‌ డిస్పెన్సరీలను ఎత్తివేసే ప్రక్రియ మొదలైందని సిబ్బంది అంటున్నారు. ఎక్కువ డిస్పెన్సరీలు ఉన్న ప్రాంతం నుంచి డిస్పెన్సరీలు లేని మండలాలకు కొన్నింటిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ప్రభుత్వం ఈ ఏడాది మే 27న పశువైద్యశాలల విలీనంపై జిఒ 131 విడుదల చేసింది. మూడు విధాలుగా ప్రణాళికలు రూపొందించాలని కోరింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో మూడు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం.

 

 

ప్లాన్‌-ఎ ప్రకారం ప్రతి మండలానికి రెండు వెటర్నరీ డిస్పెన్సరీలు ఏర్పాటు చేసి, గ్రామాల్లోని పశువైద్య కేంద్రాలను వాటిలో విలీనం చేయాలి. ప్లాన్‌-బి కింద మండలానికి ఒకటి లేదా రెండు వెటర్నరీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని, ఆ మండలంలో రెండు, మూడు పశువైద్య కేంద్రాలను ఉంచాలని సూచించినట్లు సమాచారం. ప్లాన్‌-సిలో ప్రతి మండలంలో మూడు వెటర్నరీ పశువైద్యశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.గ్రామీణ ప్రాంతాల్లో సాగుతోపాటు అధిక శాతం మంది రైతులు పశుపోషణపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. జిల్లాలో ఏడాదికి 9,378 టన్నుల పాల దిగుబడి వస్తోంది. పశువైద్యం సకాలంలో అందించడంలో ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి. పశువైద్యశాలల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. దీనికి తోడు ఇతర సమస్యలు కూడా వెన్నాడుతున్నాయి. వీటిని పరిష్కరించకుండా కుదింపు చర్యలకు పాల్పడడంపై సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్‌బికెల్లో పశుసంవర్థక శాఖ అసిస్టెంట్లను ప్రత్యామ్నాయంగా చూపించి పశువైద్యశాలల సంఖ్య కుదింపునకు సిద్ధపడటంపై విమర్శలు విన్పిస్తున్నాయి.

 

Post Midle

Tags: Dairy farmers in concern

Post Midle