ప్రజాధనం పైపుల పాలు (వరంగల్)
Date:13/10/2018
వరంగల్ ముచ్చట్లు:
నిర్లక్ష్యం కారణంగా రూ. కోట్ల ప్రజాధనం మట్టిపాలయింది. వేసిన పైపులైన్‌ను తవ్వేసి అదే స్థానంలో కొత్తదేస్తున్నారు. పాత దాన్ని సద్వినియోగం చేసుకోకుండా, ఏవో సాకులు చూపి మళ్లీ భారీ వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్నారు. దీనివల్ల సమయం, డబ్బు వృథా అవుతోంది. ధర్మసాగర్ చెరువు వద్ద ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నీటి ట్యాంకు నుంచి జిల్లాలోని అనేక ఆవాసాలకు నీరందిస్తున్నారు. ఇక్కడి నుంచి జనగామ జిల్లా జఫర్‌గఢ్ వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర ఉన్న పాత పైప్‌లైన్‌ను తీసేసి కొత్తది వేశారు.
మూడేళ్ల క్రితం నిర్మించిన దీనికి రూ. 125 కోట్లు వెచ్చించారు. 10 మండలాల్లోని 3034 ఆవాసాలకు నీళ్లిచ్చే లక్ష్యంతో ఈ పనులు చేపట్టారు. ఇవి 2009లో మొదలయ్యాయి. 2011లో పూర్తి కావాల్సి ఉన్నా పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో 2015 వరకు కొనసాగాయి. జలాశయం వద్ద నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించి కొన్ని నెలలపాటు మాత్రమే తాగునీటిని సరఫరా చేశారు.
ఫైబర్‌తో రూపొందిన ఈ పైపులు 36 ఏళ్లు పని చేస్తాయి. నాణ్యత నెపంతో మూడు సంవత్సరాలకే తొలగించడం గమనార్హం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ నీరందించే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. అనేక చోట్ల ఇప్పటికే పాత పైపులైన్లు ఉంటే వాటిని ‘భగీరథ’కు అనుసంధానం చేస్తున్నారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే మరమ్మతులు చేసి సద్వినియోగం చేసుకుంటున్నారు.
ధర్మసాగర్లో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. అనాలోచితంగా పాత దాన్ని పీకేయడం ఏంటని స్థానికులు సైతం ప్రశ్నిస్తున్నారు. కొత్త పైప్‌లైన్‌కు ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించారు. జఫర్‌గఢ్ మండలంలోని తిమ్మంపేట, రేగడితండా, జఫర్‌గఢ్‌లో లీకేజీలు ఏర్పడ్డాయి. ఆ పరిసరాలు చెరువులను తలపించాయి. నిబంధనల ప్రకారం పైపులైన్లను కనీసం మూడడుగుల లోతులో వేయాలి. ప్రస్తుతం కేవలం అడుగు వరకు వేస్తుండడం, కొన్ని చోట్ల అసలు గుంతలు తవ్వకుండానే నేలపైనే పరిచేస్తూ వెళ్లడం గమనార్హం.
Tags:Dairy Powder (Warangal)