కడపలో చక్రం తిప్పుతున్న డీఎల్

DAL rotating wheel in Kadapa

DAL rotating wheel in Kadapa

Date:16/11/2018
కడప ముచ్చట్లు:
రాజకీయాలు హీటెక్కాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఆరునెలలు సమయం ఉండగానే చంద్రబాబు ఎన్నికల వేడిని రగిల్చారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల సెగ కూడా ఏపీని తాకింది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తల మైండ్ ను సెట్ చేసేస్తున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో గట్టెక్కి మరోసారి అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు వ్యూహం. అయితే కాంగ్రెస్, టీడీపీ మధ్య కుదిరిన సఖ్యతను సహించని అనేక మంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, బాలరాజు, సి.రామచంద్రయ్యలు టీడీపీతో పొత్తు ఇష్టం లేక పార్టీని వదిలేసి వెళ్లిపోయారు.  అయితే మరో మాజీ మంత్రి, సీనియర్ నేత మాత్రం దీనిపై ఇంతవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఆయనే డి.ఎల్. రవీంద్రారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన గతకొంతకాలంగా రాజీకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
అయితే చాన్నాళ్ల నుంచి డి.ఎల్.రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతూనే ఉంది. మైదుకూరు నియోజకవర్గం నుంచి డి.ఎల్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అంతేకాదు తన పుట్టిన రోజు త్వరలోనే రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని కూడా డిఎల్ చెప్పారు. కానీ నెలలు గడుస్తున్నా డి.ఎల్. ఎటువంటి నిర్ణయమూ ఇంతవరకూ తీసుకోలేదు.డీఎల్ తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుని మనసు మార్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ డీఎల్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో చంద్రబాబు డీఎల్ ను ఎలాగైనా తీసుకోవాలని భావించి పుట్టాకు తిరుమల, తిరుపతిదేవస్థానం ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు.
అయినా పుట్టా మాత్ర వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ అభ్యర్థిగా మైదుకూరు నుంచి బరిలో ఉంటానని తరచూ ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ లోనే కొనసాగడమా? లేక టీడీపీలో చేరడమా? అన్న సంశయంలో డీఎల్ ఉన్నారు. కాంగ్రెస్ లోనూ కొనసాగుతూ పొత్తులో భాగంగా చంద్రబాబు సహకారంతో మైదుకూరు సీటును తాను తీసుకోవచ్చన్న ఆలోచన డీఎల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా టీడీపీలో చేరి ఆ పార్టీ శ్రేణులకు వ్యతిరేకమయ్యే కన్నా కాంగ్రెస్ లో ఉండి పొత్తులో భాగంగా సీటు తెచ్చుకుంటే తనకోసంటీడీపీ శ్రేణులు పనిచేస్తాయని డిఎల్ భావిస్తున్నారు. అయితే ఈ ఒప్పందం గురించి చంద్రబాబుతో చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తానని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద డీఎల్ పసుపు కండువా కప్పుకోకుండానే సీటు ఈజీగా తెచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
Tags:DAL rotating wheel in Kadapa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *