Lotus on Puducherry ..

గులాబీకి డేంజర్ బెల్స్

Date:05/12/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

రాజకీయాల్లో ఎదగడానికి చాలా సమయం పడుతుంది. అదే కూలిపోవడానికి పెద్దగా సమయం అవసరం లేదు. టీఆర్ఎస్ విషయంలో అదే జరుగుతుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా? అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాల్సి ఉంటుంది. ఆరేళ్ల పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కేవలం మాటలకే పరిమతమయిపోయిందన్న విమర్శలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలోనే విజయం సాధించలేదు. అయితే కో-ఆప్షన్ సభ్యుల సహకారంతో  మేయర్ పీఠాన్ని  కైవసం చేసుకోనున్నారు. కానీ టీఆర్ఎస్ చచ్చీ చెడీ గెలిచినట్లేనన్నది ఆ పార్టీ నుంచే విన్పిస్తున్న టాక్. గతంలో వచ్చిన సీట్లలో చాలా వరకూ ఓటమి పాలయ్యారు. ఈసారి టీఆర్ఎస్ బీజేపీ దెబ్బకు కొంత వెనక్కు పోయిందనే చెప్పాలి. హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పట్టు నిలుపుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించినప్పటికీ వన్ సైడ్ వార్ కాదన్నది తేలిపోయింది.ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు టీఆర్ఎస్ కు తొలి నుంచి ఛాలెంజ్ గానే ఉన్నాయి.

 

 

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ ప్రభావం ఎంతో కొంత ఈ ఎన్నికలపై కూడా పడుతుందని టీఆర్ఎస్ భావించింది. అనుకున్నట్లుగానే తమకు పట్టున్న కొన్ని ప్రాంతాల్లో బీజేపీ పాగా వేసింది. ప్రధానంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు బీజేపీకి అనుకూలంగా మారుతుండటం టీఆర్ఎస్ ను ఆందోళనలో పడేసే విషయం. ఈ ఎన్నికల్లో కొన్ని సామాజికవర్గాలు టీఆర్ఎస్ కు దూరమయ్యాయంటున్నారు.దీంతో పాటు ప్రతిపక్షాలను నిర్వీర్యంచేసేందుకే ఎక్కువ సమయం కేసీఆర్ కేటాయించారు.రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను బలహీనపర్చేందుకే కేసీఆర్ ఈ ఆరేళ్లలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని తాత్కాలికంగా సక్సెస్ అయినా బీజేపీ నుంచి ముప్పు ఉంటుందని కేసీఆర్ ఊహించలేకపోయారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను బలహీనపరిస్తే చాలునని, తనకు ఇక తిరుగుండదని కేసీఆర్ భావించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే వేస్టేనన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా నాటింది కేసీఆర్ మాత్రమేనని చెప్పక తప్పదు.పార్లమెంటు ఎన్నికల ముందు వరకూ కేసీఆర్ బీజేపీని లైట్ గానే తీసుకున్నారు.

 

 

తన కూతురితో సహా నాలుగు సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడంతో అప్పటికి కేసీఆర్ కళ్లు తెరిచారు. అప్పటి వరకూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ వచ్చిన కేసీఆర్ అప్పటి నుంచి కొంత వెనక్కు తగ్గారు. వివిధ అంశాలను ఇప్పుడు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మరోవైపు ఎంఐఎంను చేరదీయడం కూడా బీజేపీ బలపడటానికి కారణమయిందని చెప్పక తప్పదు.గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను చూసైనా కేసీఆర్ తన తీరును మార్చుకోవాల్సి ఉంది. ఎన్నికలప్పుడే ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ నినదిస్తే నమ్మే రోజులు పోయాయి. ముఖ్యంగా ఐటీ రంగ సంస్థలనున్న గచ్చి బౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో బీజేపీ పట్టు సాధించింది. మంత్రి కేటీఆర్ కు ఇది కొంత ఇబ్బంది కల్గించే అంశమే. అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా వరదల ప్రభావం బాగా పనిచేసిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వరదల సమయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఆ తర్వాత ప్రకటించిన వరద సాయం అందరికీ అందకపోవడం వంటివి ప్రభావం చూపాయంటున్నారు.

 

 

 

ఇక పోస్టల్ బ్యాలట్ తీసుకుంటే బీజేపీకే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకమయ్యారనడానికి ఇది సంకేతమే.మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఆయనకు వ్యక్తిగతంగా కొంత ఇమేజ్ తెచ్చిపెడుతుంది. కానీ భవిష్యత్ లో బీజేపీ నుంచి ఇటు నగరంలో కూడా ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని టీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు సూచించాయి. బీజేపీ ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ కు అన్ని విషయాల్లో పోటీ ఇచ్చిందనే చెప్పాలి. ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకూ ఢీ అంటే ఢీ అని తలపడిందనే చెప్పాలి. మొత్తం మీద గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది.నిరంతరం బీజేపీపై పోరాడితేనే కొంత వరకూ తెలంగాణలో నిలదొక్కుకునే వీలుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పట్టు పెంచుకున్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి మరింత విస్తరించే అవకాశముంది. విస్తరణ సంగతి పక్కన పెడితే గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సో.. కేసీఆర్ ఇప్పటి నుంచే మేల్కొని ప్రగతి భవన్ ను వీడితే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

పుంగనూరు ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Tags: Danger Bells to Pink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *