ఆదిలాబాద్‌లోనూ డేంజర్ ఘాట్ రోడ్స్

Date:14/09/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన బస్ ప్రమాదం తెలంగాణను ఆవేదనభరితం చేసింది. ప్రమాదంలో 59మంది ప్రాణాలు కోల్పోవడం.. రాష్ట్రాన్నే కాక దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘాట్ రోడ్‌లో ప్రమాదం సంభవించడంతో రాష్ట్రంలోనివివిధ ప్రాంతాల్లోని అలాంటి రహదారులపై అందరి దృష్టీ పడింది.
తెలంగాణలోని ఘాట్ రోడ్‌ల పరిస్థితి, పటిష్టతపై పలువురు ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ వాసులు తమ ప్రాంతంలోనూ ఘాట్ రోడ్‌లు ఉన్నాయని.. రోడ్లను నిర్వహించే
కాంట్రాక్టర్లు.. సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి సమస్యలుంటే సరిచేయాలని కోరుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా రోడ్ల నిర్వహణ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
జిల్లాలోని జాతీయ రహదారితో పాటు పలు గ్రామప్రాంతాల సమీపంలో ఘాట్‌రోడ్లు ఉన్నాయి. దాదాపు అన్ని మండలాల్లో ఇటువంటి రహదారులు ఉన్నాయి. ఈ దారుల్లో ప్రయాణమంటే.. వాహనదారులు కొంత భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే రోజూ ఏదో ఒక మూలమలుపు, ఘాట్‌ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకొని పలువురు గాయాలపాలవూతూనే ఉన్నారు.
ఈ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవటం లేదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. కుప్టి గ్రామం వద్ద కొండ నుంచి కడెం వంతెన వరకు నిర్మించిన ఏటవాలు రహదారి ఉంది. ఇక్కడ వాహనాలు వేగంగా వెళ్తుండడమే కాకుండా ప్రయాణికుల భద్రతకు సరైన చర్యలు లేవని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ రహదారిపై వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉందని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఈ విషయంలో దృష్టి సారించి భారీ ప్రాణ నష్టం జరగక ముందే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రమాదకర రీతిలో మలుపులు ఉన్న ఘాట్ రోడ్లు ఉన్నాయి. ఇక్కడ వాహనాలు అదుపు తప్పేందుకు అవకాశాలు కోకొల్లలు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం ఖాయం.
ఇప్పటికే పలు బైక్స్, జీపులు బోల్తాపడిన సందర్భాలున్నాయి. బస్సులు సైతం ప్రమాదాలకు గురయ్యాయి. అయితే డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించి బస్సులను చెట్ల మధ్యకు పోనివ్వడంతో ప్రాణనష్టాలు తప్పాయి. నేరడిగొండ మండలం వడూర్‌ గ్రామ రహదారిలో ఘాట్‌ప్రాంతంలో 70 డిగ్రీల మూల మలుపు ఉంది.
ఇక్కడ ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగాయి. కుంటాల జలపాతం వెళ్లే దారిలో కుంటాల(కే) గ్రామ సమీపంలో ఉన్న కొండ ప్రాంతంలోని మూల మలుపు ప్రమాదకరంగా ఉందని స్థానికులు అంటున్నారు. ఇక..ఇచ్చోడ మండలం సిరిచెల్మ వెళ్లే దారిలో ఉన్న మూల మలుపు ప్రాంతం కూడా ప్రమాదభరితంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తంతోలి రోడ్డు మార్గంలో ఆరేడు మూల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి.
ఎదురుగా వచ్చే వాహనం అసలు కనపడని పరిస్థితి ఉంటోందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జైనథ్‌ మండలం కంట గ్రామానికి వెళ్లేప్పుడు, ఆడ గ్రామం వద్ద మూల మలుపులు ప్రమాదకరంగా మారాయని అక్కడివారు చెప్తున్నారు. బోరజ్‌ వద్ద జాతీయ రహదారిపై బస్సులు మూల మలుపు
తిరుగుతున్న చిత్రమిది.
ఇక్కడ జాతీయ రహదారి వద్ద రక్షణ గోడలు లేకపోవటం, ఇది జాతీయ రహదారి అయినందున అత్యంత వేగంగా భారీ వాహనాల రద్దీ ఉండటం ప్రమాదకరంగా మారింది. ఈ ప్రాంతంలో బస్సులు మూల మలుపు తిరగటానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జాతీయ రహదారుల అధీకృత సంస్థ చేయకపోటంలో ఆర్టీసీ బస్సులు ప్రమాదకరంగా మూల మలుపులు తిరుగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి సమస్యలపై అధికార యంత్రాంగం సత్వరమే దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. కొండగట్టు లాంటి ప్రమాదం మరోసారి జరగకుండా రోడ్ల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags: Danger Ghat Roads in Adilabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *