డేంజర్ రోడ్స్

Danger Roads

Danger Roads

Date:20/07/2018
ఖమ్మం ముచ్చట్లు:
దాదాపు పదిరోజుల పాటూ కురిసిన వర్షాలతో ఖమ్మంలో పలు రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రధానంగా రఘనాథపాలెం బైపాస్ రహదారి ప్రమాదకరంగా మారిన పరిస్థితి. రోడ్డు కంకర తేలడంతో వాహనదారులు నానాపాట్లు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రయాణం నరకప్రాయంగా ఉందని అంటున్నవారూ ఉన్నారు. రహదారులపై గోతులు పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారడంతో పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వరద నీరు ప్రవహించేందుకు డ్రైనేజి సౌకర్యం లేకపోవడం వల్లే ఈ దుస్థితి అని అంటున్నారు. వరద నీరు కాక వర్షపు నీరూ బైపాస్‌ రోడ్డుపైనే  నిలుస్తుండడంతో రహదారులు దెబ్బతింటున్నాయని స్థానికులు అంటున్నారు. వానల ఎఫెక్ట్ కు ఇల్లెందు రోడ్డుపై జయనగర్‌ కాలనీ నుంచి ఎస్‌ఎన్‌ మూర్తి కళాశాల వరకు సుమారు 4 కి.మీ దూరం ప్రయాణం చేయాలంటే వాహనదారులు నానా అగచాట్లు పడాల్సివస్తోంది. ఇరుకుగా ఉండే ఈ రోడ్డు గోతులు పడడంతో వెహికిల్స్ పై వెళ్లేవారు నరకయాతన అనుభవిస్తున్నారనే చెప్పొచ్చు. రోడ్డు కిందికి దిగేందుకు వీలు లేకుండా పక్కన వర్షపు నీరు నిలిచి బురదమయం కావటంతో వాహన చోదకులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు రఘునాథపాలెం బైపాస్‌ రోడ్డు మూలమలుపులో గోతులు పడ్డాయి. ఇక్కడా ప్రయాణం నరకప్రాయంగానే ఉంటోంది. గుంతల్లో నీరు నిలవడం.. నీటిలో గుంతలు కనపడకపోవడంతో పలువురు వాహనదారులు గాయపడిన ఘటనలు సైతం ఉన్నాయి. బైపాస్‌ రోడ్డులో ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద రోడ్డుపై గోతులు పడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. జయనగర్‌ కాలనీ నుంచి ఎస్‌ఎన్‌ మూర్తి కళాశాల వరకు 4 కి.మీ. రోడ్డుపై వర్షాలకు గోతులు పడ్డాయి. ఈ రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. రఘునాథపాలెం సెంటర్‌, బైపాస్‌ రోడ్డు మలుపు వద్ద ఆ సమీప ప్రాంతాల్లో రహదారి దెబ్బతింది. ఇక్కడ తాత్కాలిక మరమ్మతులు చేసినా కొద్ది రోజులకే పరిస్థితి మొదటికొచ్చినట్లైంది. ఖమ్మం ఇల్లెందు క్రాస్‌ రోడ్‌ నుంచి జయనగర్‌ కాలనీ వరకు ఆరు వరుసలుగా రోడ్డు విస్తరించి సెంట్రల్‌ డివైడర్‌ నిర్మించారు. అక్కడి నుంచి మరో 4 కి.మీ. రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రోడ్డు వెడల్పుకు నిధులు మంజూరు కావటంలేదు. నిధులు ఉంటే రహదారుల అగచాట్లు తప్పేవని స్థానికులు అంటున్నారు. ఇక ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ప్రతి వర్షాకాలం రోడ్డు దెబ్బతింటోంది. భారీ లోడుతో ప్రయాణించే వాహనాలు ఇక్కడ చాలా తక్కువ వేగంతో మలుపు తిరగాల్సి వస్తుంది. దీంతో రోడ్డుపై అధిక బరువు వాహనాల టైర్లు రోడ్డును కోత కోస్తున్నాయి. దీంతో రహదారిపై తారు పక్కకి జరిగిపోయి ముద్దలుగా మారిందని పలువురు అంటున్నారు. ఇది చాలదన్నట్లు వర్షం కురిసినపుడు గోతులు పడి కంకర రాళ్లు తేలుతున్నాయని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ సమస్యను గుర్తించి సంబంధిత అధికార యంత్రాంగం ఎన్టీఆర్‌ సర్కిల్‌లో గోతులు పడకుండా రహదారిని పటిష్టంగా నిర్మించాలని కోరుతున్నారు. నగరంలోని అన్ని రోడ్లనూ పటిష్టపరచాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
డేంజర్ రోడ్స్https://www.telugumuchatlu.com/danger-roads/
Tags: Danger Roads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *