శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు

తిరుమల ముచ్చట్లు:

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టిటిడి అటవీ విభాగం కార్యాలయం నుండి శుక్రవారం డిఎఫ్‌వో   ఎ.శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు.అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 27వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు.

ధ్వజారోహణానికి దర్భ చాప, తాడు కీలకం

బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు.ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టిటిడి అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేశారు. అటవీశాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో దర్భ చాప, 200 అడుగుల పొడవు తాడుసిద్ధం చేశారు.ఈ కార్యక్రమంలో విజివో  బాలిరెడ్డి, రేంజ్‌ అధికారి వెంకటసుబ్బయ్య, డెప్యూటీ రేంజ్‌ అధికారి  ఎస్‌.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Darbha mat and rope procession of Srivari Brahmotsavam

Leave A Reply

Your email address will not be published.