పల్లెల్లో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి

Daylight temperatures fall in the rural areas

Daylight temperatures fall in the rural areas

Date:31/12/2018
అదిలాబాద్ ముచ్చట్లు:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మారుమూల పల్లెల్లో పగటి ఉష్ణోగ్రతలు ఆమాంతం పడిపోయి చలి విజృంభిస్తుండడంతో సామాన్య జనజీవనం అల్లాడిపోతోంది. ఆదివారం భీంపూర్ మండలంలో 3.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా ఆదిలాబాద్‌లో 4.4 డిగ్రీల సెల్సియస్ రికార్డయింది. గత రెండు మూడు రోజులుగా అతి శీతల గాలులు జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు పాక్షికంగా పనిచేస్తున్నాయి. ఉత్తరాది నుండి వీస్తున్న చలి గాలుల ప్రభావంగానే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రికార్డుస్థాయిలోకనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, మరో పది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 5 గంటల నుంచే ఆదిలాబాద్ పట్టణంతో పాటు పరిసరాల్లో మంచు దుప్పటి కమ్మేయడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రాత్రి వేళల్లో విపరీతమైన మంచు కురుస్తుండడంతో పట్టణాలు, పల్లెలు మరో కశ్మీరాన్ని తలపిస్తున్నాయి. ప్రభుత్వ వసతి గృహాల్లో అరకొర సౌకర్యాలతో నిద్రిస్తున్న విద్యార్థుల పరిస్థితి కడుదయనీయంగా మారింది. సుమారు 70కిపైగా వసతి గృహాల్లో సోలార్ విద్యుత్ పనిచేయకపోవడంతో చిన్నారులు చన్నీటి స్నానాలు ఆచరిస్తూ అస్వస్థతకు గురవుతున్నారు. ఉట్నూరు, ఆసిఫాబాద్, బోథ్, ఇంద్రవెల్లి ప్రాంతాల్లో విద్యార్థులు, వృద్దులు, మహిళలు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. చర్మవ్యాధులు కూడా చలి పంజాకు వెంటాడుతుండడంతో ప్రజలు పాలుపోని పరిస్థితిని ఎదుర్కోవల్సి వస్తోంది.
శనివారం అత్యల్పంగా అర్లిటిలో 3.0డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా ఆదివారం సైతం భీంపూర్ మండలంలో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా ఆదిలాబాద్‌లో 4.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 5.3 డిగ్రీలు, నిర్మల్‌లో 5.6 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం.ఎప్పుడు లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పని వేళలను కుదించడం జరిగిందని ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య తెలిపారు. జనవరి 9వ తేదీ వరకు పాఠశాలల పనివేళల్లో మార్పులు కొనసాగుతాయని, విద్యాశాఖ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సమయపాలన పాటించాలని సూచించారు.
Tags:Daylight temperatures fall in the rural areas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed