బడ్జెట్ తో సమానంగా పెరిగిన అప్పులు

Date:15/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ప్రభుత్వం 2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌ రూ.లక్షా 49 వేల కోట్లు.. ఇప్పుడు మన రాష్ట్ర అప్పులు కూడా అక్షరాలా లక్షా 48 వేల కోట్లు. దీన్నిబట్టి రాష్ట్ర బడ్జెట్‌తో సమానంగా అప్పులు కూడా పైకి.. పైపైకి ఎగబాకు తున్నాయనే విషయం విదితమవుతున్నది. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయే నాటికి (జూన్‌ 2, 2104) ఏపీ, తెలంగాణ అప్పు కలిపి రూ.1,48,060.22 కోట్లుగా నమోదైంది. రాష్ట్ర విభజనానంతరం ఆస్తులు, అప్పుల పంపిణీలో పంపిణీలో భాగంగా తెలంగాణకు రూ.61,711.50 కోట్ల అప్పు వచ్చింది. ఆ తర్వాత వీటి కథ మరింత వేగం పుంజుకున్నది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు నాలుగేండ్ల కాలంలో, నాలుగు బడ్జెట్ల సమయంలో టీఆర్‌ఎస్‌ సర్కారు చేసిన అప్పు అక్షరాలా రూ.87,091 కోట్లు. వెరసి మన మొత్తం అప్పు రూ. లక్షా 48,802 కోట్లకు చేరింది. దీన్నిబట్టి అటుఇటుగా తెలంగాణ బడ్జెట్‌.. అప్పు సరి సమానంగా పరిగెడుతున్నాయనే విషయం విదితమవుతున్నది. వాస్తవానికి రాబడులు, ఆదాయాలు, కేంద్రం నుంచి సాధించాల్సిన నిధుల విషయంలో తన పాత్రను సమర్థవంతంగా పోషించని టీఆర్‌ఎస్‌ సర్కారు.. అప్పుల విషయంలో మాత్రం చాలా దూకుడును ప్రదర్శిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచే ఈ పద్ధతి కొనసాగుతూ వస్తున్నది. 2014-15లో రూ.9,410 కోట్లు, 2015-16లో రూ.18,856 కోట్లు, 2016-17లో రూ.35,741 కోట్లు, 2017-18 బడ్జెట్‌లో గత డిసెంబరు నాటికి రూ.23,084 కోట్ల అప్పులను ప్రభుత్వం తెచ్చింది. వీటిలో 2015-16, 2016-17 బడ్జెట్లలో సర్కారు తాను వేసుకున్న అంచనాలకు మించి అప్పులను తేవటం గమనార్హం. ఇప్పుడు ఈ అంశంపై ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు, సామాజిక వేత్తలు కలవరపడుతున్నారు. అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నాం, వాటిని తీర్చే సత్తా మా సర్కారుకు ఉందంటూ ప్రభుత్వాధినేతలు సమర్థించుకుంటున్నప్పటికీ.. ఇవి అంతిమంగా ప్రజలకు భారంగా పరిణమిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
నాలుగేండ్లలో టీఆర్‌ఎస్‌ సర్కారు చేసిన అప్పులు (రూ.కోట్లలో)
సంవత్సరం అంచనాలు వాస్తవాలు
2014-15 —- 17,398 9,410
2015-16 —-16,969 18,856
2016-17 —–23,467 35,741
2017-18 —–26,096 23,084 (డిసెంబర్ వరకు)
మొత్తం 83,930 87,091
Tags: Debts grown equally well with the budget

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *