ప్రకాశంలో ఉసురు తీస్తున్న అప్పులు

ఒంగోలు ముచ్చట్లు:
 
ప్రకాశం జిల్లా పామూరు మండలం ఎనిమెర్ల గ్రామానికి చెందిన రైతు ఒంటిపెంట లక్ష్మీనరసారెడ్డి (52), అతని భార్య వెంకటలక్ష్మమ్మ (48) రెండెకరాల సొంత పొలంతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి, పొగాకు సాగు చేశారు. వ్యవసాయం చేసుకుంటూనే పొగాకు బ్యారెన్‌ నడిపారు. గత పదేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో అసలుతో పాటు వడ్డీలు పెరిగి దాదాపు రూ.30 లక్షల వరకు అప్పు తేలింది. అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో లక్ష్మీనరసారెడ్డి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.యద్దనపూడి మండలం గన్నవరం గ్రామానికి చెందిన దళిత రైతు అద్దెపల్లి ఆనందరావు (32) పది ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట మొత్తం దెబ్బతింది. సాగు నిమిత్తం రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. రుణదాతల ఒత్తిడితో అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడుతర్లుపాడు మండలంలోనూ ఇటీవలే రెండు కుటుంబాలకు చెందిన రైతులు అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ ఒకే రోజు చనిపోయారు. పంట నష్టాలతో పాటు అప్పులే వీరిని బలిగొన్నాయి.ప్రకాశం జిల్లాలో ఇలా నెలరోజుల్లో తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పండించిన అరకొర పంటలకు గిట్టుబాటు ధరల్లేవు. వ్యవసాయంలో పెట్టిన ప్రతిపైసా తిరిగి రాకపోగా నష్టాలు చుట్టుముడుతున్నాయి. బతుకుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. కనీసం పంట నష్టపరిహారాలు కూడా ప్రభుత్వాలు అందించడంలేదు. పంట కోసం రైతులు చేస్తున్న అప్పులు.. చివరికి వారి ఉసురు తీస్తున్నాయి.జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. నవంబరులో కురిసిన భారీ వర్షాలకు తామర, ఆకుముడత తెగులు సోకి పంట మొత్తం చేజారింది. ప్రభుత్వం నుంచి కేంద్ర బృందాలు వచ్చి నష్టపోయిన పంటలను పరిశీలించి వెళ్లాయేగానీ ఇప్పటికీ ఒక్క పైసా రైతులకు అందజలేదు. దీంతో మిర్చి నష్టపోయిన రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. దీంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన అంకంశెట్టి హనుమంతరావు (25) అనే రైతు 12 ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. ఇటీవల కురిసిన వర్షానికి పంట మొత్తం దెబ్బతింది. సాగు నిమిత్తం రూ.11 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పు తీరే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన వెంకటరెడ్డి పది ఎకరాల్లో మిర్చితో పాటు ఇతర పంటలు వేశాడు. రూ.30 లక్షలు అప్పులు తేలాయి. దీంతో ఆయనా ఆత్మహత్యనే దారిగా ఎంచుకున్నాడు. బేస్తవారిపేట మండలం పిటకాయగుళ్లలో చిలకల ఈశ్వర్‌రెడ్డి, మార్కాపురం మండలం బొందలపాడులో తవనం అచ్చిరెడ్డి, తర్లుపాడు మండలం పోతలపాడులో మూడమంచు భూరంగయ్య, గానుగపెంటలో గాయం సత్యనారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. అందరూ అప్పులబాధతోనే ప్రాణాలు తీసుకున్నారు. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. కుటుంబ పెద్దలను కోల్పోవడంతో పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags; Debts lingering in the aura

Leave A Reply

Your email address will not be published.