కళంకారీ రాష్ట్ర కళగా ప్రకటింపచేస్తాను
– టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి
– ఎస్వీ శిల్పకళాశాలలో ప్రారంభమైన మూడు రోజుల వర్క్‌షాప్
తిరుమల ముచ్చట్లు:

కళంకారిని రాష్ట్రకళగా ప్రకటించేలా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఒప్పిస్తానని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు . ఎస్వీ సంప్రదాయ శిల్ప శిక్షణ సంస్థలో సంప్రదాయ ఆలయ శిల్పకళలు – అనుబంధ అంశాలపై మూడు రోజుల వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛైర్మన్ మాట్లాడుతూ శిల్పకళాశాలలో కళంకారి రెండేళ్ల సర్టిఫికెట్ కోర్సును నాలుగేళ్ల డిప్లొమా కోర్సుగా మార్చేందుకు బోర్డులో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. 30 వేల సంవత్సరాల క్రితమే శిల్పకళ ప్రారంభమైందని, కళల్లో శిల్పకళకు గొప్ప స్థానం ఉందని చెప్పారు. వేల సంవత్సరాల క్రితమే ఆలయాలు, ప్రార్థనా మందిరాల నుండి ఈ కళ ప్రారంభమైందన్నారు . ప్రపంచంలోని ప్రతి దేశ చరిత్రకు శిల్పకళ ఆధారభూతమైందని వివరించారు. శిల్పకళ విద్యార్థుల నైపుణ్యం గొప్పదన్నారు. 17 సంవత్సరాల క్రితం ఈ కళాశాల పరిస్థితి చూసి సామూహిక మార్పులు చేశానన్నారు. ఈ కళాశాల విద్యార్థులతో అర అడుగు, ఒక అడుగు మేర శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతిమలు తయారు చేయించాలని గతంలో భావించానని చెప్పారు. స్వామివారు తనకు మళ్లీ అవకాశం ఇచ్చారని చెప్పారు. ఇలాంటి విగ్రహాలు ప్రతి ఇంట్లో ఉంచుకోవడం ద్వారా స్వామివారు తమతోనే ఉన్నారన్న భావన భక్తులకు కలుగుతుందని తెలిపారు. మూడు రోజుల వర్క్‌షాప్ ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మరింత పెంచుకోవాలని, శిల్పకళాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
జేఈవో సదా భార్గవి మాట్లాడుతూ గతంలో ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి హయాంలోనే కళాశాలకు సొంత భవనం ఏర్పాటైందని చెప్పారు . వర్క్‌షాపులో పనిచేస్తున్న శిల్పులకు ధరలు పెంచారని చెప్పారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని కరుణాకర రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడే ప్రకటించారని తెలియజేశారు. అదేబాటలోనే ప్రస్తుతం పయనిస్తూ కళాశాలను ప్రగతిపథంలో నడిపిస్తున్నామని చెప్పారు. వర్క్‌షాప్‌లు నిర్వహించి విద్యార్థులకు శిల్పకళలోని మెళకువలపై అవగాహన కల్పించామని తెలిపారు. కళాశాల ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 815 మంది విద్యార్థులను శిల్పులుగా తయారు చేసినట్టు తెలియజేశారు.
శిల్పకళా ప్రదర్శన ప్రారంభం
కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన శిల్పకళాప్రదర్శనను ఛైర్మన్ ప్రారంభించారు. ఇందులో ఆలయ నిర్మాణకళ, శిలా విగ్రహాలు, సుధా(సిమెంటు) విగ్రహాలు, కొయ్య విగ్రహాలు, లోహ విగ్రహాలు, సంప్రదాయ చిత్రకళ, సంప్రదాయ కళంకారి కళ, హస్తకళా ప్రదర్శనలు ఉన్నాయి. కుమారి పి.సాయిదేవిక నిరుపయోగమైన వస్తువులతో తయారుచేసిన వివిధ కళాకృతుల స్టాల్‌ను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. గాజుసీసాలు, మట్టికుండలు, జ్యూట్‌తో తయారుచేసిన గృహాలంకరణకు ఉపయోగపడే అనేక కళాకృతులు ఈ స్టాల్‌లో ఉన్నాయి.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్ఢు సభ్యులు యానాదయ్య, విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్‌రెడ్డి, ప్రముఖ స్థపతి సంతానకృష్ణన్, శ్వేత డైరెక్టర్ ప్రశాంతి, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags: Declare Kalankari as state art
