మద్యం లైసెన్సల రెన్యువల్ కు కొరవడుతున్న స్పందన

Deficient Response to Renewal of Alcohol Licenses

Deficient Response to Renewal of Alcohol Licenses

Date:12/07/2019

తిరుపతి ముచ్చట్లు:

కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలా.. లేక లైసెన్సులను జారీచేయాలా అనే దానిపై ఓ కమిటీని కూడా వేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీలను పరిశీలించడానికి కమిటీ సైతం చర్యలకు ఉపక్రమించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదికకు కనీస సమయం కావాల్సి ఉండడంతో ఇప్పటికే ఉన్న మద్యం దుకాణాల గడువును మూడునెలలు పొడిగించింది.

 

 

 

భవిష్యత్తులో మద్యాన్ని కేవలం ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో జిల్లాలో 20శాతం వరకు మద్యం దుకాణాలు తగ్గడం మద్యపాన నిషేధానికి బీజం పడినట్లే అయ్యింది.దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలుచేస్తూ.. క్రమేణా మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తామన్న వైఎస్‌ జగన్‌ మాట క్రమేణా ఆచరణలోకి వస్తోంది. ఏటా మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు సీఎం ప్రకటించడం.. బెల్టు దుకాణాలు ఎక్కడా ఉండకూడదని అధికారులను ఆదేశించడంతో మద్యం వ్యాపారులు నష్టాల భయంతో వెనకడుగు వేశారు.

 

 

 

 

ఫలితంగా జిల్లాలో 20 శాతం మద్యం దుకాణాలు తగ్గాయి.జిల్లాలో మొత్తం 427 మద్యం దుకాణాలు, 41 మద్యం బార్లు ఉన్నాయి. వీటికి 2017 జూలై నుంచి నిర్వహణ లైసెన్సులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్‌తో మద్యం దుకాణాల గడువు ముగియడం, కొత్త విధానం ఖరారు కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు ఉన్నవాటికి గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. జూన్‌ నెలాఖరు నాటికి ఈ మూడునెలల కాలానికి లైసెన్సు నగదు చెల్లించిన వారికి మాత్రమే అనుమతులు జారీచేసింది.మిగిలిన 75 దుకాణాలను రెన్యువల్‌ చేసుకోవడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో వాటి లైసెన్స్‌లను అధికారులు రద్దుచేశారు.

 

 

 

 

ఇందులో చిత్తూరు ఈఎస్‌ పరిధిలో 27, తిరుపతి పరిధిలో 48 దుకాణాలున్నాయి.  చిత్తూరు రూరల్‌ పరిధిలో 6, కార్వేటినగరం 1, మదనపల్లె 2, ములకలచెరువు 3, పుంగనూరు 4, పలమనేరు 4, వాయల్పాడు 1, పీలేరు 6, తిరుపతి అర్బన్‌ 4, తిరుపతి రూరల్‌ 4, పాకాల 6, పుత్తూరు 9, శ్రీకాళహస్తి 8, సత్యవేడు 12, నగరి లో 5 దుకాణాల నిర్వాహకులు లైసెన్స్‌ గడువును పొడగించుకోలేదు.జిల్లాలో ఉన్న మొత్తం మద్యం దుకాణాల్లో 20 శాతం వరకు దుకాణాల నిర్వాహకులు లైసెన్స్‌లను రెన్యువల్‌ చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు.

 

 

 

 

దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయమే. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా బెల్టు దుకాణాలు ఉండడానికి వీలు లేదని ఆయన ఆదేశాలు జారీచేశారు. బెల్టు దుకాణాల్లో మద్యం బాటిళ్లు కనిపిస్తే వాటిని సరఫరా చేసిన మద్యం దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో బెల్టు షాపుల ద్వారా మద్యం ఏరులై పారడం, ఎంఆర్‌పీ ఉల్లంఘన, అక్రమ మద్యం లాంటి వ్యవహారాలు జోరుగా సాగాయి.

 

 

 

 

మద్యం దుకాణాల వద్ద ఎంఆర్‌పీ ధరలు ప్రదర్శించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయం సైతం వ్యాపారులకు మింగుడుపడలేదు. పైగా దుకాణాల్లో రోజుకు రూ.2లక్షల వరకు మద్యం అమ్మకాలు జరిగితేనే లాభాలు వస్తాయని, ఇందుకు ఉపయోగపడే బెల్టు దుకాణాలు లేకపోవడం వల్ల చాలామంది వ్యాపారులు మద్యం నిర్వహణ నుంచి పక్కకు తప్పుకున్నారు.

అంతర్జాతీయ హోదా పేరుకు పరిమితమైన బెజవాడ ఎయిర్ పోర్ట్ 

Tags: Deficient Response to Renewal of Alcohol Licenses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *