ఢిల్లీ అగ్నిప్రమాదం.. 24 మంది మహిళలు మిస్సింగ్
న్యూఢిల్లీ ముచ్చట్లు:
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముండ్కా ఏరియాలోని ఓ నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది మహిళలతో పాటు ఐదుగురు పురుషుల ఆచూకీ లభించలేదు. ఆచూకీ లభించని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 14 మంది గాయపడగా, 13 మందికి చికిత్స అందించి డిశ్చార్జి చేసినట్లు పేర్కొన్నారు.
డీఎన్ఏ శాంపిళ్ల సేకరణ..
అయితే ఇప్పటి వరకు లభించిన మృతదేహాల్లో 25 మంది మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ 25 డెడ్‌బాడీల గుర్తింపునకు డీఎన్ఏ శాంపిళ్లను ఫోరెన్సిక్ అధికారులు సేకరించారని పేర్కొన్నారు. డీఎన్ఏ టెస్టుల అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో 50 మంది..!
అగ్నిప్రమాదం సంభవించిన అంతస్తులోని ఓ గదిలో 50 మంది ఉన్నట్లు ఫైర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మిస్సింగ్ అయిన వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టామన్నారు.
మీటింగ్‌లో ఉండగానే అగ్నిప్రమాదం..

అగ్నిప్రమాదంలో గాయపడిన ఓ మహిళ సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రి నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడారు. మేం మీటింగ్‌లో ఉండగానే అగ్నిప్రమాదం సంభవించింది. బయటకు వెళ్లేందుకు అక్కడ దారి లేదు. ఒకే ఒక్క ఎగ్జిట్ ఉన్నప్పటికీ అక్కడ మంటలు వ్యాపించాయి. ప్రమాదం సంభవించిన థర్డ్ ఫ్లోర్లో మొత్తం 250 నుంచి 300 మంది ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.
కరెంట్ పోయినా క్షణాల్లోనే పొగలు..
మేం మీటింగ్‌లో ఉండగానే కరెంట్ పోయింది.. ఇక క్షణాల్లోనే పొగలు వ్యాపించినట్లు మరో బాధితురాలు పేర్కొన్నది. గట్టిగా కేకలు వేస్తూ కిటీకిలు పగులగొట్టి తాళ్ల సహాయంతో బయటకు వచ్చినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడినట్లు ఆ మహిళ చెప్పింది.
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం
అగ్నిప్రమాదం సంభవించిన ముండ్కా ఏరియాను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఉదయం పరిశీలించారు. ఈ ఘటన పట్ల కేజ్రీవాల్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.
Tags: Delhi fire: 24 women missing
