డెంగీ డేంజర్ (మహబూబ్ నగర్ )

Dengie Danger (Mahabubnagar)

Dengie Danger (Mahabubnagar)

Date:09/10/2018
మహబూబ్ నగర్  ముచ్చట్లు:
జిల్లాలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ.. ప్రైవేట్‌ ఆస్పత్రులకు జ్వరాలతో బాధితులు బారులు తీరుతున్న పరిస్థితి ఉంది.. డెంగీ వచ్చి ప్లేట్‌లెట్లు తగ్గకుంటే వైద్యం సులువుగా అవుతుంది.. వాటి సంఖ్య తగ్గిందంటే మాత్రం రూ.వేలల్లో వైద్యం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి… ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నా జిల్లాలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా? అంటే అవి కూడా అరకొరే. వైద్య సేవల కోసం చాలా మంది హైదరాబాద్‌కు వెళ్తున్నారు.. ఇక ప్లేట్‌లెట్ల కోసమైతే రూ.వేలల్లో ఖర్చు చేసుకుంటున్నారు. డెంగీతో పేద.. మధ్య తరగతి కుటుంబాలవారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతి ఏడాది డెంగీ కేసులు నమోదు అవుతున్న సమయంలో ప్లేట్‌లెట్లు వేరు చేసే పరికరాలపై హడావుడి చేస్తున్న అధికారులు తరవాత దాని గురించి మరిచిపోతున్నారు. గత ఏడాది జనరల్‌ ఆస్పత్రిలో ప్లేట్‌లెట్ల యంత్రం ఏర్పాటుపై కలెక్టర్‌ స్పందించారు. ఆసుపత్రి అధికారులు ప్రతిపాదనలు కూడా ఇచ్చారు. కాని ఆ తరవాత ఆ ఊసే మరిచారు. ఇప్పటికే ఆస్పత్రిలో 2012 నుంచి రక్తం నుంచి ప్లాస్మా, ప్యాకెట్‌ సెల్స్, ప్లేట్లెట్‌లను వేరు చేసే పరికరం ఉంది. అది వినియోగించకపోవడంతో చెడిపోయింది. దానిని సైతం మరమ్మతు చేయించని పరిస్థితి ఉంది. ఇక రెడ్‌క్రాస్‌ కార్యాలయంలోనూ ఇలాంటి యంత్రమే ఉన్నా అవసరమైన అదనపు పరికరాలు లేక వినియోగించడం లేదు. దీంతో ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన పరిస్థితి వస్తే జనం హైదరాబాద్‌కు పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రితోపాటు రెడ్‌క్రాస్‌లో ప్లేట్‌లెట్లను వేరుచేసే యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో అవసరమైనవారు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు రక్తనిధి కేంద్రం లేదా హైదరాబాద్‌పై ఆధారపడుతున్నారు. ప్రైవేటు కేంద్రంలో ఒక ప్యాకెట్‌ ప్లేట్‌లెట్లు వేరు చేసి ఇవ్వడానికి రూ.13 నుంచి రూ.15 వేలు ఖర్చు అవుతుంది. పరిస్థితి బట్టి ఒకరికి రెండు..మూడు ప్యాకెట్లను ఎక్కించాల్సి ఉంటుంది. అయితే ఒక్క ప్యాకెట్‌ ప్లేట్‌లెట్లు ఎక్కిస్తే మొత్తానికి వైద్య ఖర్చులు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అవుతాయి.
ఇంకా అవసరమైతే మాత్రం రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేయాల్సిందే. 50 నుంచి 60 వేల మధ్య ప్లేట్‌లెట్లు ఉంటే ఇక్కడే వైద్యులు సేవలు అందిస్తున్నారు. అంతకంటే తగ్గితే మాత్రం హైదరాబాద్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌ ఆస్పత్రులకు వెళ్తే ఖర్చు పెరుగుతుంది. జిల్లాలో ఏటికేడు డెంగీ బాధితులు పెరుగుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 65 కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, రెడ్‌క్రాస్‌లోని ప్లేట్‌లెట్‌ పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తే జిల్లాలోని బాధితులకు ఇబ్బందులు తప్పుతాయి.
Tags:Dengie Danger (Mahabubnagar)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed