ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  

– హైదరాబాద్ లో ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అర్జీ
– అమెరికా విద్య పేరుతో కన్సల్టెన్సీ మోసాలు చేసిందని విద్యార్థిని ఫిర్యాదు

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి    పవన్ కళ్యాణ్  దృష్టికి తీసుకువస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి నిత్యం అర్జీలతో రాష్ట్రం నలుమూలల నుంచీ ప్రజలు వస్తున్నారు. మంగళవారం సాయంత్రం  పవన్ కళ్యాణ్  కార్యాలయం వద్ద ఉన్న అర్జీదారుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. వారు తెలిపిన సమస్యలు సాంతం విన్నారు.మదనపల్లెకు చెందిన ఎం.ఆర్.లహరి అనే విద్యార్థిని ఉన్నత విద్యకు అమెరికా వెళ్ళేందుకు కన్సల్టెన్సీని సంప్రదించింది. కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తామని చెప్పి తమ నుంచి రూ.30 లక్షలు కన్సల్టెన్సీ నిర్వాహకుడు వెంకట రెడ్డి వసూలు చేశారనీ, తీరా చూస్తే ఆ పేరుతో యూనివర్సిటీ లేదని, మోసపోయామని, లహరి, ఆమె తల్లి  లక్ష్మి వాపోయారు. ఇందుకు సంబంధించి వివరాలు నమోదు చేసుకొని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని తన కార్యాలయ అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. అమెరికాలో ఉన్న విశ్వ విద్యాలయాలు, కాలేజీలకు సంబంధించిన సమాచారం, ఉన్నత విద్యకు వెళ్ళేందుకు అవసరమైన గైడెన్స్ రాష్ట్ర విద్యార్థులకు అందించేలా చూడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లాకు చెందిన రిషిత అనే బాలిక నరాల బలహీనతతో బాధపడుతోంది. తమ బిడ్డకు వైద్యం అందించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తల్లిదండ్రులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వివరాలు తీసుకొని మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య నిపుణులతో, సంబంధిత శాఖతో మాట్లాడాలని కార్యాలయ అధికారులకు సూచించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ తమ సమస్యలు వివరిస్తూ వినతి పత్రం అందించారు.

• రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సఖ్యతే ప్రగతికి మార్గం

ఆల్ ఇండియా పర్మిట్ తోను, తెలంగాణ టెంపరరీ పర్మిట్ కట్టుకొని క్యాబ్స్ నడుపుతున్న ఆంధ్ర ప్రదేశ్ డ్రైవర్లను హైదరాబాద్ లో అక్కడి డ్రైవర్లు అడ్డుకొంటున్నారని, ఫలితంగా 2 వేల కుటుంబాలు రోడ్డునపడుతున్నాయని ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 2వ తేదీ నుంచి ఉమ్మడి రాష్ట్ర పరిధి అయిపోయిందని చెబుతూ ఇబ్బందిపెడుతున్నారని తెలిపారు.  పవన్ కళ్యాణ్  స్పందిస్తూ “ఉమ్మడి రాజధాని గడువు కాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లు హైదరాబాద్ లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదు. 2 వేల కుటుంబాల వేదన దీనిలో దాగుంది. కార్మికులు కలసికట్టుగా ఉండాలి. తెలంగాణ డ్రైవర్లుకు విన్నపం.. ఇక్కడ రాజధాని పనులు మొదలైతే ఏపీ డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుంది. అప్పటి వరకూ సాటి డ్రైవర్లపై మానవత థృక్పధంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటాం. రెండు తెలుగు రాష్ట్రాలు తగు విధంగా సహకారం అందించుకోవాల్సిన అవసరం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సఖ్యతే మనల్ని ప్రగతిలో ముందుకు నడిపిస్తుంద”న్నారు.

 

Tags: Deputy Chief Minister Pawan Kalyan received requests directly from the people

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *