రైతులను, బ్యాంకర్లను ముప్పుతిప్పలు పెడుతున్న ధరణి వెబ్‌సైట్

Dharani Website is a threat to farmers and bankers

Dharani Website is a threat to farmers and bankers

Date:12/01/2019
నిజామాబాద్ ముచ్చట్లు:
రైతులకు మరింత సులభతరంగా, పారదర్శకంగా పంట రుణాలు అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ధరణి వెబ్‌సైట్ అటు రైతులను, ఇటు బ్యాంకర్లను ముప్పతిప్పలు పెడుతోంది. ఈ వెబ్‌సైట్ సహాయంతో సకాలంలో రుణాలు పొందవచ్చని ఆశించిన రైతులకు పెట్టుబడి సాయం అందని ద్రాక్షగా మారుతుండగా, ధరణి వినియోగం వల్ల సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయని భావించిన బ్యాంకర్లకు కూడా నిరాశే ఎదురవుతోంది. ధరణి వెబ్‌సైట్‌తో పంట రుణాల పంపిణీ ప్రక్రియను అనుసంధానించగా, ఈ వెబ్‌సైట్ సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుండడం వల్ల రుణ పంపిణీ లక్ష్యానికి విఘాతం ఏర్పడుతోంది. నిజామాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. జిల్లా అధికార యంత్రాంగం నిన్నమొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో తీరిక లేకుండా ఉండడం, మునుముందు జరుగనున్న వరుస ఎన్నికలకు కసరత్తులు చేయాల్సి వస్తుండడంతో పంట రుణాల పంపిణీ అంశాన్ని సమీక్షించడం కొంత ఆలస్యం అవుతోంది.
ఈ నేపథ్యంలో ధరణి సమస్యకు పరిష్కారం చూపుతూ లక్ష్యాల సాధనకై తమకు ఎవరు సహాయం చేస్తారోనని బ్యాంకర్లు ఎదురుతెన్నులు చూస్తున్నారు. భూ సమస్యలన్నింటికి పరిష్కారం చూపిస్తూ, రైతులకు సింగిల్ విండో పద్ధతిలో సేవలు అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను రూపొందించింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఇతర కీలకమైన ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు ఈ వెబ్‌సైట్‌ను వినియోగించుకుని తమ సేవలను రైతులకు సులభతర పద్ధతిలో అందించాలన్నది ప్రభుత్వ అభిమతం. ఈ వెబ్‌సైట్‌ను గత కొద్ది మాసాల క్రితమే అధికారికంగా ప్రారంభించినప్పటికీ, ఇంకనూ అనేక సాంకేతిక సమస్యలు దూరంకాలేకపోతున్నాయి. ప్రధానంగా వెబ్‌సైట్ తెరుచుకోకపోవడం, ఒకవేళ తెరుచుకున్నా అందులో భూ ప్రక్షాళనకు సంబంధించిన రికార్డుల వివరాలన్నీ పూర్తిస్థాయిలో అప్‌లోడ్ చేయబడి లేకపోవడంతో రైతులకు వ్యవసాయ రుణాలను అందించేందుకు బ్యాంకర్లకు అవరోధాలు ఎదురవుతున్నాయి.
ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ, ఇంకనూ ఇది బాలారిష్టాలను అధిగమించకుండా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేకపోతోందనే అభిప్రాయాలు అధికార వర్గాల నుండి వ్యక్తమవుతున్నాయి. ఈ వెబ్‌సైట్ ద్వారా భూరికార్డుల నకళ్లు, ఇతర భూ సంబంధిత వివరాలు, రుణ లావాదేవీల చిట్టా, భూముల అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీలను వెంటదివెంట తెలుసుకునేందుకు వీలుంటుంది.వ్యవసాయ రుణాల మంజూరుకు పాస్ పుస్తకాలను తనఖా పెట్టుకోవడం, పూచీకత్తులు తీసుకోవడం, పాస్ బుక్కులలో వివరాలను నిక్షిప్తం చేయడం వంటి వాటిని పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేస్తూ, ధరణి వెబ్‌సైట్ ద్వారా రైతుల అర్హతను పరిశీలించుకోవాలని సూచించింది. రైతులకు రుణాలు అందించేందుకు ఎలాంటి ఆంక్షలు విధించరాదని సర్కారు స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ధరణి వెబ్‌సైట్ పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం, ప్రభుత్వం జారీ చేసిన ఖచ్చితమైన మార్గదర్శక సూత్రాలు పాటించాల్సి ఉండడం వల్ల రుణాల పంపిణీలో జాప్యం కొనసాగుతోంది.
Tags:Dharani Website is a threat to farmers and bankers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *