Natyam ad

ధరిణి…అంతా అయోమయం

-ఎందుకు చేశారు? ఎవరు చేశారు?

వరంగల్ ముచ్చట్లు:

జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెరకు చెందిన పసునూరి సోమనర్సయ్యకు 1.12 ఎకరాల భూమి ఉంది. అయితే ప్రస్తుతం 0.10 ఎకరాలు మాత్రమే ఆయన పేరిట కనిపిస్తున్నది. మిగతా 1.02 ఎకరాలను అదే గ్రామానికి చెందిన మరొకరి పేరిట మార్చారు. ఎలా, ఎప్పుడు జరిగింది? ఎవరు సంతకాలు పెట్టారు? ఎందుకు చేశారు? ఎవరు చేశారు? ఈ ప్రశ్నలన్నింటికీ ధరణి పోర్టల్ దగ్గర సమాధానం లేదు.బొమ్మరకు చెందిన ఒక రైతుకు ఎకరంన్నర భూమి ఉన్నది. ప్రభుత్వం ప్రజావసరాల కింద భూసేకరణ జరిపింది. అయితే ఆ భూమి ఇతరుల పేరిట చూపిస్తున్నది. దీంతో ఆయనకు నష్టపరిహారం దక్కలేదు. ఎవరి పేరు మీద భూమి కనిపిస్తున్నదో ఆయన చెక్కు తీసుకెళ్లి ఇచ్చారు. ఒరిజినల్ రైతు మాత్రం హక్కుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.అలాగే బొమ్మెర గ్రామంలో ఒకాయనకు ఎకరం పొలం ఉంది. ఆయన ఊరొదిలి హైదరాబాద్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఊర్లో భూ సేకరణ జరిగింది. పట్టాదారునికి ఆ విషయమే తెలియదు. అదే ఊరికి చెందిన మరొకాయన అఫిడవిట్ సమర్పిస్తే నష్టపరిహారం ఇచ్చేశారు. విషయం తెలుసుకున్న హక్కుదారుడు లబోదిబో మన్నాడు. తనకు డబ్బులు ఇప్పించాలంటూ పెద్దలందరినీ అడిగాడు. అధికారుల చుట్టూ తిరిగాడు. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ న్యాయం మాత్రం జరగలేదు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.లీఫ్స్, గ్రామీణ న్యాయపీఠం, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన భూ న్యాయ శిబిరంలో ఇలాంటి అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ధరణి పోర్టల్ వచ్చినప్పటి నుంచి కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లోని వ్యక్తులకు తెలియకుండానే, పట్టాదారులకు సమాచారం లేకుండానే మారిపోతున్నాయి. ఎవరి భూమి? ఎవరు అమ్మారు? ఎవరు కొన్నారు?

 

 

 

Post Midle

సమర్పించిన డాక్యుమెంట్లు నిజమైనవేనా? డూప్లికేటా? అని పరిశీలించడం లేదు. కనీసం పట్టాదారుడిని మాట మాత్రమైనా ఎంక్వయిరీ చేయడం లేదు. ఆయన ప్రమేయమే లేకుండా మారిపోతున్నాయి. ఇంకొన్నేమో చేతిలో పట్టాదారు పాసు పుస్తకం ఉంటుంది. కానీ అందులో భూమి మాత్రం మరొకరి పేరిట నమోదవుతున్నది. గతంలో ఎవరికీ అమ్మకపోయినా, కనీసం విక్రయిస్తామంటూ పత్రాలు రాసుకోకపోయినా పేర్లు మారిపోతున్నాయి.ఇదంతా అధికారులు చేస్తున్నారా? కంప్యూటర్ ఆపరేటర్ల వల్ల తప్పిదాలు జరుగుతున్నాయా? సాంకేతిక లోపాలతో ఒకరి భూమి మరొకరి పేరిట నమోదవుతుందా? ఈ విషయాలేవీ అంతుచిక్కడం లేదు. అధికారులు కూడా తమకే పాపం తెలియదంటున్నారు. ఏదో సాంకేతిక లోపాలతో మారిందనుకున్నా.. తప్పిదాలను సవరించాల్సిన అధికారులు ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు. సరిదిద్దాల్సిన తహశీల్దార్ తామేం చేయలేమంటున్నారు. సివిల్ కోర్టుకు వెళ్లాలని ఉచిత సలహాలు ఇచ్చి తప్పించుకుంటున్నారు.అయితే కోర్టుకు వెళ్లాలన్నా అవతలి వ్యక్తి దాఖలు చేసిన డాక్యుమెంట్లు కావాలి. మ్యుటేషన్ కోసం ఏ ఏ పత్రాలు సమర్పించారో ఇవ్వండంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన తహశీల్దార్‌లు ఇవ్వడం లేదు. ఏ చట్టం ప్రకారం, ఏ పత్రాలను పరిశీలించి భూ బదలాయింపు చేశారో చెప్పండంటూ దరఖాస్తు చేసుకున్న పట్టించుకోవడం లేదు. ఆ నకిలీ పత్రాలను ఇవ్వడానికి అధికారులు అసలు పట్టాదారులను తిప్పించుకుంటున్నారు.ఆర్నెల్లుగా అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన కొందరు సమాచార హక్కు చట్టం కమిషనర్లను ఆశ్రయించినట్లు తెలిసింది.

 

 

 

దొంగ పత్రాలను అసలైన హక్కుదారులకు ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది? నిజమైన డాక్యుమెంట్లయితే న్యాయస్థానంలో వారికే అనుకూలంగా తీర్పు వస్తుంది కదా.. ఈ పత్రాలను ఆర్టీఐ కింద అడిగినా ససేమిరా అంటున్న అధికారుల వైఖరి పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తమ భూమిని వేరే వాళ్ల పేరిట ఎలా రాశారు? ఎందుకు రాశారు? ఏ పత్రాలు వారు దాఖలు చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు గోప్యంగా ఉంచేవేమీ కావు. కానీ అధికారులు మాత్రం సమాచార హక్కు చట్టం కింద బాధితులు అడిగినా ఇవ్వడం లేదు. ప్రధానంగా నాగర్ కర్నూలు, రంగారెడ్డి, సంగారెడ్డి, జనగామ జిల్లాల్లో ఇలాంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. తాము ఎవరికీ అమ్మని భూమిని ఇతరుల పేరిట రాసిన ఆధారపత్రాలను అడిగితే ఇబ్బంది పెడుతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పీలుకు వెళ్లినా న్యాయం జరగడం లేదు.హైదరాబాద్‌లో సమాచార హక్కు చట్టం కమిషన్ కార్యాలయానికి కూడా వస్తుండడం గమనార్హం. తరతరాలుగా అనుభవిస్తున్న తమ భూమిని అన్యాయంగా ఇతరుల పేరిట రాశారని, మార్చమని అడిగితే అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఆర్టీఐ కింద వాళ్లు సమర్పించిన దరఖాస్తులు, సేల్ డీడ్స్, ఇతర ఆధార పత్రాలను అడిగితే ఇవ్వడం లేదని కమిషనర్లను ఆశ్రయిస్తున్నారు. కొందరైతే ఆర్నెల్లుగా అధికారుల చుట్టూ చక్కర్లు కొట్టిన పట్టించుకోవడం లేదు.ఏదైనా భూ సమస్య వస్తే ధరణి పోర్టల్ లోని 33 మాడ్యూల్ ద్వారానే అప్లై చేసుకోవాలి. దీంతో చాలా మంది మీ సేవా కేంద్రానికి వెళ్లి అన్ని ఆధార పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకుంటున్నారు.

 

 

 

వాటిలో చాలా వరకు రిజెక్ట్ చేస్తున్నారు. ఏ కారణంతో రిజెక్ట్ చేస్తున్నారో మాత్రం దరఖాస్తుదారునికి చెప్పడం లేదు. ఆ కారణాలేమిటో చెబితే సంబంధిత పత్రాలను జత చేసే అవకాశం ఉంటుంది. దరఖాస్తు తిరస్కరణకు కారణాలేమిటో చెప్పాలని సమాచార హక్కు చట్టం కింద అడిగినా నో రెస్పాన్స్. అప్పీలుకు వెళ్లినా నో రెస్పాన్స్. దీంతో ఆర్టీఐ కమిషనర్ల దగ్గరికి ధరణి దరఖాస్తుల తిరస్కరణకు కారణాలమేమిటో చెప్పడం లేదంటూ వస్తున్నట్లు తెలిసింది. కనీస బాధ్యతను మరవడంతో బాధిత రైతులు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. అక్కడా సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఓ రైతుకు పాస్ పుస్తకం ఉన్నది. తనకున్న ఎకరం పొలాన్ని కట్నంగా ఇచ్చి బిడ్డ పెళ్లి చేశాడు. కానీ ఆ భూమిని వేరే వారి పేరిట పట్టా చేశారు. తన భూమిని ఆయన పేరిట రాశారంటూ అధికారులను అడుగుతూనే ఉన్నాడు. ఏండ్లు గడిచాయి. బిడ్డ మరో బిడ్డకు జన్మనిచ్చింది. కట్నం కింద ఇస్తామన్న పొలాన్ని ఇవ్వడం లేదని అల్లుడు బిడ్డను ఇంటికి పంపించాడు. అధికారులు మాత్రం తామిప్పుడు ఏం చేయలేమంటూ చేతులెత్తేశారు. సివిల్ కోర్టుకు వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. ఉన్న పొలాన్ని కట్నంగా ఇచ్చి బిడ్డ పెళ్లి చేసిన సామాన్య రైతు కోర్టుకు వెళ్లి కేసు దాఖలు చేయగలడా? అడిగిన పత్రాలు సమర్పించగలడా? ఖర్చులు ఎవరు భరించాలి? అన్యాయంగా రైతు పొలాన్ని ఇతరుల పేరిట రాసిన అధికారులే సరిదిద్దాల్సిన బాధ్యతను మరిచారు.

 

Tags: Dharini…everything is confused

Post Midle

Leave A Reply

Your email address will not be published.